చంద్రబాబు మెచ్చిన ఎమ్మెల్యే ఆదర్శంగా నిలుస్తున్న అద్దంకి నియోజక వర్గం

వలస వార్తలతో ప్రకాశం జిల్లా రాజకీయ వేడెక్కింది. ఎమ్మెల్యేల పనితీరుని సమగ్రంగా సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అద్దంకి నియోజక వర్గం ఆకట్టుకొంది. ప్రజలకు సేవల్ని చేర్చడంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకొంటోంది.

ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో ఏదైనా అనారోగ్యం వస్తే పేద మధ్యతరగతి వర్గాలు హడలి పోయే పరిస్థితి. ఇలాంటి ఆర్తులను ఆదుకుంటుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. దీన్ని అద్దంకి నియోజకవర్గ ప్రజల కోసం సద్వినియోగం చేయడంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సఫలీకృతులయ్యారు. ఈ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి తో ఎంతోమంది పేదలకు వైద్యపరంగా భరోసా దొరికింది. ఎమ్మెల్యే చొరవతో జోరైన ఆర్థిక సాయాన్ని ఆసరాగా చేసుకొని ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని చక్కదిద్దు కోగలిగారు.

అద్దంకి నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో సుమారు 4 వేల మంది లబ్ధిదారులు ముఖ్యమంత్రి నుంచి సాయం అందుకొని సరైన వైద్యం చేయించుకోగలరు. స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిరంతరం ప్రజల్లో ఉంటారు. ఆయన గ్రామాల్లో పర్యటించిన సమయాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న అనేకమంది వారి సమస్యలను విన్నవించుకునే వారు. వారి ఆశలకు తగినట్లుగానే ఎమ్మెల్యే తక్షణం స్పందించి బాధితుల కోసం ముఖ్యమంత్రి తలుపు తట్టే వారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఆర్థిక సాయం త్వరగా అందేలా కృషి చేస్తున్నారు.

వైద్యంలో జాప్యం లేకుండా ఆసుపత్రులకు ముందుగానే ఎల్.ఓ.సి.ఇప్పిస్తున్నారు. లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న మోకాళ్ళ ఆపరేషన్లు ఎంతో మందికి ఈ పథకం ద్వారా చేయించగలిగారు. ముఖ్యమంత్రి సహాయనిధిని వినియోగించుకోవడంలో అద్దంకి ప్రకాశం జిల్లాలో అగ్ర స్థానంలో ఉండడం విశేషం. అలా క్లిష్టమైన చికిత్సలు పొంది, ఆరోగ్యవంతులైన కొందరిని పలకరిస్తే వారి మోములో సంతోషం, ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞత వ్యక్తమయ్యాయి.

*అద్దంకి నియోజక వర్గం
ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులు 4 వేలు
ప్రజలకు అందిన సహాయ విలువ రూ. 30 కోట్లు*

ఈ రీతిన సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్ల ప్రజల్లో చాలా సానుకూల వైఖరి వ్యక్తం అవుతోంది. నియోజక వర్గంలో ఎమ్మెల్యే రవికుమార్ అంటే ఆత్మీయత వ్యక్తం అవుతోంది. ఈ సమాచారం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెద్దల్లో చర్చనీయాంసం అవుతోంది. రాజకీయాల్ని పట్టించుకోకుండా ప్రజా సేవలో దూసుకెళుతున్న అద్దంకి ఎమ్మెల్యే తీరు పట్ల ముఖ్యమంత్రి కూడా అబిమానంతో ఉన్నట్లు తెలుస్తోంది.

——————
*నరకయాతన తప్పింది*

అద్దంకి పట్టణంలోని శ్రీరాంనగర్ ఎస్టీ కాలనీకి చెందిన చల్లా కుమారస్వామికి 40 ఏళ్ల వయసుకే మోకాళ్ళు అరిగిపోయాయి. నొప్పులతో ఐదేళ్లపాటు నరకం చూసాడు. తేలిగ్గా కదలలేని స్థితి. కర్ర సాయంతో మాత్రమే అతి కష్టంగా అడుగులు వేసేవాడు. ఆపరేషన్ చేయించుకునేందుకు స్థోమత లేక అలాగే బతుకు బండిని ఈడ్చేవాడు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆ కాలనీ పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానిక కార్యకర్తలు కుమారస్వామి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రవికుమార్ వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.17 లక్షలు మంజూరు చేయించారు. 2017 సెప్టెంబర్ నెలలో కుమారస్వామి రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. అప్పటినుంచి తాను సాధారణ జీవితం గడుపుతున్నానని సంతృప్తి వ్యక్తం చేశాడు కుమారస్వామి. ప్రస్తుతం అతడికి ఇదే టీడీపీ ప్రభుత్వం నెలకొల్పిన అన్న క్యాంటీన్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఉపాధి కూడా దొరికింది.

అద్దంకి నియోజక వర్గంలో ఇటువంటి తార్కాణాలు ఎన్నో కనిపిస్తుంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*