రాత్రి తర్వాత పగలు వచ్చినట్లే.. కష్టం తర్వాత సుఖం వస్తుంది: రేడియో అనౌన్సర్ అల్పన సిరి

బాధ వచ్చినప్పుడు కృoగిపోకుండా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా జీవితాన్ని బాలన్స్ చేయాలని అంటారు రేడియో అనౌన్సర్ అల్పన సిరి. 13 ఏళ్లుగా రేడియో శ్రోతలను అలరిస్తూ.. ఇటు టీవీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక మార్క్ వేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న యువతకు మనోధైర్యం ఇస్తున్నారు. బెస్ట్ యాంకర్‌గా అవార్డు అందుకున్న అల్పన సిరితో ఈక్షణం ఇంటర్వ్యూ.

మీరు ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు?

ఇప్పటి కామారెడ్డి జిల్లాలో పుట్టాను. హైదరాబాద్ లోని ప్రగతి కాలేజీలో ఎం.కామ్ చదివాను. నాన్న ఈశ్వర్, అమ్మ ఇంద్రరాణి. నాకు ఒక చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు.

రేడియోలో ఎలా ఛాన్స్ వచ్చింది?

ఎం.కామ్ చదువుకోడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ టైములో పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతుంటే… ఆల్ ఇండియా రేడియోలో ఉన్నట్టు తెల్సింది. వెంటనే అప్పటి ప్రోగ్రాం ప్రొడ్యూసర్ చావలి దేవదాస్ గారిని కలిసాను. తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలని ఆయన చెప్పడంతో, కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. ఆడిషన్స్ సమయానికి తెలుగులో ప్రావీణ్యం వచ్చింది. అనౌన్సర్ గా అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు అంటే దాదాపు 13 ఏళ్లుగా ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఏ స్టేషన్ లో (మీడియం వేవ్ 406.5 మీటర్స్ 738 khz, షార్ట్ వేవ్ 62.5 మీటర్స్ 4800 khz) కాజువల్ అనౌన్సర్ గా చేస్తున్నాను.

రేడియోలో చేస్తూనే టీవీ రంగంలోకి వచ్చారు కదా? ఆ జర్నీ గురించి చెప్పండి.

ఆల్ ఇండియా రేడియోలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు … సీ ఛానల్ గురించి తెల్సింది. ఫ్రెండ్ తోడు రమ్మంటే వెళ్ళాను. సరదాగా నేను ఆడిషన్ ఇచ్చాను. లక్కీగా ఇంటర్వ్యూ, స్క్రీన్ టెస్ట్ లోనూ సెలెక్ట్ అయ్యాను. ఊహించకుండానే న్యూస్ రీడర్ అయిపోయాను.

మీరు చాలా టీవీ చానెల్స్ లో పని చేసారు కదా. వాటిల్లో మీకు బాగా పేరు వచ్చిన ప్రోగ్రాం.

అవును. సీ టీవీ తో మొదలైన నా టీవీ కెరీర్, ఆ తర్వాత జెమినీ టీవీ, వనిత టీవీ, 6 టీవీ, ఎక్సప్రెస్ టీవీ, దూరదర్శన్, స్నేహ టీవీ లలో సాగింది. ప్రస్తుతం DD యాదగిరి ఛానల్ లో రైతు నేస్తం ప్రోగ్రాం చేస్తున్నాను. పేరు తెచ్చిన ప్రోగ్రామ్స్ చాలానే వున్నాయి. హీరో సుమన్ గారితో చేసిన ఇంటర్వ్యూ, స్నేహ టీవీ లో శారీ ప్రోగ్రాం, 6టీవీ లో గురు ఆయుర్వేదం ప్రోగ్రామ్స్.. ఇలా.

కెరీర్ లో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేసారు?

