
ఈటీవీలో తీర్థయాత్ర, అన్నదాత,
జెమిని టీవీలో రసమాధురి,
సప్తగిరి టీవీలో లేఖారవళి, ప్రభాత దర్శిని, వ్యవసాయ సమాచారం, న్యాయ సలహాలు,
విస్సా టీవీలో మీ వంట,
ఇలా ఇన్ని టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా పనిచేస్తున్న సంగీత…. 101.9 రెయిన్బో ఎఫ్ఎంలో రేడియో జాకీ కూడా. తెలుగుభాషను పరిరక్షించాలనే సంకల్పం ఆమె మాటల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. రేడియోతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సంగీత.. ఈక్షణం ప్రేక్షకులతో తన అనుభవాలను పంచుకునేందుకు సమయమిచ్చారు.
సంగీత.. మీకు రేడియోలో ఛాన్స్ ఎలా వొచ్చింది? ఎంతకాలంగా రేడియో జాకీగా చేస్తున్నారు.?
ఆకాశవాణిలో 14 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. చాలా అదృష్టంగా భావిస్తుంటాను. Rj కంటే ముందే నేను ఒక యాంకర్ని. సప్తగిరి, ఈటీవీ, భక్తి, జెమినీ ఛానల్స్‌లో చేసేదాన్ని. గ్లామర్, లక్, స్మార్ట్‌నెస్ అన్నీ ఉన్నంత వరకే ఆ జాబ్. గ్లామర్ అనేది శాశ్వతంగా ఉండేది కాదు. కొత్త నీరు వస్తే మనం పక్కకు తప్పుకోవలసిందే. అదే నన్ను చాలా బాధపెట్టేది. మరి గొంతుకి, మాటకి సంబంధించింది ఐతే కెరియర్ లైఫ్ ఎక్కువుంటుంది అని రేడియోలో అనౌన్సర్‌గా చేరాలని వెళ్ళాను. Rj అయ్యాను.
అసలు మీరు Rj అవుతారని అనుకున్నారా?
రేడియో జాకీ సెలెక్షన్ సమయంలో అందరిలాగే స్క్రీనింగ్ టెస్ట్‌కు అటెండ్ అయ్యాను. సెలెక్ట్ అయ్యాను. ఐతే నా గొంతు బాగుంది, మాడ్యూలేషన్ బాగుంది. చెప్పే తీరు బాగుంది కానీ…. పూర్తిగా అచ్చ తెలుగు పదాలు ఉపయోగించడం వల్ల అమ్మమ్మల ముచ్చటగా ఉంది. జోష్‌గా యంగ్ వాళ్ళకి చెప్పేలా లేదు అని తేల్చేశారు. ఐతే ఇప్పటి ఆకాశవాణి డైరెక్టర్ శైలజా సుమన్ గారు పట్టుబట్టి బహుభాషాల్లో మాట్లాడేవారిని మనం తీసుకురాగలం, అచ్చ తెలుగులో మాట్లాడేవారు దొరకడం కష్టం పైగా మన భాషలో చక్కగా మాట్లాడే వారిని ప్రోత్సహించడం మన భాద్యత, మన అవసరం కూడా అని చెప్పి మరీ నన్ను సెలెక్ట్ చేశారని తెలిసింది. ఇది నా Rj కధ.
రేడియో జాకీగా చేస్తూ ఇంకా ఏమి చేస్తుంటారు?
ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాను. డబ్బింగ్స్ చెబుతాను, సింగింగ్ కూడా.
మీ పేరులో ఉన్న సంగీత మీలో ఉందన్న మాట.
రేడియోనే నన్ను అలా మలిచింది. చిన్నప్పటి నుండి పాటలన్నా, సంగీతం అన్నా చాలా ఇష్టం.
సింగర్ అవ్వడానికి ప్రత్యేక కారణం ఉందా?
