ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకం ప్రత్యేకతలు

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించి, ఆత్మస్థైర్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకాన్ని ప్రారంభించింది.

కరోనా మహమ్మారి కారణంగా వీధి వ్యాపారులు ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. చెప్పారు.

వ్యవస్థీకృత ఆర్ధిక వ్యవస్థలో భాగంగా లేని చిరు వ్యాపారులకు సహాయం కోసం ఉద్దేశించిన ఈ పథకం ఒక గొప్ప ప్రయత్నం అని, పీఎం స్వనిధి పథకం కింద ఒక వీధి వ్యాపారి 2022 మార్చి వరకు 10,000 వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా.. సులభంగా తనవ్యాపారం కోసం మూలధన రుణాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ రుణం కాలపరిమితి ఒక సంవత్సరం కాగా, ఒకవేళ ముందస్తుగా తిరిగి చెల్లించినా ఎటువంటి జరిమానా ఉండదని, కిషన్ రెడ్డి తెలిపారు.

తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలోకి జమవుతుంది. డిజిటల్ లావాదేవీలను నిర్వహించడం ద్వారా రూ.1,200/- వరకు నగదును పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఖాతాలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ద్వారా నేరుగా జమచేస్తారని, కేంద్ర మంత్రి తన వీడియో సందేశం లో పేర్కొన్నారు.

వీధి వ్యాపారుల కుటుంబాల సాంఘిక, ఆర్థిక పరిస్థితులను గుర్తించి.. వారిని వివిధ కేంద్ర /రాష్ట్ర పథకాల పరిధిలోకి తీసుకురావడం, వారికి తగిన సహాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు – ప్రభుత్వ & ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఎంఎఫ్‌ఐలు ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తాయి. రుణ దరఖాస్తులను పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా స్వయంగా లేదా మునిసిపల్ అధికారులు, పౌర సేవ కేంద్రాలు, బ్యాంకుల శాఖల సహాయం ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. ఇంకా, PM SVANidhi మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ ప్రతినిధులు/ఏజెంట్లు.. వీధి వ్యాపారుల ఇంటి వద్ద రుణ దరఖాస్తులను అప్‌లోడ్ చేయవచ్చని, మంత్రి సూచించారు.

వీధి వ్యాపారులను గుర్తించడం కోసం అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్‌బీ) నేతృత్వంలో చేసిన సర్వే పరిధిలోకి రాని వీధి విక్రేతలు కూడా, యూఎల్‌బీల నుంచి సిఫారసు లేఖను పొందడం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం కింద రుణాలు ఇవ్వడం ప్రారంభించిన కేవలం 9 వారాల్లోనే, 9.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మూడు లక్షల దరఖాస్తులు ఆమోదం పొందగా, 75,000 మందికి రుణాలను మంజూరు చేశారని కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా, కిషన్ రెడ్డి, స్వనిధీ పథకం పూర్తి ప్రయోజనాన్ని పొందాలని వీధి వ్యాపారులను కోరారు. దేశవ్యాప్తంగా ఆమోదం లభించిన మొత్తం దరఖాస్తులలో మధ్య ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఒక్క రాష్ట్రం నుంచే 47 శాతం దరఖాస్తులు వచ్చాయి. కాగా తెలంగాణా రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. సోషల్ మీడియాతో సహా వివిధ మార్గాల ద్వారా ఈ పథకం గురించి ప్రచారం చేసి, మరింత మంది చిరు వ్యాపారులు లబ్ది పొందేలా కృషి చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*