మొదట్లో నాకు సరీగ్గా తెలుగు రాదని, అసలు ప్రశ్నలు అడగడమే రాదని, యాంకర్ గా చేయలేనని ఒక ఛానల్ వాళ్ళు నన్ను అవహేళన చేసారు. ఇదే ఒక ఛాలెంజ్ గా తీసుకుని, తెలుగుపై మరింత పట్టు సాధించాను, ఇంటర్వ్యూ ఎలా చేయాలో మెలకువలు తెలుసుకున్నాను. నాకు రానివి అలా వదిలేయకుండా… స్వయంకృషితో నేర్చుకున్నాను . మరొక టీవీ ఛానల్ లో చేరి నా టాలెంట్ ను చూపించాను. ఎన్నో ఇంటర్వ్యూలు, ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేశాను. నన్ను చూసి కామెంట్స్ చేసిన వారితోనే… కంప్లిమెంట్ ఇప్పించుకున్నాను.

మీరు మల్టీ టాలెంటెడ్, ఆ వివరాలు.

రేడియో, టీవీ లో చేస్తూనే .. కొన్ని సీరియల్స్, సినిమాలకి డబ్బింగ్ చెప్పాను. దూరదర్శన్ లో ‘ఊహల పల్లకి’ నేను చేసిన తొలి సీరియల్. మాటీవిలో ‘కంటే కూతుర్ని కనాలి’, ఈటీవీ లో ‘అభిషేకం’, జీటీవిలో ‘అమెరికా అమ్మాయి’ లో యాక్ట్ చేశాను. ఈ మధ్యే ఒక సినిమాలో (ఇంకా పేరు పెట్టలేదు) నటించాను. యూట్యూబ్ చానెల్స్ కి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాను. స్టేజి యాoకర్ గా కూడా చేస్తున్నాను.

మీ వెబ్ సిరీస్ గురించి

ఈ మధ్యే… వర్కింగ్ విమెన్ వర్రీస్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్నాను. నన్ను పర్సనల్ గా కలవకుండా, చూడకుండా కేవలం నా గొంతు విని వాసు గడ్డం గారు నన్ను సెలెక్ట్ చేసారు. అందుకు సార్ కి నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటికి వచ్చిన ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అసలు అంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు?

డైలాగ్స్ గుర్తు పెట్టుకోను. కంటెంట్ అర్థము చేసుకుంటా. అప్పుడు ఎంత పెద్ద సీన్ అయినా ఎంతో ఈజీగా చేసేయగలం. ఎన్ని డైలాగ్స్ అయినా గలగలా చెప్పేయగలం.

మీరు జీవితాంతం గుర్తుంచుకునే వారు ఎవరైనా ఉన్నారా?

ఒక్కరు కాదు ఇద్దరు వ్యక్తులు. ఒకరు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ చావలి దేవదాస్. నేను రేడియోలో ఓనమాలు దిద్దుతున్న రోజుల్లో, చాలా ప్రోత్సహించారు. పనిని నేర్పేవారు. తప్పులుంటే సరిచేసేవారు. సార్ చెప్పిన సూత్రం నేను ఇప్పటికి ఫాలో అవుతాను. “తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకో, నీ తప్పు లేకుంటే పోరాడు” అని. నా జీవితంలో ఇది ఇప్పటికి నమ్ముతాను.

ఇక రెండో వ్యక్తి .. నా ఆధ్యాత్మిక గురువు రోజా మేడం. “జీవితంలో సమస్యలు చాలా చిన్నవి అని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని ” నాలో నూతన ఉత్సాహం నింపారు. ప్రతి పనిని కాన్ఫిడెంట్ గా చేయాలని మనోధైర్యం ఇచ్చారు.

వీరిద్దరికి నేను జీవితాంతం రుణపడి వుంటాను. వారు చెప్పిన మంచి మాటలను పాటిస్తూ సాగిపోతున్నాను.

మీ లైఫ్ పార్టనర్ గురించి

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ వున్నట్టే, ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు వున్నాడని నేను నమ్ముతాను. నా విషయంలో ఇది నిజం. మాది పెద్దలు ఒప్పుకుని చేసిన ప్రేమ పెళ్లి. తన పేరు సుమన్ కుమార్, బిజినెస్ చేస్తుంటారు. నా ఆఫీస్ టైమింగ్స్ గురించి, నేను చేసే రకరకాల పార్ట్ టైం జాబ్స్ గురించి తెల్సినా ఒప్పుకుని ఆదరించారు.


