కాచుకో చైనా!… ఫ్రాన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన రఫెల్ యుద్ధ విమానాలు

పారిస్: ఫ్రాన్స్ నుంచి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ నిపుణుల వద్ద శిక్షణ పైలట్లు ఈ విమానాలతో భారత్‌కు బయలుదేరారు.

మార్గమధ్యంలోని యూఏఈలో ఉన్న ఎయిర్‌బేస్‌లో ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఫ్యూయల్ నింపేందుకు ఈ యుద్ధవిమానాలు ఒకసారి ఆగుతాయి.

ఈ నెల 29వ తేదీన అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ యుద్ధ విమానాలు దిగుతాయి. ఆ తర్వాత వీటిని పూర్తి స్థాయిలో మోహరిస్తారు.

అణ్వస్త్ర సామర్థ్యం ఆయుధాలను ఈ విమానాలు తీసుకెళ్లగలవు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానాలు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా చేధించగలవుె. 500 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు దేశాల బలగాల కదలికలను గమనించగలవు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధవిమానాలుగా పేరున్న రఫెల్ యుద్ధ విమానాల మోహరింపు ద్వారా భారత్‌కు చైనాపై ఆధిక్యత లభించినట్లౌతుంది. దీంతో పాటు భారత్ రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ నుంచి అనేక అత్యాధునిక ఆయుధాలను, విమానాలను, హెలికాఫ్టర్లను,క్షిపణులను కొనుగోలు చేస్తోంది. చైనా నుంచి ప్రయోగించే క్షిపణులను ఆకాశంలో పేల్చివేసే క్షిపణి రక్షక వ్యవస్థలను కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఫ్రాన్స్‌తో 58 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. తొలి విడతలో భాగంగా 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకుంటున్నాయి. మిగతావి విడతలవారీగా భారత్‌కు చేరుకుంటాయి. కరోనా సమయంలోనూ చైనాతో ఉద్రిక్తతలున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ భారత్‌కు పూర్తి స్థాయిలో చేయూతనిచ్చింది. భారత పైలట్లకు శిక్షణ ఇవ్వడం, భారత అవసరాలకు అనుగుణంగా రఫెల్ యుద్ధ విమానాలను రూపొందించడంలో ఫ్రాన్స్ సహకరించింది.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. భారత బలగాలు ఏ ఆయుధాలు లేకుండానే చైనా బలగాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 43 మంది చైనా సైనికులు హతమయ్యారని సైనిక వర్గాల ద్వారా తెలిసింది. అయితే చైనా మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎలాంటి ప్రకటన చేయలేదు. టిక్‌టాక్‌ లాంటి ప్రముఖ చైనా యాప్‌లను భారత్ నిషేధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చైనాను ఆర్ధికంగా కూడా దెబ్బతీసేందుకు భారత్ యత్నిస్తోంది. గతంలో కుదుర్చుకున్న ఆర్ధిక ఒప్పందాలను, టెండర్లను రద్దు చేస్తూ పోతోంది. భవిష్యత్తులోనూ చైనాతో వాణిజ్య కార్యకలాపాలు జరపరాదని భారత్ నిర్ణయించింది.

మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి 3500 కిలోమీటర్ల వరకూ భారత్ నిఘాను పెంచింది. చైనా బలగాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనా టిబెట్‌లోని హోటన్ ఎయిర్‌బేస్‌లో వందలాది యుద్ధ విమానాలను మోహరించింది. భారత్‌ కూడా అదే స్థాయిలో యుద్ధ విమానాలను మోహరించింది. శీతాకాలం వరకూ సరిపోయేలా రెండు దేశాలు తమ సైనిక బలగాలకు దుస్తులు, ఆహారపదార్ధాలు, నిత్యావసరాలు సరఫరా చేయడంతో ఈ వివాదం చాలాకాలం కొనసాగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే యుద్ధానికి దారితీయవచ్చు. అయితే యుద్ధం జరగకుండానే వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలూ యత్నిస్తున్నాయి.

–విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*