రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి “సీమ సిటుక్కుమంటాంటే” పుస్తకం విడుదల చేసిన విజయ్ దేవరకొండ

హైదరాబాద్: యువ జర్నలిస్ట్, రచయిత రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి రచించిన “సీమ సిటుక్కుమంటాంటే” పుస్తకాన్ని నటుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. TV9, ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఫీచర్స్ రిపోర్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజావలి రాయలసీమ యాసలో స్థానిక సంస్కృతిని, సంప్రదాయలను, సీమ మనుషుల హృదయ భాషను తమ పుస్తకంలో ఆవిష్కరించారు. వాస్తవానికిది ఆయన తొలి పుస్తకమే అయినా బోలెడన్ని గొప్ప పుస్తకాల్ని భవిష్యత్తులో అందించగలరని “సీమ సిటుక్కుమంటాంటే” చదివినవారికి ఇట్టే అర్ధమౌతుంది. రాజావలి నిజాయితీ, సమాజహితం కోసం ఆయన పడే తపన, ఆయన్ను అందరివాడిలా చేసింది. పుస్తకం విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ రాజావలికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పనిలో పనిగా రాజావలి పులివెందుల పిల్లగాడు అనే యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. లాక్‌డౌన్ సమయంలో మీడియా సహా అన్ని రంగాలూ డోలాయమాన పరిస్థితిలో పడిపోయి ఎందరో ఉద్యోగుల్లాగే జర్నలిస్టులు కూడా డీలా పడిపోతున్న సందర్భంలో రాజావలి “సీమ సిటుక్కుమంటాంటే” పుస్తకం రాయడంతో పాటు పులివెందుల పిల్లగాడు యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.

రాజావలి రాసిన పుస్తకాన్ని ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేశారు.

రాజావలి “సీమ సిటుక్కుమంటాంటే” పుస్తక డిజిటల్ కాపీని టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు విడుదల చేశారు.

ఫీచర్స్ రిపోర్టర్ ద్వారా అందరి మన్ననలు పొందిన రాజావలి తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా, పుస్తక రచన ద్వారా సమాజానికి మరింత అంకితమవ్వాలని, విజయపథంలో నడవాలని ఈ క్షణం టీం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.