మనిషి ఉన్నప్పుడే విలువ తెలుసుకోవాలి, తల్లిదండ్రులు, తోబుట్టువుల మనసు నొప్పించవద్దు: పర్వీన్

ఆమె విషెస్ చెప్పిందంటే బ్లాక్ బస్టర్
పేరడీ అందుకుంటే ఆమె కన్నా బాగా ఎవరు పదాలు పేర్చలేరు
రంగం ఏదయినా టాపిక్ మరేదైనా ఒక్కసారి ఎంటర్ అయితే అద్భుతమే
దేశవిదేశీ అభిమానులను సొంతం చేసుకున్న ఆమె… పర్వీన్. తన బిజీ షెడ్యూల్ లోను ఈ క్షణం కోసం సమయం కేటాయించారు.


హలో మీ గురించి..

నా పేరు పర్వీన్. మాది పశ్చిమ గోదావరి జిల్లా.. బుట్టాయిగూడెం అనే ఒక చిన్న గ్రామం.

మీ ఫ్యామిలీ

ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల జాస్మిన్.. ఆరేళ్ల ఆదిల్. మా ఆయన అలీ… సినిమాటోగ్రాఫర్.

మీ రేడియో జర్నీ గురించి చెప్పండి

ఆల్ ఇండియా రేడియోతో నా రేడియో ప్రయాణం మొదలయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అనుబంధం కొనసాగుతూనే వుంది. అనౌన్సర్ గా ప్రారంభించి … ప్రస్తుతం డ్రామా సెక్షన్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాను. అందుకు ఎంతో సంతోషంగా అన్పిస్తుంది.

రేడియోలో అసలు ఎంట్రీ ఎలా ఇచ్చారు?

ఈ క్రెడిట్ అంతా మా శ్రీవారిదే. RJ అవుతానని అస్సలు అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ఇష్టం, ఇష్టం అనేకంటే పిచ్చి అంటే బాగుంటుందేమో! కాస్త టైం దొరికితే చాలు పాటలు పాడేసేదాన్ని. అలా ఆ ఇంటరెస్ట్ నాలో ఉండిపోయింది. పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చేసాం. ఇక్కడ రేడియో బాగా వినేదాన్ని. తెల్లారిందంటే రేడియో ఆన్ అవ్వాల్సిందే. అలా నా ఆసక్తిని మా ఆయన గమనించారు. ఎంతో బాగా పాటలు పాడతావు, చక్కగా మాట్లాడతావు … రేడియోలో ట్రై చెయ్ అని ప్రోత్సహించారు. ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్స్ జరుగుతున్నాయని, ట్రై చేయమని గైడ్ చేసారు. అలా ఆడిషన్స్ కి వెళ్ళాను. లక్కీగా సెలెక్ట్ అయిపోయా.2011లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా జాయిన్ అయ్యాను.

ఆల్ ఇండియా రేడియో కాకుండా ఇంకా ఎక్కడ జాబ్ చేసారు?

ఆల్ ఇండియా రేడియో చేస్తున్నప్పుడు టోరీ రేడియోలో అవకాశం వచ్చింది. అది ఒక NRI రేడియో. శ్రోతలు కూడా అక్కడి వారే. ప్రస్తుతం ‘మన రేడియోలో’ చేస్తున్నాను.

మీకు పేరు తెచ్చిన షో

“తెలుగమ్మాయి” ఈ షో టోరీ రేడియోలో ఉదయం 11:30కి వచ్చేది. నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రవాస ఆంధ్రులు (NRI ) ఎందరో అభిమానులు వినేవారు. మనకి ఉదయం 11:30 అంటే వాళ్ళకి అర్ధరాత్రి, అయినా సరే నా షో కోసం వెయిట్ చేసి నేను ఇచ్చే టాపిక్ పై మాట్లాడేవాళ్ళు. అదో అద్భుతమైన అనుభూతి. చాలా హ్యాపీగా అనిపించేది.

ప్రస్తుతం ఏయే షోస్ చేస్తున్నారు

ఇప్పుడు నేను ‘మన రేడియో’ లో RJ గా చేస్తున్నాను. ప్రస్తుతం 2 షోస్ హోస్ట్ చేస్తున్నాను. ఉదయం 11:30 to 1:30 ఆల్ ఇస్ వెల్, 3:30 to 5:30 మేజిక్ మోచా.

చాలామందిని ఇంటర్వ్యూ చేసి వుంటారుగా, ఆ ఎక్స్పీరియన్స్.

