రాం మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్ రావు‌ల‌ను అందుకే త‌ప్పించారా!

న్యూఢిల్లీ: భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌ద్దా ప్ర‌క‌టించిన కొత్త జాతీయ కార్య‌వ‌ర్గంలో రాం మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్ రావుల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. వారిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వుల నుంచి త‌ప్పించారా లేక మ‌రేదైనా బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జాబితాలో చోటివ్వ‌లేదా అని అంతా చ‌ర్చించుకుంటున్నారు. పార్టీని ప‌టిష్టం చేయ‌డంలో రాం మాధ‌వ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈశాన్య‌రాష్ట్రాలు, జ‌మ్ముక‌శ్మీర్ ఇలా అనేక చోట్ల రాం మాధ‌వ్ ఇప్ప‌టికే త‌న స‌త్తాను నిరూపించుకున్నారు. అనేక చోట్ల పార్టీని బ‌లోపేతం చేసేందుకు రాం మాధ‌వ్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో దంచికొట్టే రాం మాధ‌వ్ జాతీయ‌, అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌పై అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించ‌గ‌ల‌రు. మీడియా సంభాష‌ణ‌ల‌తో పాటు బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగించ‌గ‌ల‌రు. అన్నింటినీ మించి సంఘ్ ప్ర‌చారక్ కావ‌డం వ‌ల్ల ఆయ‌న పార్టీని కింది స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డంలో దిట్ట‌. అందుకే ఆయ‌న్ను ఇంత‌కాలం పార్టీకి వాడుకున్నారు. పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావ‌డంలో రాం మాధ‌వ్ పాత్ర కాద‌న‌లేనిది. సంస్క‌ర‌ణ‌ల ఉధృతి కొన‌సాగించాలంటే బీజేపీ మ‌రోమారు అధికారంలోకి రావ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ త‌రుణంలో పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ త‌దిత‌ర రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత ప‌టిష్టం చేసే బాధ్య‌త రాం మాధ‌వ్‌కు అప్ప‌గించే అవ‌కాశాలున్నాయి. పార్టీ పార్లమెంట‌రీ బోర్డులో చోటివ్వ‌డం ద్వారా పార్టీకే మ‌రికొంత‌కాలం రాం మాధ‌వ్ సేవ‌లు ఉప‌యోగించుకోవ‌చ్చని తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో ఇంత‌కాలం పార్టీకి సేవ‌లు చేసిన రాం మాధ‌వ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటివ్వాల‌ని కూడా అధినాయ‌క‌త్వం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన ప్ర‌తిసారీ రాం మాధ‌వ్ పేరు విన‌ప‌డుతూ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌కు ఈసారి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని కూడా ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక మ‌రో కీల‌క నేత ముర‌ళీధ‌ర్ రావు. తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడుపై కూడా ఆయ‌న దృష్టి సారించారు. త‌మిళ‌నాట పార్టీని బ‌లోపేతం చేసేందుకు శ్ర‌మిస్తున్నారు. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత కూడా తమిళనాట కేంద్రానికి స‌యోధ్య కుద‌ర్చ‌డంలో ముర‌ళీధ‌ర్ రావు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాబోయే రోజుల్లో త‌మిళ‌నాట బీజేపీ జెండా ఎగిరేలా చూసేందుకు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఇంత‌కాలం పార్టీకి సేవ‌లందించినందుకు గాను రాం మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్ రావుకు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని కేంద్ర నాయ‌కత్వం ‌నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. రాజ్య‌సభ స‌భ్య‌త్వం ఇచ్చి కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌ని తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్‌లో ప్ర‌స్తుతం మ‌రో 15మందికి పైగా చోటు క‌ల్పించేందుకు వీలుంది. అయితే మోదీ వీటిని ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఖాళీగా ఉంచారు. మిన‌మ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్ మ్యాగ్జిమ‌మ్ గ‌వ‌ర్న‌న్స్ అనే కోణంలో ప్ర‌ధాని అడుగులు వేస్తున్నారు. కేంద్ర కేబినెట్‌ను పూర్తి స్థాయిలో విస్త‌రిస్తే మ‌రికొంద‌రు బీజేపీ నేత‌ల‌కు చోటు ద‌క్క‌వ‌చ్చు. దీనిపై మ‌రికొద్ది రోజుల్లో స్ప‌ష్టత రానుంది.

మ‌రోవైపు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌ద్దా త‌న కొత్త టీమ్‌ను ప్ర‌క‌టించారు. నూత‌న జాతీయ కార్య‌వ‌ర్గంలో జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా డీకే అరుణ‌ను‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రిని నియ‌మించారు.

జాతీయ కార్య‌‌ద‌ర్శిగా స‌త్య‌కుమార్‌, ఓబీసీ జాతీయ మోర్చా అధ్య‌క్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌ను నియ‌మించారు.

జాతీయ యువ మోర్చా అధ్యక్షుడుగా తేజస్వి సూర్యను నియమించారు.

కొత్త టీమ్ మెంబ‌ర్ల‌కు ప్ర‌ధాని మోదీ, బీజేపీ నేత‌లు కంగ్రాట్స్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*