కంగనా వర్సెస్ శివసేన… బీఎంసీ విధ్వంసానికి ముంబై హైకోర్టు బ్రేక్

ముంబై: నటి కంగన రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ట్వీట్లతో మొదలైన ఈ పర్వం నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లైంది. ముంబైని ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా తయారు చేస్తోందని మండిపడ్డ ఆమెపై శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు విరుచుకుపడుతోంది. బృహన్ముంబై నగర పాలక సంస్థ బీఎంసీ కార్మికులు కంగనా కార్యాలయంలోకి జొరబడి ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతేకాదు జేసీబీ ఉపయోగించి ఆమె కార్యాలయ కాంపౌండ్‌వాల్‌ను కూడా కూల్చేశారు. చండీఘడ్ నుంచి బయలుదేరిన కంగనా ముంబై చేరుకునేలోపే ఉద్ధవ్ సారధ్యంలోని ప్రభుత్వం ఆమె కార్యాలయాన్ని కూల్చివేసింది. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన కంగనా సంకీర్ణ సర్కారును, బీఎంసీని బాబర్ ఆర్మీగా అభివర్ణించారు.

నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకే కంగనా కార్యాలయాన్ని ధ్వంసం చేశామని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే తన కార్యాలయంలో ఎటువంటి అక్రమ కట్టడాలు లేవని కంగనా స్పష్టం చేశారు.

ముంబైలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కంగనా ట్వీట్ చేశారు

బీఎంసీ కార్మికులు కంగనా కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ అడ్డుకునే యత్నం చేశారు. అయితే బీఎంసీ కార్మికుల పనికి ఆటంకం కలిగించకుండా చూసేందుకు వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

నటుడు సుశాంత్ సింగ్ కేసులో మహారాష్ట్ర సంకీర్ణ సర్కారు తీరును ఎండగట్టడంతో శివసేన తనను టార్గెట్ చేసిందని కంగనా ఆరోపిస్తున్నారు.

మరోవైపు ముంబై హైకోర్టు కంగనా కార్యాలయంలో ఎలాంటి కూల్చివేతలకు పాల్పడరాదని ఆదేశాలిచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*