
జైపూర్: రాజస్థాన్‌లో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని బీజేపీ తెలిపింది. దమ్ముంటే మెజార్టీ నిరూపించుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్‌కు సవాలు విసిరింది. మెజార్టీ నిరూపించుకున్నాకే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత గులాబ్ చంద్ కటారియా డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష నిర్వహిస్తేనే ప్రభుత్వానికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందనేది తేలుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి యువనేతలను గౌరవించుకోవడం తెలియదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పునియా తెలిపారు. బీజేపీలోకి రావాలని పైలట్‌కు ఆయన ఆహ్వానం పంపారు.
అంతకు ముందు సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటేసింది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తొలగించింది. పైలట్‌కు మద్దతిస్తోన్న ముగ్గురు మంత్రులపై కూడా కాంగ్రెస్ వేటేసింది. పైలట్‌కు అభ్యంతరాలుంటే పార్టీ హైకమాండ్‌కు చెప్పాల్సిందని, రెండుసార్లు సమావేశం పెట్టి ఆహ్వానించినా రాలేదని సీఎం గెహ్లాట్ చెప్పారు. కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీ నేతలు ఆడించినట్లు పైలట్ ఆడారని గెహ్లాట్ ఆరోపించారు.
మరోవైపు సీఎం గెహ్లాట్ రాజస్థాన్ గవర్నర్‌ను కలుసుకున్నారు. మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ గెహ్లాట్‌ను ఆదేశించే అవకాశాలున్నాయి.
200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలుండగా 18 మంది సచిన్ వెంట వెళ్లారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు.
Be the first to comment