లేట్ అయినా, ఏ షిఫ్ట్ చేసినా అర్థము చేసుకుంటారు. నేను లేకపోయినా, మా అత్తామామలు, మా ఆయన పిల్లలని బాగా చూసుకుంటారు. ఇదే నమ్మకంతో డెలివరీ అయిన 5 నెలల నుంచే జాబ్‌లో చేరిపోయా. నా ఫ్యామిలీ సహకారంతో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాను. అన్నట్టు మాకు ఇద్దరు పిల్లలు .. 11 ఏళ్ల సాత్విక్, 7 ఏళ్ల సాన్వి.

ఇంటి పని … ఆఫీస్ పని ఎలా మేనేజ్ చేస్తారు?

నిజం చెప్పనా.. మాకు పనమ్మాయి లేదు. మొత్తం ఇంటి పని, వంట చేసుకుని ఆఫీసుకి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వచ్చాక పని చేసుకుంటాను. ఒక్కోసారి పనితో అలసటగా అనిపిస్తుంది. కానీ బయట జిమ్ కి, వెళ్లడం కన్నా… ఇంటి పని చేస్తూ బాడీకి పని చెప్పడం మంచిదనిపిస్తుంది. ఇదే నా ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్. ఒళ్ళు వంచి ఇంట్లో మన పని మనము చేసుకుంటే… ఆరోగ్యం మన సొంతం. ఇక ఆఫీస్ అంటే టూ వీలర్ పైన వెళ్తుంటా. ఒకేసారి 2 డ్యూటీస్ ఉండకుండా షెడ్యూల్ చేసుకుంటా.

మీకు వచ్చిన అవార్డ్స్

జీ. వీ. ఆర్. ఆరాధన వారు బెస్ట్ యాంకర్ అవార్డు ఇచ్చారు.

మీ మేకప్ మీరే వేసుకుంటారని విన్నాం?

అవును. కొన్ని సందర్భాల్లో నా మేకప్ నేనే వేసుకుంటా. అంతే కాదు అప్పుడప్పుడు హెయిర్ స్టైల్ కూడా. అన్ని నేర్చుకుంటే మంచిది కదా.

మీలో ప్లస్… మైనస్

ప్లస్ —
ఎవరైనా ప్రాబ్లెమ్ లో ఉంటే హెల్ప్ చేయడం, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం.

మైనస్ — బద్ధకం, కోపం

మీ డ్రీమ్

ప్రభుత్వ ఉద్యోగం రావాలని. ఎందుకంటే నేను ఈ స్థానంలోకి రావడానికి చాలా కష్టపడ్డాను. జీవితంలో విలువైనవి పోగొట్టుకున్నాను. త్యాగాలు చేశాను. అందుకే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కోరిక.చివరగా ఒక మెసేజ్

నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది నన్ను చాలా కలచివేసింది. ఈ మధ్య ఇలాంటి వార్తలు వింటూనే వున్నాం. అందుకే అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇలాంటి పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనిషిగా పుట్టడం ఓ వరం. ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రాబ్లెమ్ అనేది రాత్రి వచ్చే చీకటిలాంటిది. సొల్యూషన్ అనేది పగలు వచ్చే వెలుతురులాంటిది. రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో అలాగే కష్టం తర్వాత సుఖం వస్తుంది. కొంచెం ఓపికగా వుండాలి. లైఫ్ లో మనకు ఒకటి మిస్ అయినా… అంతకన్నా బెటర్‌గా మరొకటి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కృoగిపోకుండా… సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా బాలన్స్ చేయండి. భరించలేని బాధ వున్నప్పుడు ‘నా’ అనే వారితో పంచుకోండి. ప్రతీరోజు ఆనందంగా గడవాలనే కాదు… అప్పుడపుడు సమస్యలు రావాలని కోరుకోండి. ఎందుకంటే సమస్యకు సమాధానం కనుగొనాలి. మన మెదడుకు పని చెప్పాలి.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*