భాష, సంస్కృతుల పరిరక్షణే విశ్వనాథ వారికిచ్చే నిజమైన నివాళి!: వెంకయ్య

న్యూఢిల్లీ: మాతృభాషను పరిరక్షించుకోవడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం, ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కవిసామ్రాట్ విశ్వనాథ వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమ్మభాష, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమే విశ్వనాథ వారి జీవితమని ఆయన తెలిపారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి సందర్భంగా శ్రీ విశ్వనాథ సాహితీపీఠం ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాలను అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యాసంతోపాటుగా సంస్కృతి, భాష, సంప్రదాయాలను సమీకృతం చేసినప్పుడే పిల్లలు సమగ్రమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలరన్నారు. నూతన జాతీయ విద్యావిధానం-2020 ఈ రకమైన విద్యావిధానానికే పూర్తి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ విధానం లక్ష్యమన్నారు. ‘ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో ఉంటే చిన్నారుల్లో మానసిక వికాసం బాగుంటుంది. భారతీయ భాషలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత వికసిస్తుంది’ అన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి వ్యాఖ్యలను కూడా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.

‘తెలుగు చక్కగా వచ్చాక ఇంగ్లీషు చెప్పించాలి. ఒక ఏడాదిలో తగినంత వస్తుంది. బుద్ధి వికసించిన తర్వాత ఏ భాష అయినా తొందరగా వస్తుంది. రెండేళ్ళలో నేర్చుకోగలిగిన పరభాషను పసితనము నుంచి చెప్పి బాలల మేధోవికాసాన్ని పాడు చేస్తున్నాము’ అంటూ విశ్వనాథ వారు మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను పేర్కొనడనాని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

విశ్వనాథ వారు చారిత్రక నవలలు, విమర్శనాత్మక గ్రంథాలతోపాటు పద్యకావ్యాలు, మహాకావ్యం, నాటికలు, పాటలు, గేయకావ్యాలు, ఖండకావ్యాలు ఇలా ఏది రాసినా.. భారతీయ ఆత్మను ప్రతిబింబింపజేశారన్నారు. శతాధిక గ్రంథకర్తగానే గాక తెలుగు సాహిత్యంలో ప్రతి ప్రక్రియను స్పృశించిన సాహితీవేత్తగా వారు కీర్తినొందారన్నారు.

గురువైన తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిచేత కూడా ప్రశంసాపూర్వక ఆశీర్వచనాన్ని పొందిన ధన్యజీవి కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 4-5 తరాల తెలుగు సాంఘిక, సాంస్కృతిక పరిణామక్రమాన్ని విశ్వనాథవారి ‘వేయిపడగలు’ మన కళ్ళకు కడుతుందని.. భారతీయ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ప్రాచీన కళలు, నిర్మలమైన విజ్ఞానం.. జాతికి ఎలా దూరమవుతున్నాయనే అంశాలను గురించి ఎన్నో విశేషాలు ఈ నవలలో ఉంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

‘ఆంధ్ర పౌరుషం’ కావ్యంలో అమరావతిలో బౌద్ధుల వైభవాన్ని చెబుతూ ‘గోదావరీ పావనోదార’ అంటూ నాటి వైభవాన్ని కీర్తించిన అంశాన్ని, తెలుగు రుతువులు కావ్యంలో ఆరు రుతువుల్లో తెలుగు గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టారన్నారు. శ్రీ విశ్వనాథవారి రచనల్లో వినూత్న శైలి, వ్యక్తిత్వం ప్రతిబింబిస్తాయన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మాటల్లో విశ్వనాథ వారి స్మరణ ఎక్కువగా కనిపించేదని.. ఎన్టీఆర్ గారి చేత తొలి నాటకం వేయించింది విశ్వనాథ వారేనని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఏ పని చేసినా ‘ఉపాసనా దృష్టితో చేయాలి’ అన్న కవిసామ్రాట్ మాటలను జీవితానికి అన్వయించుకున్నానని శ్రీ ఎన్టీఆర్ తరచూ చెబుతుండేవారన్నారు. శ్రీశ్రీ లాంటి వారు సైతం ‘గోదావరి పలుకరింత.. కృష్ణానది పులకరింత.. మాట్లాడే వెన్నెముక.. అతగాడు తెలుగు వాడి ఆస్తి’ అంటూ విశ్వనాథ శైలికి నీరాజనం పట్టారన్నారు.

విశ్వనాథ వారి సాహిత్యం మీద, మరీ ముఖ్యంగా విశ్వనాథ వారి సాహితీ సృజనకు దర్పణంగా నిలిచి, తెలుగు భాషకు తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన రామాయణ కల్పవృక్షం మీద జరిగినన్ని పరిశోధనలు ఎక్కడా జరగలేదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఇంతటి గొప్పటి విశ్వనాథ వారి సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేయిపడగలు చదివే తీరిక, ఓపిక లేదనుకుంటే చెలియలి కట్ట, ఏకవీర, పులిముగ్గు లాంటి వాటితో ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శ్రీ విశ్వనాథ వారి సాహితీ స్ఫూర్తితో.. తెలుగు భాష, సంస్కృతి, భారతీయతను కాపాడుకుంటూ.. పర్యావరణ పరిరక్షణకు తెలుగు వారంతా కంకణబద్ధులై ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధానకార్యదర్శి వామరాజు సత్యమూర్తి, విశ్వనాథ ఫౌండేషన్ అధ్యక్షుడు విశ్వనాథ సత్యనారాయణ (మనుమడు), కార్యదర్శి విశ్వనాథ శక్తిధర పావకి, విశ్వనాథ మనోహర పాణిని, కోశాధికారి సి.హెచ్. సుశీలమ్మ, సభ్యులు కవుటూరు రత్నకుమార్ సహా వివిధ దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*