రివ్యూ: మళ్లీ మళ్లీ చూశా

రివ్యూ: మళ్లీ మళ్లీ చూశా
విడుదలతేది: 18, అక్టోబర్ 2019

తారాగణం: అనురాగ్ కొణిదెన, శ్వేతా అవస్థి, కైరవి టక్కర్, అన్నపూర్ణ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ తదితరులు.

దర్శకత్వం: హేమంత్ కార్తీక్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిట‌ర్: సత్య గిడుతూరి
నిర్మాత‌: కె. కోటేశ్వరరావు
సినిమాటోగ్రఫర్: సతీష్ ముత్యాల
ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: సాయి సతీష్ పాలకుర్తి

చిన్న సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న రోజులివి. విజయం పరంగా పెద్ద సినిమాలకు పోటీగా, ఇంకా చెప్పాలంటే అంతకు మించేలా సక్సెస్ రేట్ సాధిస్తున్న చిన్న చిత్రాలపై ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా కన్నేశారంటే.. ఏ విధంగా చిన్న సినిమాల హవా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ‘సాహో’, ‘సైరా’ చిత్రాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సరైన చిత్రం పడలేదనే చెప్పుకోవాలి. గోపీచంద్ చాణక్య వచ్చినప్పటికీ, అది నిలబడలేదు. ఈ వారం బాక్సాఫీస్‌ని నాలుగు చిత్రాలు పలకరించాయి. అన్నే చిన్న చిత్రాలే అయినా, అన్నింటిపై ఎంతో కొంత క్రేజ్‌ను ఏర్పరచుకునే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాల్గింటిలో మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను రాబట్టుకుందో మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
ఆర్మీ మేజర్ ఇంట్లో పెరిగిన ఓ అనాథ గౌతమ్(అనురాగ్ కొణిదెన)కు.. అనుకోకుండా ఓ రోజు ఓ డైరీ దొరుకుతుంది. అది స్వప్న (శ్వేతా అవస్తి) అనే అమ్మాయిది. అందులో ఓ మంచి ప్రేమకథ రాసి ఉంటుంది. ఆ డైరీని ఎలాగైనా ఆ అమ్మాయి చేర్చాలని ప్రయత్నం చేసిన హీరో.. కొన్ని పరిస్థితుల్లో ఆ డైరీని చదవాల్సి వస్తుంది. అంతే ఆ డైరీలో ఉన్న కథలో తనని తాను ఊహించుకుంటూ కథ మొదలెడతాడు హీరో. ఈ క్రమంలో ఆ కథ రాసిన స్వప్నతో ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆ డైరీని ఆమెకు చేర్చాలని బయలుదేరిన గౌతమ్, ఆమెను చేరుకున్నాడా? ఆమె ప్రేమను సొంతం చేసుకున్నాడా? అనే భావోద్వేగాలతో తెరకెక్కిందే మిగతా కథ.

సాంకేతిక నిపుణుల పనితీరు:
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించే. మంచి కాన్సెఫ్ట్‌తో దర్శకుడు ఓ బ్యూటీఫుల్ స్టోరీని చెప్పాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఓ చక్కని ప్రేమకథను తెరపై ఆవిష్కరించేందుకు ఆయన చేసిన ప్రయత్నం అభినందించదగిందే. కానీ అక్కడక్కడా సాగదీతలా అనిపించడం, ఎంటర్‌టైన్‌మెంట్ రొటీన్ అనిపించేలా ఉండటం వంటివి అతనికి వంకగా మారాయి. ఒకానొక దశలో కథ పక్కదారి పడుతుందా అనిపించింది. మొత్తంగా మాత్రం తను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు చేరేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ విషయంలో కొంచెం కత్తెర పడాల్సిన సీన్లు ఉన్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. కలరింగ్, మూడ్ అన్ని చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి. మ్యూజిక్‌‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. హీరో అయిన తన కొడుకు కోసం నిర్మాత కోటేశ్వరరావు ఏ విషయంలో వెనుకాడలేదని తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంది.

ఆర్టిస్టుల పనితీరు:
అనురాగ్ కొణిదెన.. తొలి చిత్రంగా ఓ మంచి కథను ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో లవ్ స్టోరీ అంటే అందులో నటీనటులు ఫర్ఫెక్ట్‌గా సెట్ అయితేనే ఆ లవ్ స్టోరీ పండుతుంది. ఈ విషయంలో హీరో, హీరోయిన్ ఇద్దరూ తమ నటనతో రక్తి కట్టించారు. చూస్తున్న ప్రేక్షకులు కూడా ప్రేమలో పడేలా చేశారు. యాక్టింగ్ పరంగా హీరో తొలి చిత్రమే అయినా.. చక్కగా చేశాడు. యాక్టింగ్ స్కిల్స్‌పై ఇంకాస్త శ్రద్ధ పెడితే భవిష్యత్‌లో మంచి హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. హీరోయిన్లు ఇద్దరూ కూడా చక్కగా మెప్పించారు. ఉన్నంతలో సీనియర్ నటి అన్నపూర్ణకు మంచి డైలాగ్స్ పడ్డాయి. మిగతావారంతా వారి పాత్రలమేర నటించారు.

విశ్లేషణ:
అంతా కొత్తవారే అయినా.. కథ ఆ భావనను తెలియనివ్వలేదు. ప్రేమకథలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. దర్శకుడి ప్రతిభకు ఇది నిదర్శనం. కాకపోతే కొన్ని కొన్ని యాడాఫ్ట్ చేసుకోలేని సీన్లు, చిత్ర ఫ్లోని పోగొట్టినా, తిరిగి ట్రాక్‌మీదకు తెచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అంత ఓపిక ప్రేక్షకులకు ఉంటుందా? అనే పాయింట్ డైరెక్టర్ మిస్సయ్యాడు. చిత్రీకరణ పరంగా చిన్న సినిమాగా లేనప్పటికీ, ప్రేక్షకుడి దృష్టిలో ఇదే చిన్న సినిమా అనే భావన ఉండటంతో భారీ అంచనాలు ఉండవు. అందుకే ఇబ్బంది పడకుండా, సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు సినిమా బాగానే తీశారు అని చెప్పుకునేలా అయితే సినిమా ఉంది. ప్రస్తుత బాక్సాఫీస్ వద్ద ఎటువంటి హడావుడి లేదు కాబట్టి.. ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్‌గానే బయటపడవచ్చు.
ట్యాగ్‌లైన్: మళ్లీ మళ్లీ కాదు.. ఒక్కసారి చూడొచ్చు

రేటింగ్: 3/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*