నిహారా కానేటి… రారెవ్వరూ ఈమెకు సాటి

ఆమె ఒక RJ

పట్టుదలతో అదే సంస్థలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎదిగింది. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

ఆమే నిహారా కానేటి.

1. చిన్న వయసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయడం మీకు ఎలా ఉంది?

చాలా గర్వంగా ఆనందంగాఉంది. అలాగే చాలా బాధ్యత కూడా ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో అనేది ఎలక్ట్రానిక్ మీడియాకు మంచి మార్గదర్శకం వంటిది. ఉన్నత ప్రమాణాలకు మారు పేరు. విషయంతో పాటు విలువలతో కూడిన కార్యక్రమాలను అందిస్తుంది ఆకాశవాణి. ఎందరో గొప్ప సాహితీవేత్తలు, సెలబ్రిటీలు ఇందులో పని చేస్తారు. PEXగా, అనౌన్సర్‌గా, న్యూస్ రీడర్‌గా.. ఇలా పలు విభాగాల్లో, అలనాటి సంస్థలో PEX(అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా) చేరటం నిజంగా నా అదృష్టమే. ఎందరో మహానుభావులను కలిసే భాగ్యం కలిగింది. రేడియో ఫార్మెట్స్‌తో ఎక్స్‌పరిమెంట్స్ చేయడం నాకు చాలా సరదా. ప్రొగ్రామింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తాను.

2. PEX అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా?

– అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే నేను ఒక ఫైల్యూర్ పర్స‌న్‌ని. సివిల్ సర్వెంట్ అవుదామనేది నా ఆశ. కానీ అది సాధించలేకపోయాను. తర్వాత ఇలా స్థిరపడ్దాను. మా నాన్న గారు రేడియో కోసం కథలు, వ్యాసాలు రాస్తారు. మా పెదనాన్న డా. కానేటి మధుసూదన్ గారు, విశాఖపట్నం ఆకాశవాణిలో అనౌన్సర్‌గా చేసి పదవీ విరమణ పొందారు. చిన్నప్పుడు డాడీతో వరంగల్ రేడియో స్టేషన్‌కి వెళ్ళేదాన్ని. అప్పుడు ప్రైవేట్ ఛానల్స్ లేవు. ఆకాశవాణి మంచి వెలుగులో ఉన్న సమయం. ఆఫీస్ కార్పొరేట్ స్థాయిలో ఉండేది. చాలా బాగుండేది. అదే ఆఫీస్‌లో PEXగా మళ్లీ అడుగు పెడతానని అస్సలు ఊహించలేదు. గతంలో RJగా చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి నాకు ఈ వాతావరణం కొత్త ఏమీ కాదు. ప్రతి రోజు నా వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. కొత్త ప్రొగ్రామ్ ప్రొడ్యూస్ చేసినప్పుడల్లా సంతృప్తి పడతాను.

3. PEX గా జాయిన్ అవ్వకముందు RJ గా పనిచేసారు కదా.. ఆ ఎక్స్పీరియన్స్ చెబుతారా?

అది చాలా ఆసక్తికరమైన స్టోరీ. ముందు చెప్పినట్టుగానే చిన్నప్పుడు డాడీతో వరంగల్ ఆకాశవాణీకి అప్పుడప్పుడు వెళ్లేదాన్ని. అక్కడ స్టాఫ్ అందరూ డాడీకి ఫ్రెండ్స్. అందులో ముఖ్యులు సీనియర్ అనౌన్సర్ మడిపల్లి దక్షిణమూర్తి గారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయం అది. ఆయన డాడీ కోసం ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. దక్షిణమూర్తి గారు నాతో కూడా కాసేపు మాట్లాడి నీ వాయిస్ రేడియోకి బాగుంటుంది అమ్మ, హైదరాబాద్‌లో ఉన్నావు కదా, రెయిన్‌బో FMకి ఆడిషన్ ఇవ్వకూడదు?? అని అన్నారు. చాలా తక్కువ ఆశతో అప్లై చేశాను, సెలక్ట్ అయ్యాను.
RJగా చేయడం నాకు చాలా నేర్పింది, గొప్ప అనుభూతిని ఇచ్చింది. సుమనస్పతి రెడ్డి, రాంబాబు, సుంకసారి రమేశ్, ఏఎల్ కుమార్, వసుమతి, శారద లాంటి సీనియర్ల సలహాలు, సూచనలతో దాదాపు 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో, రెయిన్‌బో FMలో, యువవాణి ఇంగ్లీష్ విభాగాల్లో పని చేశాను.

4. ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా చేసి.. అక్కడే PEX గా పని చేయడం ఎలా అనిపిస్తుంది?

నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. నేను చేరింది చాలా బాధ్యతలు గల ఉద్యోగంలో. ముందే AIR ప్రొగ్రామ్స్‌పై అవగాహన ఉండటం, ప్రొడక్షన్, ఎడిటింగ్ తెలిసి ఉండటం, సీనియర్స్‌ తెలిసి ఉండటం నాకు చాలా ఉపయోగపడింది. క్యాజువల్‌గా పని చేసిన చోటే PEXగా జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.

5. PEX అంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా, ఎలా మేనేజ్ చేస్తారు?

చాలా మంచి ప్రశ్న. ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి, ఉండాలి కూడా. నేను ముందు నిజామాబాద్‌లో పని చేశాను, ఇప్పుడు వరంగల్. ఎక్కడ పని చేస్తే అక్కడే ఉండటం మంచిది అనేది నా అభిప్రాయం. అప్పుడే 100% మనం న్యాయం చేయగలుగుతాం. నా హస్బెండ్‌కి నా జాబ్ రిక్వైర్‌మెంట్ తెలుసు. నేను పని విషయంలో అసలు రాజీ పడను. దానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకుని హ్యాపీగా ఉండటమే.

6.మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ?

మంచి ప్రొగ్రామ్స్ అన్ని వయసుల వారికి నచ్చేలా అందించాలనేది నా ఆశ. రేడియోని highly influential medium(అత్యంత ప్రతిభావంతమైన మాధ్యమం) అని ప్రూవ్ చేయాలని ఉంది. అందుకు చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ పనిలో నిమగ్నమై ఉంటాను.

7. RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్?

ముందు భాష, ఉచ్ఛారణ తెలిసి ఉండాలి, ప్రపంచ నలుమూలలా జరుగుతున్న విషయాలు తెలిసి ఉండాలి, వాటిని సృజనాత్మకంగా, వినాలి అనిపించేలా శ్రోతలకు అందజేయగలగాలి. పబ్లిక్ స్పీకింగ్ అలవాటు ఉన్నవాళ్లు అలవోకగా మైక్రోఫోన్ ముందు మాట్లాడగలరు. సినిమాలకి, పాటలకి, సంబంధించిన సమాచారం తెలిసి ఉండాలి. ఎంత తెలిసి ఉన్నా, ఇంకా తెలుసుకోవాలి అన్న తపన ఉండాలి. విజ్ఞానానికి వినోదాన్ని జోడించి సృజనాత్మకంగా చెప్పగలగాలి. రేడియో స్క్రిప్ట్ తెలుసుకోవాలి. ఎడిటింగ్ కూడా వచ్చి ఉండాలి. Rj is a entertainer.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*