వెండితెరపై మన్యం వీరుడి బయోపిక్

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. అల‌నాటి న‌టీమ‌ణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి హిట్టవడంతో దర్శక నిర్మాతలంతా ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ జీవితంపై వ‌చ్చిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విజ‌యం సాధించ‌గా మ‌రో భాగం మ‌హానాయ‌కుడు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరెక్కిన యాత్ర సినిమా కూడా ఫిబ్రవరి 8 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. మ‌రోవైపు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో సైరా నిర్మాణం జరుపుకున్నది.

అయితే తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా తిరుగుబాటు చేసిన మ‌న తెలుగు మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని కూడా సినిమాగా చూపించ‌బోతున్నారు. ‘సీతారామరాజు’ ‘ఏ ట్రూ వారియర్‌’ పేరుతో రిసాలి ఫిల్మ్‌ అకాడమీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గంగపుత్రులు, రొమాంటిక్‌ క్రైమ్‌ కథ చిత్రాల దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి ఈ బ‌యోపిక్‌కు దర్శకత్వం వహించ‌నున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఆగష్టు లో సినిమాను విడుద‌ల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూర్తిగా ఏపీలోనే నిర్మాణం జరుపుకోబోతున్న ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*