ఆర్ఎస్ఎస్ పై ఇమ్రాన్ గుస్సా…. పాక్ కు వణుకు ఎందుకు..?

అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు కోపం వచ్చింది అంతర్జాతీయ వేదికగా అరచి గోల చేశారు. ఎవరిమీద ఈ పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ కు ఆగ్రహం కలిగింది . తమ దేశంలో ఎవరిపైనో ఇమ్రాన్ సాబ్ గుస్సా చూపెడితే పోయేది ఏమీ లేదు. సొంత ఇంటిని చక్కబెడుతున్నారని, అన్ని దేశాలు భావిస్తాయి. మరి ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ అధినేత చేసిన పనేంటి..? సొంత ఇంటి గురించి ఏమీ చెప్పుకోలేక పొరిగింటిపై పడ్డారు. భారత్ లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) చెప్పు చేతల్లో నడుస్తోందంటూ విషం కక్కారు.జమ్మూ కాశ్మీర్ వివాదం, మైనార్టీల వ్యవహారం ప్రస్తావిస్తూనే వాటితో పాటుగా ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండా అంటూ టార్గెట్ చేశారు.

ఫాసిస్ట్ ,నిరంకుశ, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా దురాక్రమణకు పాల్పడితే మా దేశం ఎదురు తిరిగి స్వాతంత్రం కోసం తుదివరకు పోరాడుతూనే ఉంటుందని అర్థం పర్థం లేని రీతిలో ఇమ్రాన్ వ్యాఖ్యానించటం, దానికి యునైటెడ్ నేషన్స్ ను వేదికగా చేసుకోవటం అతగాడి దిగజారుడు తనాన్ని ప్రపంచానికి చాటింది. ఆర్ ఎస్ ఎస్ పైన ఘాటుగా మాట్లాడిన ఇమ్రాన్ , ఆర్ఎస్ఎస్ నాజీల నుంచి ప్రేరణ పొందిందన్నారు. నాజీలు యూదులను ద్వేషిస్తే, ఆర్ఎస్ఎస్ మద్దతు దారులు ముస్లింలను ,కొంతమేరకు క్రిస్టియన్లను ద్వేషిస్తున్నారని పోల్చారు. 2002 గుజరాత్ అల్లర్లను ఇమ్రాన్ ప్రస్తావించారు.

ఇదంతా విన్న అంతర్జాతీయ ప్రపంచానికి గురివింద గింజ గుర్తుకు రాకమానదు .స్వదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ముస్లింలలోని రెండు తెగలు షియా,సున్నీలలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ , వందలాది మంది అమాయక ముస్లిముల మరణానికి కారణమవుతున్న ఆ దేశం పాలకులు అంతర్జాతీయ వేదికల పైనా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి…..ఐక్యరాజ్యసమితి వేదిక అనగానే కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతిసారి అభాసుపాలు కావటం కూడా పాక్ పాలకులకు కొత్తేమీ కాదు.

తాజాగా ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ వంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే ,ఆర్ఎస్ఎస్ మాటున ప్రధాని మోడీ సర్కార్ పైనా విమర్శలు గురిపెట్టటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.పాకిస్థాన్ పాలకులు తమ దేశం అభివృద్ధి పై ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు .దేశంలో ప్రజలు ఉగ్రవాదం, మత ఘర్షణలు వంటి వాటికి బాధితులుగా మారుతున్నా, వీలు దొరికినప్పుడల్లా భారత్ పై విమర్శలు చేస్తూ , పాక్ ప్రజలలో భారత్ పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.పాకిస్తాన్లో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచదేశాలకు తెలియంది కాదు .అక్కడ ఉన్న హిందువులు ,సిక్కులు ఇతర మతాల వారికి లభిస్తున్న ప్రాధాన్యత ఏంటో ఎవరికీ చెప్పనక్కర్లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం అయినా ఆ మతంలోనే రెండు తెగల మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని ఇమ్రాన్ మర్చిపోతున్నారు .తమ దేశంలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్యను అమెరికా వంటి అగ్ర రాజ్యం ముందు చేతులు కట్టుకొని మరి ఒప్పుకున్న దాయాది దేశం అధినేత, ఇప్పుడు un వేదికగా ఇప్పుడు గురివింద కబుర్లు ఎందుకు చెబుతున్నారు. ఈ ప్రశ్నకు జవాబు ఇమ్రాన్ ఖాన్ చెబుతారా..?

ఐక్యరాజ్యసమితి వేదికగానే భారత్ కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శలను సమర్ధంగా చెప్పి కొట్టింది. ముందు సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాలి అంటూ హెచ్చరికలు చేసింది .భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రజాస్వామ్య బద్ధంగా భారీ మెజార్టీతో విజయం సాధించిన సర్కార్. అలాంటి నరేంద్రమోడీ సర్కారును ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అంటూ ఒక పొరుగు దేశం అధినేత ఎలా మాట్లాడగలిగారు?అంతర్జాతీయ సమాజం ఛీ కొడుతుందన్న ఇంకితజ్ఞానం కూడా పాక్ అధ్యక్షుడికి లేకపోవడం దురదృష్టకరం.

