స్వామి వివేకానంద చారిత్రక చికాగో ప్రసంగానికి 127ఏళ్లు

హైదరాబాద్: 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో స్వామి వివేకానంద హిందూ ధర్మ ప్రతినిధిగా పాల్గొని జయకేతనం ఎగురవేసారు. స్వామి వివేకానంద అమెరికా బయలుదేరకముందు భారతదేశమంతా పర్యటించి ప్రజల హీన స్థితిని, గాఢ తమస్సును చూసి చలించిపోయారు దానికి పరిష్కారంగా అమెరికాలో జరిగే సర్వమత మహాసభ గురించి విని,అలసింగ మొదలైన అనేక మంది ప్రోద్బలం చేత అక్కడకు వెళ్లి వారికి మన ఆధ్యాత్మిక సంపదను పంచి, వారినుండి లౌకిక విద్యలను పారిశ్రామిక, సాంఘిక విద్యలను పొందే ఉద్దేశ్యంతో అమెరికా వెళ్లారు.

సభలో అడుగు పెట్టేముందు అనేక కష్టాలను భరించారు. సెప్టెంబర్ 11 న సభ ప్రారంభం కాగా, ఆ రోజు సరిగ్గా 3:30 కి తన ప్రసంగంతో అక్కడి వారి హృదయాలు గెలిచారు. విద్యుత్ ప్రకంపనాలు తగిలినట్టు ఒక్కసారిగా 7000 మంది లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ఈ ప్రసంగంతో భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తి, పవిత్రత ప్రపంచాన్ని జయించింది. ఆ తర్వాత చాలా సార్లు తన ప్రసంగాలతో ప్రజల హృదయాలలో తనదైన ముద్రవేశారు.

మనం ఎందుకు విభేదిస్తాం హిందూమత సంగ్రహం, సర్వమత సమన్వయంపై కూడా స్వామీజీ ప్రసంగించారు. స్వామీజీ పాశ్చాత్య కార్యకలాపాలు దీని తరువాతే మొదలయ్యాయని చెప్పవచ్చు.

ప్రస్తుత కాలంలో స్వామి వివేకానంద సందేశ అనువర్తనం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సర్వ మానవ సౌభ్రాతృత్వం దిశగా అడుగులు వేయాలని, విభేదాలను వదిలేయాలని,ప్రతి మానవుడు భగవంతుని స్వరూపమని చాటుతోంది. 127 వసంతాలైనా ఆనాటి ప్రసంగాలు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. విశ్వాత్మ భావం పెంపొందించుకోవడం వల్ల సమస్యలు పోయి శాంతి సాధ్యమవుతుంది అని ఈ నాడు గ్రహించి ఆచరించేందుకు ప్రయత్నిద్దాం.

-సాయి ప్రశాంతి నీల్దవార్, రామకృష్ణ మఠం వాలంటీర్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*