వేదమై ఘోషించే వ్యాసుడు నడయాడిన నేల

వేదం- జీవనసారం! వేదం- ప్రాణనాడులకు స్పందన నేర్పిన ఆది ప్రణవనాదం! అనంత జీవన వాహినిగా సాగే వేదం- విశ్వమనే కావ్యానికి తిరుగులేని భాష్యం! ఆ మంత్రస్వరం జగతికి శ్రీకారం చుట్టే సుస్వర ఛరీగమనం! మార్కులు, ర్యాంకులు అంటూ వేలంవెర్రిగా పరుగులు పెడుతున్న ఈ కాలంలో- ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది బాసర శ్రీభారతి వేదపీఠం.

వేదం- నిత్య చైతన్య దీపిక. వేదం- నిరంతరాన్వేషణా జ్యోతిక. వేదం ధర్మాన్ని ఉపదేశిస్తుంది. వేదం శాంతిని కాంక్షిస్తుంది. కార్యోపదేశం చేస్తుంది. సన్మార్గంలో నడిపిస్తుంది. ఇహపర లోకజ్ఞానాలను అందిస్తుంది. రామాయణం.. మహాభారతం.. అష్టాదశ పురాణాల్లో రుషులు, పురాణపురుషులెందరో వేదాలను అనుసరించి మోక్షం పొందారు. తరతరాలుగా సత్యం, ధర్మం ఈ భూమండలం మీద ఇంకా వర్ధిల్లుతున్నాయంటే కచ్చితంగా అది వేదాల చలవే. అలా అని, వేదం అనే మాటను ఒక మతానికో, ఒక వర్గానికో పరిమితం చేయడం సబబు కాదు. వేదం సర్వ మతాల సారం. వేదస్వరం భారతీయ విలువలను కాపాడే సుస్వరం.

వేదం అంటే అదేదో గ్రాంథిక భాష అని, టీకా తాత్పర్యాలు అర్ధంకావని చాలామందికి ఉండే అపోహ. అందుకే చాలా ఏళ్లుగా వాటిని నిర్లక్ష్యం చేశారు. ఈ గ్లోబల్ కాలంలో ఇంకా వేదా పఠనమేంటని నొసలు చిట్లించుకున్నారు. క్రమంగా విద్య- కార్పొరేట్ రంగు పులుముకుంది. ర్యాంకుల వెంట వేలంవెర్రిగా పరుగులు తీస్తోంది. సిలబస్ కాలనాగులై బుర్రల్లో బుసలు కొడుతోంది. విద్యార్ధులంతా స్కూల్లో బట్టీ యంత్రాలుగా మారిపోతున్నారు. ఫ్యాక్టరీకీ బడికీ పెద్దగా తేడా లేకుండా పోయింది! ప్రాపంచిక జ్ఞానం కంటే పాఠ్యపుస్తక పఠనమే ముఖ్యమైపోయింది. పరీక్షలే పరమావధిగా, ర్యాంకులే టార్గెట్‌గా నడుస్తున్న విద్యావ్యవస్థను చూస్తుంటే జాలిపడటం తప్ప చేసేదేం లేదు.

ఏసీ రూముల్లోంచి, అగ్గిపెట్టెల్లాంటి తరగతి గదుల్లోంచి, బండెడు బరువున్న పుస్తకాల సంచీల్లోంచి, అస్సైన్‌మెంట్లలోంచి, ర్యాంకుల్లోంచి ఒక్కసారి బటయకొచ్చి బాసర పుణ్యగోదావరి తీరాన నిలబడి చూడండి! అక్కడ ఒక్కసారి దృష్టి నిలపండి! బాసర సరస్వతీమాత ఒడిలో వేదాలు ఔపోసన పడుతున్న ఆ చిన్నారులను ఓసారి తిలకించండి!

వేదాలు అన్నాం కదాని నుదుట విభూది రాసుకుని, అంగవస్త్రం ధరించి, త్రికాల సంధ్యావందనం చేసి, అంతలావు గ్రంధం ముందేసుకుని ముక్కుమూసుకుని పారాయణం చేస్తారనుకుంటే పొరపడ్డట్టే. చదివేది వేదమే అయినా, అభ్యసించే తీరు మాత్రం వేరు! పఠనం ఒక్కటే కాదు. అందులో జీవిత ప్రయాణం నిక్షిప్తమై ఉంటుంది. స్వరం ఒక్కటే కాదు.. జీవిత సారం కూడా మిళితమై ఉంటుంది. పెదాల్లోంచి పదాలొక్కటే కాదు.. పాదాల్లోంచి అందెలు కూడా రవళిస్తాయి.

