సహాయనటి అయిన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపిన సహాయ దర్శకుడు

భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ తమిళ సినీ సహాయ దర్శకుడు ఆమెను ముక్కలుగా నరికి చంపాడు. చెన్నై శివారులో జరిగిన ఈ ఘటనలో రెండు వారాల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 21న పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో ఓ యువతి కాళ్లు, చేయిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె ఎవరన్నది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి చెన్నైలోని ఈక్కాడుతాంగల్‌లో ఉంటున్న నాగర్‌కోవిల్‌కు చెందిన సహాయనటి సంధ్య (38)గా ఆమెను గుర్తించారు.సంధ్య గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త, సహాయ దర్శకుడు అయిన బాలకృష్ణన్‌ (51)ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. సంధ్య రాత్రుళ్లు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుతుండడం, చాట్ చేస్తుండడం, ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వెళ్తుండడంతో భర్త అనుమానించాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని భావించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. వివాహేతర సంబంధంపై భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా, తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చి చెప్పింది.

ఈ విషయమై గతనెల 19న సంధ్య-బాలకృష్ణన్ మరోమారు గొడవ పడ్డారు. మాటమాట పెరగడంతో సహనం కోల్పోయిన బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*