ఉపరాష్ట్రపతి నివాసంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నివాసంలో వినాయక చవితి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషమ్మ దంపతులు మట్టితో తయారు చేసిన లంబోదరుని ప్రతిమకు పూజలు నిర్వహించారు. గతంలో ఉపరాష్ట్రపతి నివాసంలో చవితి పూజకు ఉద్యోగులంతా కుటుంబంతో పాటు హాజరయ్యే వారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చవితి వ్రతాన్ని ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులతోనే జరుపుకున్నారు.

ఈ సందర్భంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రసాదించాలని, కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో దేశాభివృద్ధికి ఎదురౌతున్న విఘ్నాలను తొలగించాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించినట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.

ప్రకృతిని కాపాడమనే అంతరార్థం వినాయక చవితిలో ఉందని, భారతీయ సంస్కృతిలో గొప్పతనం అదేనని ఉపరాష్ట్రపతి తెలిపారు. వినాయకుడు జ్ఞానానికి ప్రతీక అని, జ్ఞానం ఉన్నవాడు సర్వగణాలకు ఆధిపత్యం వహించడానికి సమర్ధుడు అనే విషయాన్ని గణేశుని అవతారం తెలియజేస్తుందని పేర్కొన్నారు.

భగవంతుని ముందు అందరూ సమానమే భావనకు, ప్రకృతి పరిరక్షణకు వినాయక చవితి పండుగ చిహ్నమన్న ఉపరాష్ట్రపతి, మన జీవితాలను సరైన మార్గంలో పెట్టేందుకు, మన పెద్దలు ఇలాంటి పండుగలను ఏర్పాటు చేశారని, వాటిని అందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*