శ్రీ వేద భారతీ పీఠం! నిర్మల్ జిల్లా పుణ్యగోదావరి తీరాన బాసర సమీపంలో 6 ఎకరాల సువిశాల ఆశ్రమం! 9 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ పాఠశాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వేదపాఠశాల అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే స్థలమనే అపోహకు ఇక్కడ చోటు లేదు. కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడ వేదం అభ్యసించొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయిలకు కూడా ఈ ఆశ్రమంలో అవకాశం కల్పించారు. ఆ మాటకొస్తే రుగ్వేదంలో చాలామంది స్త్రీలు వేదాలు పారాయణం చేశారు. ఇంద్రుని కోసం అపాల సోమయజ్ఞం చేసింది. యజ్ఞ వల్కుని రెండో భార్య మైత్రేయి- జనకమహారాజు సభలో మహామహా పండితులనే మట్టికరిపించింది. గార్గి అనే మహాయోగిని వేదాలను ఔపోసన పట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే- ఆత్రేయి, అపాల, సూర్య, ఇంద్రాణి, లోపాముద్ర లాంటి ఎందరో స్త్రీలు బీజాక్షరాల్లో, వేదాల్లో తలపండిపోయారు. ఇక్కడ కూడా అదే సాంప్రదాయం ఉంది.

ప్రతి ఏటా జూన్ లో అడ్మిషన్లుంటాయి. ప్రస్తుతం 72 సీట్లు మాత్రమే ఉన్నాయి. 9 నుంచి 11 సంత్సరాల మధ్య ఉండి ఐదో తరగతి పూర్తి చేసిన చిన్నారులను ఎంట్రెన్స్ టెస్టు ద్వారా జాయిన్ చేసుకుంటారు. 7 సంవత్సరాల కోర్సు పూర్తయిన తరువాత, ఇంటర్మీడియట్ తో సమానమైన వేద విభూషణ్ పట్టా అందజేస్తారు. ఈ సర్టిఫికెట్‌కు వైదిక విశ్వవిద్యాలయాల గుర్తింపు ఉంటుంది. అంతేకాదు వేద విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డ్ డీ వరకు చదివే అవకాశం ఉంది. వేదాలతో పాటు సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, వయోలిన్, కీబోర్డు, గిటార్ కూడా నేర్పిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయి కలిగిన వేద విభూషణ్ కోర్సు పూర్తయిన తరువాత పౌరోహిత్యాన్ని ఉపాధిగా చేసుకుని స్థిర పడవచ్చు. లేదంటే పై చదువులు చదివి వైదిక విశ్వవిద్యాలయాలలో ప్రొసెసర్ స్థాయి ఉద్యోగాలు చేయొచ్చు.

అత్యంత క్రమశిక్షణ కలిగిన ఈ వేద పాఠశాలలో దినచర్య వినడానికి కాస్త కఠోరంగానే ఉన్నా.. ఇష్టంగా చేస్తే అదేమంత కష్టమేమీ కాదనిపిస్తుంది. ఉదయం మూడున్నరకే నిద్రలేవాలి. 4 గంటల్లోపు స్నానాలు ముగించాలి. 4 నుంచి 6 వరకు వేద పఠనం. 6 నుంచి సంగీతాభ్యాసం. ఆరున్నర నుంచి ఏడున్నర వరకు సంధ్యావందనం, ధ్యానం, పూజ, అభిషేకం, హోమం వగైరా ఉంటాయి. 7 గంటల నుంచి 8 గంటల వరకు సేవా కార్యక్రమాలు. అంటే చెట్లకు నీళ్లు పోయడం, పరిసరాలను శుభ్రం చేయడం, వంటలో సాయం చేయడం లాంటి పనులు! ఇందులో బలవంతమేమీ లేదు. ఎవరికి ఇష్టమయిన పనులు వారు చేయొచ్చు. 8 గంటలకు టిఫిన్! అరగంట రెస్ట్‌! 9 నుంచి పన్నెండున్నర వరకు క్లాసులు. మధ్యాహ్నం పన్నెండున్నరకు లంచ్‌. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు విశ్రాంతి. రెండు నుంచి 4 గంటల వరకు మళ్లీ క్లాస్. 4 నుంచి 5 గంటల వరకు ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ క్లాసులుంటాయి. తర్వాత అరగంట సేపు ఆట. ఆరింటికి రెస్ట్‌. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంధ్యా వందనం, పూజ మెడిటేషన్, హారతి మొదలైనవి. రాత్రి 7 గంటల నుంచి ఏడున్నర మధ్యన భోజనం. ఏడున్నర నుంచి 9 వరకు స్టడీ అవర్! 9గంటలకు నిద్ర! ఇదీ వీరి దినచర్య. పాఠశాలలో చిన్నారులు ప్రతీది ఎంతో ఇష్టంతో చేస్తారు.

