భగవద్గీత, భక్తి పాట.. ఇవే ఆయన ఆశ, శ్వాస

హైదరాబాద్: వృత్తిని, ప్రవృత్తిని సమాంతరంగా నడిపించడం ఎవరికైనా కత్తిమీద సామే. పాత్రికేయ వృత్తిలో 27 ఏళ్లుగా కొనసాగుతూ, 35 ఏళ్లకు పైగా ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ముందుకు సాగుతున్నారు ఆదూరి వెంకటేశ్వరరావు. చిన్ననాడే భజనలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం దత్త సాయి భక్త సమాజం స్థాపనకు దారి తీసి, హైదరాబాద్‌లో 20 ఏళ్లకు పైగా వేలాది భజనలు నిర్వహించారు. దీనికి ముందు దశాబ్దానికి పైగా వేలాది భజనల్లో పాడి పండిత, పామరులను తన భక్తి పాటలతో అలరిస్తూ వచ్చారు. దత్త, సాయి గురువుల సాహచర్యంతో సాగుతూ వచ్చిన ఈ ప్రస్థావన భగవద్గీత వద్దకు ఆయనను చేర్చింది. ఘంటసాల వారు పాడిన 100 పద్యాలను ఆలపించడంతో పాటు గీతను ఔపాసన పట్టేందుకు నిరంతరం కృషి సాగిస్తున్నారు. ఇక్కడే ఆయన జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.

షిర్డీ సాయి అనుగ్రహ విశేషం, గురువుల ఆదేశంతో సొంత ‘యూట్యూబ్ ఛానెల్’ కొద్ది గంటల్లోనే కార్యరూపం దాల్చింది. గురువుల ఆదేశంతో తన పేరును సంక్షిప్తం చేసి…AVR channel పేరుతో సరిగ్గా మూడు నెలల క్రితం కేవల భక్తి ప్రధానమైన ఛానెల్‌గా దీనిని తీసుకువచ్చారు.

సహచర మిత్రుడు ఛానెల్ ఓపెన్ చేయడానికి సహకరిస్తే, మరొక మిత్రుడు డైజైన్, మరొకరు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయించడం ఇలా సహకరించారు. ఆ ‘మిరాకిల్‌’ను ఆయన ఇలా చెప్పారు.

‘యావత్ ప్రపంచం కొద్దికాలంలో సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కింది. దేవాలాయాలు మూతపడ్డాయి. భజనలు లేవు. జనంలో భక్తి పెరిగినా, నిలకడగా లేని పరిస్థితి. కలౌ నామస్మరణః అనే మాట స్ఫురణకు వచ్చింది. నా బాధ్యత గుర్తొచ్చింది. భక్తి ఛానెల్‌ పెట్టి భయార్తులకు ఆధ్యాత్మికమైన స్వాంతన కలిగించాలనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా 50 ఏళ్ల పైబడిన వారికి ఇలాంటి స్వాంతన అవసరం ఉంది. నా పాటతో స్వాంతన పలకడమే కాదు, వారి చేత కూడా పాడించి భక్తి మరింత పాదుకొలిపేందుకు ఇదే తరుణ మనిపించింది. 35 ఏళ్లుగా కేవలం భక్తి పాటలు, భజనలే ఊపిరిగా సాగిన నాకు యూ ట్యూబ్ భక్తి ఛానెల్ ఓ సరికొత్త మలుపు. భక్తి ప్రచారంలో ఇది కూడా ఓ భాగంగానే భావించాను. నేను మాత్రమే పాడటం కాదు, ఔత్సాహిక కళాకారులందరికీ ఇందులో అవకాశం కల్పించాలి. నా పాటలకు ప్రేరణ స్వర్గీయ ఘంటశాల వారే కావడంతో ఆయనకు ఆచంద్రార్కం కీర్తి తెచ్చిపెట్టిన భగవద్గీతను ఆయన ఆశీస్సులతోనే యథాతథంగా భక్తులకు అందించడం నేను తెచ్చిన AVR channel ప్రధానోద్దేశాలలో ఒకటి. ఆ లక్ష్యం అచిరకాలంలోనే నెరవేరుతుందుని ఆశిస్తున్నా’ అని ఆదూరి వెంకటేశ్వరరావు తెలిపారు. తాను చేపట్టిన భక్తి ప్రచారయజ్ఞానికి వయోభేదం లేకుండా ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

‘పాట పాడినంత కాలం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాననే నమ్మకం నాకుంది. పాటే నా ఊపిరి. చివరి శ్వాస వరకూ పాడాలని, అందుకు భగవంతుడు, భక్తజనుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అని వినమ్రంగా తెలియజేశారు. వయసు పరంగా 54వ పడిలో పడినా… భక్తిపాట, ఆపాత మధురాలపై ఏవీఆర్(ఆదూరి వెంకటేశ్వరరావు వాట్సాప్ నెంబర్ …9866493074)కు ఉన్న తాపత్రయాన్ని స్వాగతిద్దాం, ప్రోత్సహిద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*