నాకు తెలిసి అన్ని రంగాలలో మొత్తం 50 మందికి పైగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను .అందరి దగ్గరా ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ .. ఈయన్ని చూసి ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న విషయం నేర్చుకున్నా. ఇక గ్రేట్ లిరిసిస్ట్ చంద్రబోస్ దగ్గర వర్క్ డెడికేషన్ ,పట్టుదల నేర్చుకున్నాను. ఇలా పలు రంగాలలో ఉన్న ప్రముఖులని ఇంటర్వ్యూ చేసే గొప్ప అవకాశం ఇచ్చిన టోరీ రేడియో కి థాంక్స్ చెప్పుకోవాలి.

ఆల్ ఇండియా రేడియో.. రెయిన్బో FM 101.9లో కూడా రేడియో జాకీగా చేసారు కదా. ఆ వివరాలు చెబుతారా.

నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడతా అయినా కూడా ఎంతో స్పష్టంగా. నిజానికి ౩౦సెకండ్స్ లో ఇవ్వాల్సిన అనౌన్సమెంట్ ని 25సెకండ్స్ లోనే పూర్తిచేసేసేదాన్ని. అప్పట్లో మా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నాగసూరి వేణుగోపాల్ .. నీ స్పీడ్ కి రెయిన్బో FM అయితే బాగా సెట్ అవుతుంది, అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి.. అప్లై చెయ్ అని అన్నారు. వెంటనే అప్లై చేశా .. సెలెక్ట్ అయిపోయా. 2012 నుండి రెయిన్‌బో ఎఫ్ఎం లో RJగా చేరిపోయాను. అక్కడ 70 mm అనే షో చేసేదాన్ని. సెలబ్రిటీస్ బయోగ్రఫీ చెప్తూ చేసే షో అది.


మీరు టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

నేను ఎక్కువగా మానవ సంబంధాలపైనే అంటే ప్రేమ, ఆప్యాయతలు వీటిపైనే దృష్టి పెడతాను. ఎందుకంటే వీటికి శ్రోతలు బాగా కనెక్ట్ అవుతారు.

శ్రోతలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా.. ఎలా అనిపిస్తుంది?

VJలు, యాంకర్స్ అయితే వాళ్ళని పబ్లిక్ గుర్తుపడతారు కానీ మేము RJలం. మా గొంతు తప్పితే మేమెవరో తెలీదు చెబితే తప్ప. అందులోనూ నా రేడియో మాడ్యూలేషన్ కి సాధారణంగా మాట్లాడే మాటకి సంబంధమే ఉండదు. కానీ పర్వీన్.. అని తెలిసిన వాళ్ళు మాత్రం చాలా ఎక్సైట్ అవుతారు. మీరు అలా గల గలా ఎలా మాట్లాడతారు అని అడుగుతుంటారు. సంతోషంగా అనిపిస్తుంది.

మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది

ఫాన్స్ విషయానికొస్తే అసలు వాళ్ళకి మనం ఎలా ఉంటామో తెలీదు ఎక్కడుంటామో తెలీదు కేవలం మనం చెప్పే మాటలకి వాళ్ళు ఫిదా అవుతూ మనపై అభిమానాన్ని చూపిస్తుంటారు. నాకు యుగాండా, కువైట్ ,ఆస్ట్రేలియా,సింగపూర్ ,టెక్సాస్ , ఇలా దేశవిదేశాలలో చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అక్కడి నుండి నా షో తప్పకుండా వింటుంటారు. ఇంకా మా పుట్టినరోజులు కూడా వాళ్ళు సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. మాపై కవితలు రాస్తూ ఉంటారు. ఈ క్రేజ్ సినిమా స్టార్స్ కే అనుకునేవాళ్లం.. మా పై కూడా ఇంత అభిమానం ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. కేవలం మాటే కదా అనుకుంటాం కానీ గొంతులోంచి వచ్చే మాటలు ఇంతమంది అభిమానుల్ని సంపాదించిపెడతాయా అని అనిపిస్తూ ఉంటుంది.

RJ కాకుండా ఇంకా ఏమేమి చేస్తుంటారు

టోరీ రేడియోలో ఉన్నపుడు తెలుగు వన్ కి , కిడ్స్ వన్ , భక్తి వన్ , న్యూస్ వన్ కి అన్నిటికి నేనే వాయిస్ ఓవర్లు ఇచ్చేదాన్ని. యాంకర్ గా సెలబ్రిటీస్ ఇంటర్వూస్ కూడా చేశాను. లిరిసిస్ట్ కులశేఖర్ గారితో, సింగర్ రవివర్మ గారితో ఇలా. టోరీ రేడియో అండ్ తెలుగు వన్ కి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి.

