అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణకు జగన్ నిర్ణయం

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేయనుంది.

రథం దగ్ధం ఘటనపై బీజేపీతో పాటు రాజకీయ పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాల ఆందోళనతో అంతర్వేదిలో ఉద్రిక్తత నెలకొంది. విపక్షాల విమర్శలు, నిరసనల నేపథ్యంలో జగన్ సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించారు.

ఈ నెల 5న అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో షెడ్డులో భద్రపరిచిన కల్యాణోత్సవ రథానికి మంటలు అంటుకుని దగ్ధం అయింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆకతాయిల పనా అనేది తేలాల్సి ఉంది. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 సంవత్సరాల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో ఏటా ఈ రథాన్నే వాడుతుంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*