పరమహంస యోగానంద స్మారకంగా రూ. 125 నాణెం విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఒక యోగి ఆత్మకథ రచయిత, యోగద సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులైన పరమహంస యోగానంద 125వ జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కారు 125 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, యోగద సత్సంగ సొసైటీ తరపున స్వామి స్మరణానందగిరి తదితరులు పాల్గొన్నారు.

 

పరమహంస యోగానంద 1893 జనవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో ముకుంద్‌లాల్ ఘోష్‌గా జన్మించారు. కాలేజీ చదివే సమయంలో ఆయన యుక్తేశ్వర్ గిరి అనే గురువు వద్ద శిక్షణ పొందారు. మహావతార్ బాబాజీ ద్వారా క్రియాయోగాన్ని ఆధునిక భారతదేశానికి అందించిన లాహిరీ మహాశయులకు యుక్తేశ్వర్ గిరి శిష్యుడు. క్రియా యోగాన్ని పశ్చిమదేశాలకు అందించే బాధ్యత పరమహంస యోగానందకు అప్పగించారు.

 

1920లో యోగానంద అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పేరుతో సంస్థను ప్రారంభించారు. క్రియా యోగాన్ని విశ్వవ్యాపితం చేశారు. లక్షలాదిమంది అమెరికా, యూరప్ జాతీయలు ఆయన శిష్యులుగా మారారు. యోగిగా తన అనుభవాలను ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకంగా, అత్యంత ప్రభావవంతమైన పుస్తకంగా నిలిచింది. యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ సహా అనేక మందికి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. 1952 మార్చ్ 7వ తేదీన యోగానంద అమెరికాలోనే మహాసమాధి చెందారు. ఆయన స్థాపించిన వైఎస్ఎస్, ఎస్ఆర్ఎఫ్ ద్వారా ప్రస్తుతం కోట్లాది మంది భక్తులు క్రియాయోగాన్ని అభ్యసిస్తున్నారు. ఉత్తమమైన ధ్యాన మార్గంలో తమ జీవితాలను ఉద్ధరించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*