దోవల్ ఫోన్‌కాల్‌తో అలజడి.. అమెరికా కన్నెర్రతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ కాల్‌తో పాకిస్థాన్‌కు చిక్కులు పెరిగాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్‌కు దోవల్ ఫోన్ చేసి పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఎఫ్-16 వినియోగించిందని ఆధారాలతో సహా వివరించారు. దీంతో అమెరికా పాకిస్థాన్‌పై కన్నెర్ర చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఎఫ్ -16 వినియోగించడంపై వివరణ ఇవ్వాలని ఇమ్రాన్ సర్కార్‌ను కోరింది.

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జైష్ ఎ మహ్మద్ సుసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పీఓకేలోని జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో 300మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

భారత వైమానిక దళం దాడులతో ఉలిక్కిపడిన పాకిస్థాన్ మరుసటి రోజే తమ వైమానిక దళాన్ని రంగంలోకి దించింది. సరిహద్దు వెంబడి భారత సైనిక స్థావరాలపై బాంబుల దాడి కురిపించింది. పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ తన వద్ద ఉన్న మిగ్-21 యుద్ధ విమానంతో పాకిస్ధాన్ వైమానిక దళానికి చుక్కలు చూపించాడు. తన వద్ద ఉన్న మిగ్-21తో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16ను నేలకూల్చాడు. ఈ క్రమంలోనే పాక్ వైమానిక దళం జరిపిన ప్రతిదాడిలో తన విమానం నుంచి పారాచూట్ సాయంతో పీఓకేలో దిగాడు. ఆ తర్వాత స్థానికులు అభినందన్‌పై దాడి చేయడం, ఇంతలో పాక్ ఆర్మీ చేరుకోవడం, అభినందన్‌ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.

అభినందన్ తన మిగ్-21తో అత్యంత అధునాతన ఎఫ్ -16 విమానాన్ని నేల కూల్చడంతో పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. భారత వైమానిక దళం దీనికి సంబంధించిన వివరాలను కూడా బహిర్గత పరిచింది. ఎఫ్-16 విమానం ద్వారా ప్రయోగించిన అమ్‌రామ్(ఎయిమ్-120 అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్) క్షిపణి శకలాలను కూడా ప్రపంచానికి చూపింది.

విషయం తెలుసుకున్న అమెరికాకు నిద్ర కరవైంది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌పైకి ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించడంపై పాకిస్థాన్‌పై మండిపడింది. అంతేకాదు రష్యాకు చెందిన 50 ఏళ్ల క్రితం నాటి మిగ్-21తో ప్రపంచంలోనే అతి గొప్ప యుద్ధ విమానంగా చెప్పుకుంటోన్న ఎఫ్-16 విమానాన్ని కూల్చడాన్ని అమెరికా అవమానంగా భావిస్తోంది. దీంతో దీనిపై నిజానిజాలు తెలపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. దీంతో పాక్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. దెబ్బమీదదెబ్బతో ఉక్కిరిబిక్కిరౌతున్న పాకిస్థాన్‌కు అమెరికా తాజా వార్నింగ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*