సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్ కేసులో కీలక మలుపు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీహార్ ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ముంబైకి బయలుదేరింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణ జరుపుతున్న ముంబై పోలీసులపై తమకు నమ్మకముందని, సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదంటూ బీహార్ పోలీసులను అడ్డుకున్న మహారాష్ట్ర సర్కారు చివరకు సుప్రీం ఆదేశాలతో వెనక్కు తగ్గింది. సీబీఐకి ముంబై పోలీసులు సహకరిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్‌కు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఆర్ధిక వ్యవహారాలు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రియా చక్రవర్తి కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. సుశాంత్ అకౌంట్ నుంచి రియా కుటుంబ సభ్యులకు, వారి వ్యాపారాలకు డబ్బు బదిలీ అవడాన్ని పరిశీలించి ప్రశ్నల వర్షం కురిపించింది.

మరోవైపు రియా చక్రవర్తి తనతో సుశాంత్ సోదరి అభ్యంతరకరంగా ప్రవర్తించిందని ఆరోపించడం ప్రకంపనలు రేపింది.

సీబీఐ ఎంక్వైరీకి అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను బీహార్ ప్రభుత్వం, బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి.

హీరోయిన్ కంగనా రనౌత్, హీరో అక్షయ్ కుమార్ తదితరులు స్వాగతించారు.

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సుప్రీం ఆదేశాలను స్వాగతించారు.

సుప్రీం ఆదేశాలు మహారాష్ట్ర సర్కారుకు చెంపపెట్టని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.

భారత దేశంలో న్యాయవ్యవస్థ గొప్పదని, సుప్రీం ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు.

సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*