అయినా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకలాపాలు ఎప్పుడు మైనార్టీలకు వ్యతిరేకం కాదని ఆ సంస్థ పెద్దలు పలు సందర్భాలలో తేల్చి చెప్పారు. జాతీయతా భావాన్ని పెంపొందిస్తూ కార్యక్రమాలు నిర్వహించండం ఏ మాత్రం తప్పు కాదు. యావత్ భారతదేశం ఒకటేనన్న జాతీయతా భావ జాలం తప్పెలా అవుతుంది?.. మహాత్మా గాంధీ హత్య నేపథ్యంలో ఎదురైన సంకట పరిస్థితి, అటు తరువాత చోటు చేసుకున్న కొన్ని ఉదంతాల సమయంలోనూ నిర్భయంగా నిక్కచ్చిగా తప్పు చేయని సంస్థగానే బయట పడింది. అయితే దేశంలో ఉంటూ పొరుగు దేశంతో కలిసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి పట్ల మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది.

ఇప్పుడు బిజెపి అధికారంలో ఉంది కనుక పాకిస్థాన్ తో వైరం పెరిగింది ఉన్నట్లుగా ఇమ్రాన్ చెప్పటం మాత్రం క్షంతవ్యం కాదు.స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తే వాజపేయి ప్రధానిగా ఉన్న ఆ సమయంలోనే పాకిస్తాన్ తో చర్చలలో ముందడుగు పడింది. వాజ్ పేయి ఆరెస్సెస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పాకిస్థాన్ తో యుద్ధానికి కాలుదువ్వారా… రెండు దేశాల మధ్య శాంతి కోసం పరితపించారా… లాహోర్ బస్సుయాత్ర వంటివి మర్చిపోలేని మైలురాళ్ళు. ఆ తరువాత పాక్ అధ్యక్షుడిగా జనరల్ ముషార్రఫ్ ఉన్న సమయంలో జరిగిన ఆగ్రా చర్చలు పాక్ మొండి వైఖరితో విఫలమైనా, అలాంటి సైనిక పాలకుడు కూడా వాజ్ పేయి చొరువను మెచ్చుకున్నారు. వాజ్ పేయి,అద్వానీ లు ఇద్దరూ ఆరెస్సెస్ భావజాలం నుంచి వచ్చినవారు కాదా …?
తొలుత ఆగ్రా చర్చలు విఫలం కావడానికి అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న ఎల్ కే అద్వానీ కఠిన వైఖరి కారణం అని పాకిస్థాన్ పాలకులు చెప్పుకున్నా, ఆ తరువాత అద్వానీ పాక్ పర్యటనలో …ఆర్ఎస్ఎస్ పై తమకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నామని పలువురు పాకిస్తాన్ మత పెద్దలు, రాజకీయ నాయకులు బాహాటంగానే ఒప్పుకున్న అంశాన్ని అద్వాని యే తన జీవిత చరిత్ర నాదేశం – నాజీవితం పుస్తకం లో వివరించారు కూడా…..

ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాను ప్రధాని అయిన తొలి పరిచయంలోనే ఆకస్మికంగా లాహోర్ పర్యటన చేసి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.కాశ్మీర్ విషయంలో రాజీలేని ధోరణి, పివోకే లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ,పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పే ధైర్యం ప్రదర్శించినందుకే.. మోడీ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ విషం కక్కుతున్నారా…

కుక్క తోక వంకర అన్న రీతిలో ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రసంగం సాగితే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అదే వేదిక నుంచి ఐక్యరాజ్యసమితి సంస్కరణలు రావాలన్న నిజాన్ని ధైర్యంగా చెప్పగలిగారు. భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వరన్న రీతిలో ప్రపంచ దేశాలను నిలదీసే స్థాయికి భారత్ ఎదిగింది. ప్రపంచ దేశాలలో కరోనా వంటి క్లిష్ట సమయంలో భారత్ పాత్ర ఎంత గొప్పదో ప్రధాని మోడీ యూఎన్ వేదికగానే తెలియ చెప్పారు.

ఏదేమైనా పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నుంచి ఏదో గొప్పగా ఆశించడం కూడా పొరపాటే. అధ్యక్ష ఎన్నికల సమయంలోనే భారత్ పై విమర్శలనే తన అస్త్రాలుగా చేసుకొని పార్టీని గెలిపించుకుని గద్దెనెక్కిన ఇమ్రాన్ విమర్శించినంత మాత్రాన భారత్ ప్రతిష్ట ఎంతమాత్రం తగ్గదు… సరికదా మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

— వెలది. కృష్ణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ( 98497 25984)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*