వర్క్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. నన్ను బాగా సపోర్ట్ చేసేవారు. అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇపుడు రెండు మూడు కంపెనీస్ కి ఫ్రీలాన్సర్ గా చేస్తున్నాను. FCP ఎడిటింగ్ నేర్చుకున్నాను. వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటాను. టచ్ ఏ లైఫ్, ధ్వనికి వాయిస్ ఇస్తున్నాను. కమర్షియల్ అడ్వటైజ్ మెంట్స్ కి ఆడియోస్ ఇస్తుoటాను.

రేడియో నుండి టీవీ రంగం లోకి వెళ్లారు ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ?

స్టూడియో N న్యూస్ ఛానల్ లో కొన్నాళ్ళు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పనిచేశాను. అది కూడా ఒక కొత్త అనుభవం. జాబ్ బాగానే ఉండేది.. కానీ మనసు మాత్రం రేడియోపై ఉండేది. టీవీలో వారిచ్చిన స్క్రిప్ట్ చదవాలి.. రేడియోలో మన స్క్రిప్ట్ మనం స్వేచ్చగా రాసుకోవచ్చు. అందుకే రేడియోను చాలా మిస్ అయ్యాను.


రేడియో అంటే మీకు ప్రాణం కదా. ఒకవేళ RJ కాకపోతే, మీరేం చేసి ఉండేవారు?

రేడియో జాకీ కాకపోతే MA BEd చేశా కదా ఏదో ఒక స్కూల్ లో పాఠాలు చెప్పేదాన్ని. నా దృష్టిలో ఆర్జేయింగ్ – టీచింగ్ కు పెద్ద తేడా లేదు. అక్కడ పిల్లలకు పదాలతో పాఠాలు చెప్పాలి. ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికి పాటలతో పాఠాలు చెబుతాం. అంతే.

మీ స్ట్రెస్ బూస్టర్?

డాన్స్. నాకు డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి డాన్స్ చేస్తుంటాను.

మీ హాబీ ?

పేరడీ అంటే నాకు భలే ఇష్టం. టైం ఉన్నప్పుడల్లా పాటలకు పేరడీ రాస్తుంటాను. నేనే పాడతాను కూడా.

View this post on Instagram

Samajavaragamana Vs Karona

A post shared by rjparveen (@rjparveen4win) on

మీరు విషెస్ డిఫరెంట్ గా చెప్తారట?

అవును. ముఖ్యంగా సెలబ్రిటీల బర్త్ డేస్. అందరికంటే యూనిక్ గా విష్ చేయాలని అనుకుంటాను. అందుకు తగ్గ స్క్రిప్ట్ రాస్తాను. వారి సినిమాలో పాటలు పాడి, డైలాగ్స్ చెప్పి ఇలా నా స్టైల్లో విషెస్ చెప్తాను. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను.

View this post on Instagram

happy birthday BALAYYA

A post shared by rjparveen (@rjparveen4win) on

View this post on Instagram

Happy Birthday PRINCE

A post shared by rjparveen (@rjparveen4win) on

ఇన్నేళ్లుగా RJగా చేస్తున్నారు కదా. మీ లైఫ్ లో రేడియో అంటే ఒక్క మాటలో?

రేడియో అంటే సింపుల్ గా చెప్పాలంటే మన సోల్ మన మైండ్ మన మనసు. ఎందుకంటే మైక్ ముందు ఉన్నంతసేపు మా బాధల్ని ,కష్టాల్ని ,కన్నీళ్ళని మర్చిపోయి నవ్వుతూ ఎంతో సంతోషంగా మాట్లాడతాం. జరిగిన ప్రతి విషయాన్నీ లిజనర్స్ తో షేర్ చేస్కుంటూ చక్కటి పాటలు ప్లే చేస్తూ, నచ్చింది మాట్లాడుతూ మనసుతో మనసారా మనస్ఫూర్తిగా మాట్లాడుకునేది అదొక్క చోటే. అందుకే రేడియో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.

మీ ఇన్స్పిరేషన్ ఎవరు

ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే వుంటా. సో చాలామంది.

మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది?

