
• మాస్క్ లు ధరించడంతోపాటు సురక్షిత దూరం, పరిశుభ్రత పాటిస్తూ రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని సభ్యులకు సూచన
• కోవిడ్-19 నుంచి ఉత్తమ రక్షణ మాస్క్ ధారణే
• మహమ్మారి పూర్తిగా దూరం అయ్యే వరకూ సురక్షిత దూరం తప్పనిసరి
• పార్లమెంట్ సభ్యులతోపాటు ప్రజలు కూడా సురక్షిత దూరం కొనసాగించాలని సూచించిన రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు, పార్లమెంట్ సభ్యులు ఆరోగ్య సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి హోం శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఐసీఎంఆర్ ప్రధాన సంచాలకులు (డీజీ), రాజ్యసభ సచివాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు రాజ్యసభ చైర్మన్, సభ్యులకు తెలియజేశారు.
ఈ మహమ్మారితో పోరాడటంలో భాగంగా సభ్యులు తీసుకోవలసిన నాలుగు కీలకమైన చర్యలను రాజ్యసభ చైర్మన్ ప్రధానంగా ప్రస్తావించారు. బయటి వారిని కలిసేటప్పుడు మాస్క్ ధరించడం అత్యంత ఆవశ్యకమన్న ఆయన, మీ దగ్గర పని చేసేవారు సైతం బయట నుంచి వచ్చి విధులను నిర్వహిస్తుంటే వారు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు.
సురక్షితమైన దూరాన్ని పాటించడం రెండో అతిముఖ్యమైన జాగ్రత్త అని తెలిపిన రాజ్యసభ చైర్మన్, ఈ మహమ్మారి దూరమయ్యే వరకూ సురక్షిత దూరం విషయంలో రాజీపడొద్దని సూచించారు. మూడో జాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రతను ప్రస్తావించిన ఆయన, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రపరచుకోవడం వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నాలుగో జాగ్రత్తగా రోగనిరోధక శక్తిని సూచించిన రాజ్యసభ చైర్మన్, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఇది సాధ్యమౌతుందని తెలిపారు. మంచి పోషకాలున్న బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా రోజూ నడవడం లాంటి కనీస వ్యాయామాలైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదని, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు గతంలో సూచించిన ఆహారమే అని, ఆయా ప్రాంతాల్లో దొరికే స్థానిక వంటకాల్లో ఎన్నో పోషకాలుంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుల ఆరోగ్యభద్రత విషయంలో తమ ఆందోళన వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని, ఆరడుగుల పరిమితికి కచ్చితంగా కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారులతో లేదా సభాపతితో ఏదైనా మాట్లాడాలనుకుంటే వ్యక్తిగతంగా కలిసే బదులుగా ఓ చిన్న చీటీ పంపాలని సూచించారు.
ఈ మహమ్మారి విషయంలో పార్లమెంట్ తీసుకుంటున్న చర్యలు, ఏర్పాటు చేసిన సౌకర్యాలను పునరుద్ఘాటించిన ఉపరాష్ట్రపతి రాపిడ్ యాంటిజెన్ మరియు ఆర్టీ-పీసీఆర్ రెండు పరీక్షా సౌకర్యాలు పార్లమెంట్ లోని రిసెప్షన్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం గం. 2.30 నిముషాల వరకూ, అదేవిధంగా పార్లమెంట్ అనెక్సీలో ఉదయం గం.10-30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. సభ్యులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని, వారి సౌలభ్యం మరియు అవసరాలకు అనుగుణంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఇవేగాక గణనీయమైన సంఖ్యంలో ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సహిత ప్రథమ చికిత్స పార్లమెంట్ తో పాటు పార్లమెంట్ అనెక్సీ వైద్య కేంద్ర వద్ద లభిస్తాయని తెలిపారు.
సభ్యుల భద్రత కోసం ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించే విషయంలో సభ్యులందరూ సహకరించాలని కోరిన ఆయన, సమయం కొరత దృష్ట్యా అర్థవంతంగా వినియోగించుకోవాలని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని సభ్యులకు సూచించారు.
Be the first to comment