
న్యూఢిల్లీ: యువనేతలకు ఓపిక ఉండటం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్‌ను ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా చేసిందని చెప్పారు. పైలట్ వయసెంతని ప్రశ్నిస్తూ ఆయనకు ఓపిక ఉండాల్సిందన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఆయన కార్యకలాపాలున్నాయని చెప్పారు.
గతంలో జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారును కూల్చి బీజేపీని అధికారంలోకి తెచ్చారు. రాజస్థాన్‌లో కూడా అదే సీన్ జరుగుతుందని అంతా ఊహించారు. అయితే తాను బీజేపీలో చేరడం లేదని పైలట్ చెప్పారు. దీంతో ఆయన వ్యూహమెంటో కాంగ్రెస్ అధిష్టానానికి అంతుచిక్కడం లేదు. పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది.
నిన్న పైలట్‌ను రాజస్తాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అశోక్ గెహ్లాట్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేయడంతో కాంగ్రెస్ అధిష్టానం వేటేసింది. గెహ్లాట్ సర్కారును కూలదోసేందుకు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ నోటీసులు అందడంతో నొచ్చుకున్న పైలట్ వేరుకుంపటి పెట్టారు. దీంతో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. వేరుకుంపటి పెట్టుకున్నందుకు పార్టీ బదలాయింపు చట్టం కింద వారికి నోటీసులు కూడా అందాయి.
Be the first to comment