చంద్రబాబును ఎందుకు కలిశాను.. ఏం మాట్లాడాను అనేది నా వ్యక్తిగతం: లగడపాటి

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే చెబుతాను తప్పితే చాటుమాటు రాజకీయాలు చేయబోనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన లగడపాటిని టీడీపీలో ఎప్పుడు చేరబోతున్నారని మీడియా ప్రశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. చంద్రబాబును రహస్యంగా అర్ధరాత్రి ఎందుకు కలవాల్సి వచ్చిందన్న ప్రశ్నకు అది తన వ్యక్తిగతమన్నారు.

చంద్రబాబును తాను ఎందుకు కలిశాను? ఎప్పుడు కలిశాను? ఎన్నిగంటలు మాట్లాడాను అన్నది తన వ్యక్తిగతమన్నారు. చంద్రబాబుతో జరిగిన సంభాషణను బయటపెట్టాల్సిన అవసరం లేదన్నారు. రోజూ ఎంతోమందిని కలుస్తుంటానని వారితో మాట్లాడినవన్నీ బయటపెడితే తనకు వ్యక్తిత్వం అంటూ ఏముంటుందని ప్రశ్నించారు. చంద్రబాబును తాను రహస్యంగా కలవలేదని స్పష్టం చేశారు.

అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని లగడపాటి పేర్కొన్నారు. ఇచ్చిన మాటపై కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్న వ్యక్తిని తానని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి తిరిగి రమ్మని ఎంతోమంది ఆహ్వానించారని అయితే తనకు ఆ ఆలోచన లేదని లగడపాటి పేర్కొన్నారు.

సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓ మీడియా సంస్థ యజమానితో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*