డ్రాగన్‌కు మరో ఝలక్ ఇచ్చిన మోదీ

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితమే 59 చైనా యాప్‌లను నిషేధించిన మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వీబోను వదిలిపెట్టారు. వీబో అకౌంట్‌లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫొటోతో పాటు కామెంట్లను, పోస్టులను, ఫొటోలను, ఇతర వివరాలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తిగా బ్లాంక్‌గా కనపడుతోంది. 2015లో మోదీ వైబోలో అకౌంట్ తెరిచారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు మోదీ ఈ ఖాతా తెరిచారు. ఈ అకౌంట్‌లో ఆయనను 244000 మంది అనుసరిస్తున్నారు. ఫాలోయర్లలో ఎక్కువ మంది చైనీయులే కావడం విశేషం. ఈ అకౌంట్ ఇంగ్లీషులో ఉండదు. చైనా భాషలో ఉంటుంది. చైనా భాషలోనే మోదీ ఈ అకౌంట్ మెయింటైన్ చేశారు.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నప్పటినుంచీ దేశం రగిలిపోతోంది. దీంతో చైనాకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకుంటూనే దేశీయంగా కూడా ప్రజల మద్దతు పొందుతున్నారు. చైనాతో ఒప్పందాలు రద్దు చేసుకుంటూ పోతున్నారు. చైనా ఉత్పత్తులను వదిలి స్వదేశీ ఉత్పత్తులు కొనాలని పిలుపునిచ్చారు. చైనా యాప్‌లను నిషేధించారు. ఆర్ధికంగా నష్టం కలిగించే చర్యలు చేపడుతుండటంతో చైనాకు తల బొప్పికడుతోంది. డ్రాగన్ మింగలేక, కక్కలేక చచ్చిపోతోంది.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో తమ సైనికులు ఎంతమంది చనిపోయారో కూడా చైనా వెల్లడించలేదు. చెబితే చైనాలో ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయం జిన్‌పింగ్‌కున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జవాన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన దృశ్యాలు చైనీయులు సోషల్ మీడియా ద్వారా చూశారు. అయితే తమ జవాన్లలో ఎంతమంది చనిపోయారో కూడా వారికి తెలియడం లేదు. ఎందుకంటే అక్కడి మీడియా ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుంది. 59 యాప్‌లను నిషేధిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం చైనీయులకు నేరుగా తెలిసి వచ్చింది. దీంతో వారిలో కలవరం రేపింది. దీనికి తోడు మోదీ చైనా సోషల్ మీడియా వీబోనుంచి వైదొలగడంతో చైనీయులకు సెగ తగలడం ప్రారంభమైంది. ఏదో జరుగుతోందని ఇప్పుడిప్పుడే అర్ధమౌతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*