ర్యాంకులే మోక్షంగా, బట్టీలే పరమావధిగా సాగే ప్రస్తుత విద్యావిధానంతో పోల్చుకుంటే ఈ వేద పాఠశాల వందరెట్లు బెటర్. ఇప్పటి చదువంతా ఉపాధి కోసం అన్నట్టు సాగుతోంది. క్రమశిక్షణ, సమాజంపట్ల అవగాహన, ప్రాపంచిక పరిజ్ఞానం ఇవేవీ అనవసరం లేనట్టుగా- క్లాస్ రూం ఓ గొడ్ల చావిడి మాదిరిగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మార్కుల గొడవ లేదు. హోంవర్క్ టెన్షన్ లేదు. ర్యాంకుల కోసం హంటర్లు వెంటాడవు. మంచి నడవడిక నేర్పుతారు. సమాజం పై అవగాహన కల్పిస్తారు. ఆత్మ స్థైర్యం నూరిపోస్తారు. క్రమశిక్షణ అలవాటు చేస్తారు. వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తారు. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చల్లనిగాలి, ఎలాంటి రణగొణధ్వనుల్లేవు! పక్షుల కువకువలు.. చెట్లకొమ్మల అలికిడి.. కొబ్బరాలకు వింజామరలు.. నిత్యమల్లె చెట్టుమీద ఊయలూగే శ్వేతకపోతాలు.. అలికిడే లేని కుందేటి మాగన్ను నిద్రలు.. ఎలాంటి కల్మషం లేకుండా, స్వేచ్ఛగా, హాయిగా, పసిపాపల్లా తిరగాడుతూ, సాత్వికంగా, చురుగ్గా, చదువుల తల్లి ఒడిలో లేడిపిల్లల్లా ఆడుతూ పాడుతూ వేదాలను అలవోకగా ఒంటబట్టించుకుంటున్నారు. వేదం చదవడమే కాదు.. సంగీత సాధన ద్వారా మంత్రం ఉచ్చరిస్తారు. మామూలుగా అయితే వేదం అంటే కంఠం మాత్రమే. అందులో కేవలం స్వరం మాత్రమే ఉంటుంది. సుస్వరం ఉండదు. కానీ ఇక్కడ ప్రతీ అక్షరం శృతిలో పలుకుతుంది. ప్రతీ పాదం లయబద్ధంగా సాగుతుంది. వినసొంపుగా ఉంటుంది. వీణాతంత్రుల మీద అలలు అలలుగా సాగే స్వరాన్ని వింటుంటే ఎంత దూరాన ఉన్నా- తనువూ మనసూ ఏకమై లీనమై పోతుంది.

ఈ వేదభారతీ పీఠానికి కుల, వర్గ, ప్రాంతీయ బేధం లేదు. ఎవరైనా ఇక్కడ వేదం నేర్చుకోవచ్చు. ప్రస్తుతం పిల్లలు ఇక్కడ రుగ్వేదం, యజుర్వేదం చదువుతున్నారు. సామవేదం, అధర్వణవేదం తర్వాత చెప్తారు. వేదాభ్యాసం అంటే భవిష్యత్తులో పూజలు చేసుకునో, పౌరోహిత్యాన్ని ఆధారం చేసుకునో పొట్టపోసుకోవడం కాదంటారు విద్యానందగిరి స్వామి. ఇది ఒక కాలేజీగా మారాలి. అలా మారాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.

ఏది ఏమైనా బాసర వంటి పుణ్య క్షేత్రంలో వేద పాఠశాల ఉండటం ఎంతో గొప్ప విషయం! ట్రిపుల్ ఐటీకి ఇచ్చినట్టే ఈ వేద పాఠశాలకు కూడా ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తే -భవిష్యత్తులో వ్యాసుడు నడయాడిన ఈ నేల దేశానికే తలమాణికంగా నిలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*