నిన్న గల్వాన్.. నేడు పాంగాంగ్… నిన్న టిక్‌టాక్.. నేడు పబ్జీ.. డ్రాగన్‌పై మోదీ సెకండ్ డిజిటల్ స్ట్రైక్

న్యూఢిల్లీ: చైనాపై మోదీ సర్కారు మరోసారి డిజిటల్ స్ట్రైక్ జరిపింది. గల్వాన్ లోయలో భారత జవాన్లపై దాడికి ప్రతీకారంగా టిక్‌టాక్ సహా 59 యాప్‌లను బ్యాన్ చేసిన భారత్ నేడు పాంగాంగ్‌లో చైనా బలగాలు భారత జవాన్లతో ఘర్షణకు దిగడంతో పబ్జీ సహా మొత్తం 118 చైనా మొబైల్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. మోదీ సర్కారు చర్యతో డ్రాగన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చైనా యాప్‌లతో దేశ సారభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలుగుతుందనే కారణంతోటే బ్యాన్ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో పబ్జీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కనీసం 50 మిలియన్ల డౌన్‌లోడ్స్ అయ్యుంటాయని అంచనా. అలాంటిది ఒక్క దెబ్బతో చైనాకు భారీగా రెవిన్యూ కోల్పోయేలా చేసింది మోదీ సర్కారు.

గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో భారత జవాన్లపై పీఎల్ఏ దుర్మార్గంగా దాడి చేసి కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. భారత బలగాల ప్రతీకార దాడిలో పెద్ద సంఖ్యలో చైనా సైన్యం చనిపోయినా డ్రాగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేవలం రెండు వైపులా నష్టం జరిగిందని మాత్రమే వెల్లడించింది. యుద్ధం చేయకుండానే కేవలం యాప్‌లు బ్యాన్ చేయడం ద్వారా, ఇప్పటికే కుదర్చుకున్న టెండర్లను రద్దు చేయడం ద్వారా చైనాకు మోదీ సర్కారు కోలుకోలేని దెబ్బతీసింది. పరిస్థితులు చక్కబడుతున్నాయోమో అనుకునేలోగానే చైనా మళ్లీ పాంగాంగ్ వద్ద భారత జవాన్లతో ఘర్షణకు దిగింది. దీంతో పబ్జీ సహా 118 మొబైల్ యాప్‌లను మోదీ సర్కారు నిషేధించింది.

అటు వాస్తవాధీన రేఖ వెంబడి ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన రఫెల్ యుద్ధ విమానాలను మోహరించిన భారత్… రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ నుంచి భారీగా అత్యాధునిక ఆయుధ సామాగ్రిని, క్షిపణి రక్షక వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. చైనా కూడా జే 20 జెట్ విమానాలను భారత్‌కు సమీపంలో మోహరించి సిద్ధంగా ఉంచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*