పరువు నిలిచిందా .. ప్రతిష్ట దిగజారిందా? ప‌రువు హ‌త్య‌ల‌పై స్పెష‌ల్ స్టోరీ

పరువు- ప్రతిష్ట జీవిత గమనంలో అందరూ కోరుకునేది అదే. అందరూ పరువుతో బతకాల్సిందే, దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పొడవుగా బతకడం అంటే… కులమతాలకు అతీతంగా మనిషి మనిషిలా బతకడం.తనకు ఉన్న దాంట్లో బరువుగా జీవితం సాఫీగా నడవాలని అందరూ ఆకాంక్షిస్తారు .మరి పరువు కోసం ఏమైనా చేస్తారా తరచుగా వినిపిస్తున్న పరువు హత్యల పరమార్ధం ఏంటి..?

హైదరాబాద్ చందానగర్ లో తాజాగా వెలుగుచూసిన పరువు హత్యోదంతం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. నగరం ఉలిక్కిపడేలా చేసింది అల్లారుముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయి ప్రేమలో పడి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఆ తల్లిదండ్రుల దృష్టిలో క్షమించరానినేరం గా మారింది. మనసును తొలిచిన ఆ ఆలోచన పెనుభూతం గా మారి కన్నవారిని కాస్తా కసాయివారిగా మార్చేసింది. అదేదో క్షణికావేశంలో జరిగింది కాదు .నెలల తరబడి పదును పెట్టిన ఆవేశం ,తమ అమ్మాయి వివాహమాడిన యువకుడిని దుర్మార్గంగా దయాదాక్షిణ్యాలు లేకుండా హతమార్చే స్థాయికి దిగజార్చింది.

అసలేం జరిగింది?

మిర్యాలగూడలో ప్రణయ్ ని అతని మామ మారుతీరావు సుపారీ ఇచ్చిమరీ హతమార్చిన రీతిలోనే హైదరాబాద్ చందానగర్ లోనూ ఘటన జరిగింది. తమకు ఇష్టం లేకుండా అమ్మాయి వేరే కులానికి చెందిన వ్యక్తిని పెండ్లాడిందన్న కోపంతో సొంత అల్లుడునే హతమార్చి కుమార్తెకు వైధవ్యాన్ని కలిగించారు. ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం అమ్మాయి అవంతి రెడ్డి ఇంటికి వచ్చిన మేనమామలు , మేనత్తలు నాన్న దగ్గరికి తీసుకు వెళ్లి మాట్లాడి ఇస్తామని నమ్మించి కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. ముందుగా వేసుకున్న కుట్ర ప్రకారం కారును దారి మళ్ళించి మరీ పట్టపగలే కిరాతకులతో హేమంత్ ను హత్య చేయించారు. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఒక కన్నతల్లికి తీరని శోకాన్ని మిగిల్చారు. అవంతి, హేమంత్ ల మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగి ,2020 జూన్ 10న హేమంత్ ఇంటి పెద్దల సమక్షంలోనే వారిద్దరూ వివాహం చేసుకున్నారు.ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్యోన్యంగా సాగుతున్న నవదంపతుల జీవితంలో పరువు హత్య ఎవరు తీర్చలేని శోకాన్ని మిగిల్చింది. ఇది కేవలం కులానికి ముడి పెట్టలేమని,తాము కూడా ఉన్నత కులానికి చెందిన వైశ్యులం అని, తాము ఆర్థికంగా కొంత వెనుకబడి ఉండటం కూడా ఒక కారణంగా హేమంత్ తల్లిదండ్రులు వాపోతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.

పరువు హత్యోదంతాలు ఎన్నో..
………..

ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగిన ఉదంతం కాదు. పరువు హత్యల పరంపరలో ఇది ఒక ఉదాహరణ గా మారింది.సరిగ్గా రెండేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ లోనే సూర్యాపేటకు చెందిన ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అది పరువు హత్యే…. వైశ్య వర్గానికి చెందిన మారుతీ రావు తన కుమార్తె ను ప్రేమించి పెళ్లాడాడన్న నెపంతో…. దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌ను హంతక ముఠాకు కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ పట్టపగలే చంపించాడు .కుల అహంకారమే ఈ హత్యకు దారితీసింది అని పోలీసులు తేల్చారు.

