‘మా’ ఎన్నికల్లో ఓటేసిన చిరంజీవి, నాగార్జున.. సాయంత్రమే ఫలితాలు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఫిల్మ్ చాంబర్ వద్ద సినీ ప్రముఖులతో కోలాహలంగా ఉంది. రెండేళ్లకు ఓసారి ‘మా’ ఎన్నికలు జరగనుండగా, ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా-సీనియర్ నటుడు నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో ఈ రాత్రికే తేలిపోనుంది.

మొత్తం 745 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, రాత్రి కల్లా తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా, గత కొన్ని రోజులుగా శివాజీ రాజా- నరేశ్ ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. గెలుపుపై శివాజీ రాజా-నరేశ్ ప్యానెళ్లు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మద్దతు తమకేనని ఇరు వర్గాలు ప్రకటించినా.. తన మద్దతు నరేశ్ ప్యానెల్‌కేనని మెగా బ్రదర్ నాగబాబు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలి వస్తుండడంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ సందడిగా మారింది. చిరంజీవి, నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, కృష్ణ భగవాన్‌, సాయికిరణ్‌, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*