మొహమాటం. ఈ ఫీల్డ్ లో ఉండకూడనిది. ఎన్నోసార్లు మార్చుకోవాలి అనుకున్నాను. ప్రయత్నలోపం.

మీలో మీకు నచ్చేది

ధైర్యం. క్రియేటివిటీ. నా ధైర్యం నన్ను చాలాసార్లు కాపాడింది. ఏ పని అయినా అందరిలాగా కాకుండా కొత్తగా క్రియేటివ్ గా చేయాలి అనుకుంటా. ఇది నాకు నాలో బాగా నచ్చుతుంది

మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్

ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నప్పుడు మా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి గారు.. మిగతా RJలతో అనేవారట పర్వీన్ స్క్రిప్ట్ బాగా రాస్తుంది తన షో ఓసారి వినండి అని. ఎంతో హ్యాపీగా అన్పించింది. నాకు కిక్ ఇచ్చింది. ఆ రోజులు మళ్ళీ రావు.

టోరీ రేడియోలో చేసేటప్పుడు… ఇంటర్వ్యూ చేయాలన్నా .. గెస్ట్ గురించి ఇంట్రడక్షన్ రాయాలన్నా.. పర్వీన్ మాత్రమే అద్భుతంగా రాయగలదు అనేంత పేరు తెచ్చుకున్నాను.

మీ పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించినట్టున్నారు

అవును. లాక్ డౌన్ టైములో. మా పిల్లలతో కలిసి ‘లోకం’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో వారే లీడ్ యాక్టర్స్. మంచి పేరు వచ్చింది.


ఫ్యూచర్ ప్లాన్స్

ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ వచ్చింది. త్వరలో ఆ పనిలో బిజీ.

RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్.

RJ అవడం చాలా ఈజీ అనుకుంటారు కానీ మాట్లాడడం వేరు అందరు మెచ్చేలా మాట్లాడడం వేరు. అందరూ మాట్లాడతారు కానీ ఆ మాటల్లో స్పష్టత, స్వచ్ఛత, ఒక ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్.. వీటన్నిటితోపాటు సమయస్ఫూర్తితో మాట్లాడడం ఒక RJకే సొంతం అని నా అభిప్రాయం. భాష పై పట్టు ఉండాలి. మాటల్లో స్పష్టత ఉండాలి,చెప్పాలన్నది సూటిగా చెప్పడం,ఎదుటివారికి అర్ధమయ్యేలా చెప్పగలగడం ఇవన్ని వస్తే మీరు RJ కాదు బెస్ట్ RJ అనిపించుకుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. RJ లని చిన్నచూపు చూడకండి, ఒక ఆర్టిస్ట్ ఒక డైలాగ్ చెప్పాలంటే ఎన్నో టేక్ లు తీసుకుని చెప్తారు. కానీ సింగల్ టేక్ లో మాట్లాడి, నిర్విరామంగా మాటలతో మెప్పించగలిగేది రేడియో జాకీలు మాత్రమే అనే విషయాన్ని గుర్తించండి అని కోరుకుంటున్నాను.


చివరగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?


అవును మా నాన్న గురించి. ఈ మధ్యే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. మా నాన్న నాకు జీవితంతోపాటు, జీవితానికి సరిపడా ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేoత. ఆయన మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, అడిగిందల్లా కాదు లేదు అనకుండా ఇచ్చారు. ఆయన మరణంతో నాలో ఏదో తెలియని వెలితి ఏర్పడింది, ఐనా నాన్నగారు ఇచ్చిన ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తోంది. ఏదైనా సాధించగలదు నా కూతురు అని ఆయన నమ్మేవారు. ఆ నమ్మకాన్ని, తాను ఇచ్చిన ఈ జన్మని వృధా చేయకుండా, తాను ఇచ్చిన ధైర్యం తోనే ఏదైనా సాధించాలని అనుకుంటున్నా. అందరికి ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్న.. మనిషి మన మధ్య ఉన్నపుడు వారి విలువ తెలియదు. కానీ ఆ బంధం దూరమైతే… ! ఎవరూ కూడా పంతాలతో పట్టింపులతో బంధాలని దూరం చేసుకోకండి మరీ ముఖ్యంగా అమ్మ నాన్నలని తోడబుట్టిన బంధాలని దూరం చేసుకోకండి ..ఉన్నపుడు విలువ తెలియదు ..కోల్పోయాక విలువ తెలిసినా వ్యర్థం.

– -మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*