భాగ్యనగర్ గణేశ నిమజ్జనోత్సవంలో మోహన్ భాగవత్ సందేశం

హైదరాబాద్:

గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదని, దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సూచించారు. కేవలం మంచితనం ఉంటే సరిపోదని, దానితోపాటు శక్తి కూడా ఉండాలన్నారు. శక్తి అనేది ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కొనేందుకు అవసరమని చెప్పారు. శక్తితోపాటు జ్ఞానం కూడా అవసరమని వినాయకుడు చెబుతున్నాడని, గణేశ్ ఉత్సవాల ద్వారా హిందువులంతా ఈ గుణాలను అలవరచుకుని, సంఘటిత శక్తిగా నిలవాలన్నారు. భాగ్యనగర్‌లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మొజంజాహీ మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ చౌక్‌ నుంచి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

జగదంబ, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని పూజించి గణేశుడు విశ్వాధిపత్యాన్ని పొందాడని, భారతీయులు జగదంబ స్వరూపమైన భారతమాత పూజలో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలన్నారు. దేశంలోని జనం, జలం, జమీన్(భూమి), జాన్వర్ (జంతువులు) మొదలైనవాటిపై భారతీయులకు భక్తి ఉండాలని చెప్పారు.

దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు సమాజంలో విభేదాలు సృష్టించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయని, భారతీయులు నిరంతరం జాగరూకతతో, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అంతకు ముందు ఆయన చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*