మీ వాయిస్ స్వీట్ గా ఉంది మీరు సింగరా? సంగీత సంగీతం పాడగలదా? అని ప్రశ్నించేవారు. తల అడ్డంగా తిప్పడం నాకు నచ్చక, ఎంతో ఇష్టమైన పాటలని ఎలా పాడాలో నేర్చుకోవాలని సంగీతాన్ని నేర్చుకున్నా.
మీకు చాలా నచ్చిన పాట?
ప్రతీ పాట నాకో ఆణిముత్యమే.
మీకు పేరు తెచ్చిన సాంగ్?
పాటకు తగ్గ మూడ్‌ని క్యారీ చేస్తూ మనస్ఫూర్తిగా పాడగలిగితే ప్రతీ పాట మనకు మంచి పేరే తెచ్చి పెడుతుంది.
ఒకవేళ ఆర్జే కాకపోతే మీరేం చేసేవారు?
మా నాన్న ఒక హిందీ పండితులు. ముందుతరాల వారిని తీర్చిదిద్దడం టీచర్లకే సాధ్యం. నేనూ టీచింగ్ ఎంచుకునేదాన్ని.
ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా చేయడం ఎలా అనిపిస్తుంది?
శ్రోతలకు అన్ని విషయాలపై అవగాహన పెంచేలా సామాజిక బాధ్యతగా కార్యక్రమాలను రూపొందిoచే AIRలో రేడియో జాకీగా చేయడం నాకు అంది వచ్చిన అదృష్టంగా భావిస్తాను.
మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది?
సామెతలు, పొడుపుకధలు. ప్రతి వారం కొత్త పొడుపుకధలు పొడవడం, సగం సామెతలు చెప్పి మిగతాది పూరించమనడం చేసేదాన్ని. 4 సంవత్సరాల క్రితం…. ఇప్పటికి అలాంటి షో చెయ్యమని అడుగుతూ ఉంటారు.
అప్పుడప్పుడు పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.ఎలా అనిపిస్తుంది?
శ్రోతలు వారి ఇంటి సభ్యులుగా మమ్మల్ని పలకరించడం, ఆప్యాయతగా మాట్లాడటం చూస్తుంటే నూతనోత్సాహం వస్తుంది. బాధలన్నీ మర్చిపోవచ్చు.
మీకూ ఫాన్స్ ఉంటారుగా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?
రేడియోలో కేవలం మాటలేగా అనుకుంటాం. కానీ మన మాటలను బట్టే మన వ్యక్తిత్వం పసిగడతారు. మీ మాటల్లోనే మీ మంచితనం అర్ధమౌతుందని చాలా మంది ఫాన్స్ అంటుంటారు. ఒకవారం షోకి వెళ్లకపోతే నీ పర్సనల్ నెంబర్ ఇవ్వు తల్లీ కనీసం నీతో ఫోన్లో మాట్లాడుతామనే ఫ్యాన్స్ లేకపోలేదు. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
ఫ్యాన్స్‌తో మీకు గుర్తుండిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
చాలా ఉన్నాయి.మొన్న నా పుట్టిన రోజుకి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నా పేరు, గోత్రంతో ప్రత్యేక పూజలు చేయించారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్. లైఫ్‌లో మర్చిపోలేని సంఘటన అది.
ఫ్రీ టైమ్ లో ఏం చేస్తారు?
కొత్త కొత్త విషయాలు చదువుతాను, తెలుసుకుంటాను. నిజం చెప్పాలంటే ఫ్రీ టైం దొరకదు. ఉన్న టైం లొనే నా సింగింగ్ ప్రాక్టీస్, పిల్లలకోసం, ఇతర పనులు అన్నీ బ్యాలన్స్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇన్ని సంవత్సరాలుగా రేడియో జాకిగా చేస్తున్నారు కదా మీ లైఫ్ లో రేడియో అంటే ఒక్క మాటలో ఏంటి?
నా హృదయస్పందన.
మీ ఇన్స్పిరేషన్ ఎవరు?