కూతురు సుఖం కోసం అన్నట్లుగా ఏ హత్య చేయించాడో, ఆ కూతురు అమృత ,తండ్రినీ కుటుంబాన్ని ఛీ కొట్టింది. తన భర్తను కోల్పోయిన బాధను భరిస్తూనే అత్తింటి వారికి అండగా నిలిచింది. తండ్రి పైనే పోరాటం సాగించింది. ఈ ఉదంతంలో అమృత తండ్రి మారుతీరావు ఏమి సాధించాడు. పరువు ప్రతిష్ట మరింతగా దిగజారి జైలు జీవితం అనుభవించి, కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. పరువు పోతుందని కుమార్తె జీవితాన్ని నాశనం చేసి తమ జీవితాన్ని సర్వం పోగొట్టుకున్న మారుతీరావు ఏమి సాధించినట్లు ,పరువు నిలిచిందా …మరింత దిగజారిందా?

పరువును మించిపోతున్న కక్ష..
…………

తాజాగా హైదరాబాద్ పరువు హత్య ఉదంతం లోనూ పరువు పోయిందన్న ఆక్రోశం కసిగా మారి సొంత కుమార్తె జీవితాన్ని మంటగలిపే స్థాయికి దిగజారింది.మరి ఇప్పుడు దొంతి రెడ్డి లక్ష్మారెడ్డి కుటుంబం పరువు మరింత బజారున పడిందా… లేక వారి పరువు దక్కిందా ,…కుటుంబ సభ్యులంతా జైలు కి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది .మరి ఎవరి మీద కక్ష సాధించినట్లు ? సొంత కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేసి తాము సమస్యలలో చిక్కుకొని ఏమి సాధించినట్లు ?

కులాంతర మతాంతర వివాహాలు ఇప్పుడు సహజమై పోయాయి .ఆర్థిక స్తోమత కులాల మధ్య అంతరాన్ని చెరిపేస్తోంది. అయినా ఇవన్నీ ఒకటి రెండు సంఘటనలు కాదు. దేశవ్యాప్తంగా అటు ఉత్తరాది తో పాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలలోనూ ఏడాదికి పదుల సంఖ్యలో ఇలాంటి దారుణాలు పరువు హత్యల రూపంలో జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.2018లో ప్రణయ్ హత్యే కాదు …అంతకు ముందు 2016లో తమిళనాడులో జరిగిన శంకర్ పరువు హత్య ఉదంతం లోనూ ఇదే జరిగింది. తమిళనాట అగ్ర కులంగా భావించే తేవర్ వర్గానికి చెందిన కౌసల్య తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శంకర్ ను హతమార్చిన తమ కుటుంబం తో పాటు ఉన్నత వర్గాల దురాగతాల పై పోరు సాగిస్తూనే ఉంది. మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతం తర్వాత కూడా మంచిర్యాల జన్నారం మండలం లోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్న వారి చేతుల్లోనే అనురాధ అనే యువతి అసువులు బాసింది.

చైతన్యం రావాలి..
……………..

పరువు ప్రతిష్టల కోసం కన్న బిడ్డలనే చిదిమేసే తల్లిదండ్రులు ….అల్లుళ్లను హతమార్చే అత్తమామలు ఆ తరువాత ఏమి సాధిస్తున్నారు? జైలుకెళ్లి శిక్ష అనుభవించి తమ జీవితాన్నే కోల్పోతున్నారు. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.అదే సమయంలో దోషులకు కఠిన శిక్షలు పడి మరొకరు ఇలాంటి నేరం చేయాలంటే భయపడాల్సిన రీతిలో చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది.పోలీసులు కూడా కేసు దర్యాప్తు పేరిట కాలయాపన చేయకుండా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలి. దోషులకు శిక్ష పడే రీతిలో తగిన సాక్ష్యాధారాలను త్వరితగతిన కోర్టులకు అందజేయాలి. పట్టపగలు హత్య చేస్తే తాము హీరోలం అయిపోతామనే నేరగాళ్ల దుస్సాహసానికి పోలీసులు చెక్ పెట్టాలి. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రజలలో అవగాహన పెరగటం కూడా ఎంతో ముఖ్యం . అదే రీతిలో ప్రేమ పేరుతో పిల్లలు కూడా నిండు జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేయాలి. తమ పిల్లలను ముందుగానే దారిలో పెట్టుకొని భవిష్యత్తు నిర్దేశం చేయకుండా ఆవేశంతో పరువుకోసం తల్లిదండ్రులు పరువు హత్యలకు పాల్పడితే, పరువు నిలుపుకోవటం అటుంచితే ఉన్న పరువు కాస్తా బజారుపాలు అవుతుందనడంలో సందేహం లేదు.ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ….నిండు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు…..

— వెలది. కృష్ణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ( 98497 25984)