విశ్వాస పరీక్షలో మద్దతిచ్చినా పైలట్‌కు దక్కని గౌరవం.. అసెంబ్లీలో సీటు మార్పు

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ ఉదయం సమావేశమైన అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. సచిన్ పైలట్‌కు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి రావడంతో గెహ్లాట్‌కు విశ్వాస పరీక్ష నెగ్గడం సులభమైంది. మూజువాణి ఓటు ద్వారా గెహ్లాట్ నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. అటు విశ్వాస పరీక్ష అనంతరం అసెంబ్లీ ఈ నెల 21కి అసెంబ్లీ వాయిదా పడింది.

బీజేపీతో కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆడియో టేపులు చూపిన గెహ్లాట్ విచారణకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పోలీసుల ద్వారా నోటీసులు పంపారు. దీంతో నొచ్చుకున్న పైలట్ తనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలతో హర్యానా వెళ్లిపోయారు. చివరకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించారు. దీంతో సచిన్ తిరిగి పార్టీలోకి రావడంతో గెహ్లాట్ సర్కారు గట్టెక్కింది.

ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు పన్నిన కుట్రను చిత్తు చేస్తూ గెహ్లాట్ సర్కారు విజయం సాధించిందని సచిన్ పైలట్ అన్నారు. మరోవైపు ఆయన అసెంబ్లీలో గతంలో కూర్చున్న సీటును మార్చారు. డిప్యూటీ సీఎం పదవి పోవడంతో ఆయనిప్పుడు కేవలం ఎమ్మెల్యే. రాజస్థాన్ పీసీసీ బాధ్యత కూడా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*