ఒక బడి పంతులు అయ్యివుండి 6గురు ఆడపిల్లలు, ఒకేఒక్క కొడుకుతో….ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరి దగ్గర చెయ్యిచాపకుండా,ఎన్ని సమస్యలైనా లెక్కచేయకుండా ధైర్యంగా ఎదురుకొని అందరికీ తలలో నాలుకలా మెదిలిన మా నాన్నగారు నాకు ఎప్పటికి ఆదర్శం.
మీలో మీరు మార్చుకోవాలి అనుకున్నది ఏది?
చివరి నిముషం దాకా ఉండీ ఉండీ….. స్క్రిప్టు రెడీ చేసుకుంటాను.టెన్షన్ పడుతూ రాయడం అలవాటైపోయింది. దాన్ని ఎప్పుడు మార్చుకుంటానో నాకే తెలియదు.
మీలో మీకు నచ్చేది?
తప్పును తప్పే అని చెప్పడం, అలా చెప్పడానికి మొహమాట పడక పోవడం, కల్మషం లేకపోవడం, అన్నిటికి మించి నా స్వరం
రేడియో జాకీలలో మీరు ఎవరిని ఫాలో అవుతారు?
మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకళ్ళని ఫాలో అవ్వడం మoచిదికాదు. మనకంటూ ఒక ఉనికి ఉండాలి. ఈ అమ్మాయి ఫలానా వాళ్ళలా మాట్లాడుతుందనడం కంటే ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అంటే బాగుంటుంది.
ప్రస్తుతం ఏ షో చేస్తున్నారు?
ప్రస్తుతం సింగిడి షో (12 to 4) చేస్తున్నాను.
మీకు బాగా ఆప్ట్ అయిన షో ఏది?
నైట్ షో సుర్‌సంగం.11 టూ12 టైంలో వస్తుంది. ఆ పాత మధురాలు వినిపించాలి. ఆ షోకి తగ్గట్టు నా గొంతుని కూడా మెలోడీగా మార్చేస్తానని నాకు పేరు.
టాపిక్ సెలక్షన్లో ఎప్పుడైనా ఫ్లాప్ అయ్యానని ఫీల్ అయ్యారా?
టాపిక్ సెలెక్ట్ చేసి శ్రోతలకు వినిపించే వరకూ టెన్షన్ ఉంటుంది. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అని. కానీ ఎలాంటి టాపిక్ అయినా శ్రోతలు అల్లుకుపోతారు ఫ్లాప్ అవ్వనివ్వరు.
గుర్తుండిపోయిన శ్రోత?
నా పేరుతో ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాడేసిన శ్రోత ఒకరైతే, నా పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రోత మరొకరు.
నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు?
పొగడ్తను విమర్శను ఒకేలా రిసీవ్ చేసుకుంటాను.
జీవితంలో సాధించాలి అనుకునేది ఏది?
ప్రతి తల్లీ కోరుకునేది తన పిల్లలను ఒక మంచి పొజిషన్లో చూడలనుకోవడం…. తప్పకుండా సాధిస్తాను.
మీ వీకెనెస్ ?
లౌక్యం తెలియకపోవడం. ఏ విషయం అయినా నాకు నచ్చక పోతే ఎదుటివారు ఇట్టే గ్రహించేస్తారు. మనసులో బాధ, అయిష్టత పెట్టుకొని బయటికి చిరునవ్వుతో కనిపించడం నాకు చేత కాదు. దానివల్ల చాలా మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది.
రేడియో జాకీ కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్?
మెసేజ్ ఇచ్చే అంత దాన్ని కాదు. అడిగారని చెబుతున్నా ముందుగా భాషపై పట్టు ఉండాలి, మాటల్లో స్పష్టత ఉండాలి, అనవసరమైన నవ్వులు, హొయలు ఉండకూడదు. మన తెలుగును పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ. ఇది కేవలం నినాదంలా కాకుండా చేతల్లో కూడా చూపినప్పుడే అది సాకారమౌతుంది.
-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).
Be the first to comment