జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే లక్ష్యం- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్


– హెల్త్ కార్డులు, అర్హులందరికి అక్రిడేషన్లు అందించాం
– కోవిడ్ సమయంలో 1200 మందికి రూ.2.50 కోట్ల ఆర్థిక సహాయం
-మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ కృషి అమోఘం
– జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడే ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే
– *ఐజేయూ జిల్లా అధ్యక్షులు రమేష్ సహా పలువురు టీయూడబ్ల్యూజేలో చేరిక*
– *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్*

భూపాలపల్లి: జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జల్ది రమేష్, ఆ సంఘం నాయకులు చెరుకు సుధాకర్, రాచర్ల సుధాకర్ తో పాటు పలువురు మారుతీసాగర్ సమక్షంలో టీయూడబ్ల్యూజేలో చేరారు. ఈ సందర్భంగా మారుతీ సాగర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని టీజేఎఫ్ గా మహా ఉద్యమాన్ని నడిపిన చరిత్ర టీయూడబ్ల్యూజేకే ఉందన్నారు. సాధించుకున్న తెలంగాణాలో జర్నలిస్టుల సంక్షేమం ఒక్క అల్లం నారాయణతోనే సాధ్యమని విశ్వసించి సీఎం కేసీఆర్ అల్లం నారాయణను మీడియా అకాడమీ ఛైర్మన్ గా నియమించారని పేర్కొన్నారు. అటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా, అటు మీడియా అకాడమి ఛైర్మన్ గా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం అల్లం నారాయణ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల నిధుల కోసం కృషిచేయటమే కాకుండా అందులో రూ. 30 కోట్ల నిధులను రాబట్టిన ఘనత అల్లం నారాయణదే అన్నారు. మీడియా అకాడమీ ద్వారా రాష్ట్రంలోని అన్ని పాత జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల శిక్షణ తరగతులు నిర్వహించి వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషిచేయటం జరిగిందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడియేషన్లు ఇప్పించటంతోపాటు ఒక్క పైసా ఖర్చులేకుండా జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు అందించిన ఘనత టీయూడబ్ల్యూజేదే అన్నారు. మీడియా అకాడమీ ద్వారా మృతిచెందిన జర్నలిస్టులకు రూ. లక్ష, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు రూ. 50 వేల ఆర్థిక సహాయం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అల్లం నారాయణ నేతృత్వంలో చేయటం జరుగుతుందన్నారు. కరోన సమయంలో జర్నలిస్టులను ఆర్థికంగా భరోసా కల్పించేందుకు అల్లం నారాయణ దృష్టి సారించారని, అందులో బాగంగానే కరోన భారినపడిన ప్రతీ జర్నలిస్టులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1200 మంది కరోన సోకిన జర్నలిస్టులకు రూ. 2.50 కోట్ల ఆర్థిక సహాయం అందించటం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలన్ని అల్లం నారాయణ నేతృత్వంలో పరిష్కారం అవుతున్నాయని, ఇళ్ళ స్థలాల కేటాయింపు మాత్రం సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున నిలిచిపోయిందన్నారు. త్వరలో హైదరబాద్ జర్నలిస్టులతోపాటు తెలంగాణాలోని ప్రతీ జర్నలిస్టుకు నివేశన స్థలాలు ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని మారుతీ సాగర్ పేర్కొన్నారు.

భూపాలపల్లి జర్నలిస్టులకు గతంలో నివేశన స్థలాలు ఇచ్చారని, తమకు డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం సహకరించాలని జర్నలిస్టులు కోరగా స్పందించిన మారుతీ సాగర్ ఎంత మంది జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు కేటాయించారో తమకు తెలియజేస్తే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇప్పించేందుకు యూనియన్ తరపున కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాకు తొలిసారిగా వచ్చిన మారుతీ సాగర్కు పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు తడక రాజ్ నారాయణ గౌడ్, జిల్లా నాయకులు కక్కెర్ల జగన్, సర్వేశ్వర్రావు, వంశీక్రిష్ణ, అడ్డగట్ల శ్రీధర్, ఎడ్ల సంతోష్, అంబాల సంపత్, ఎర్రం సతీష్, భూమిరెడ్డి, తిక్క ప్రవీణ్, దొమ్మాటి రవి, సత్తెన్న, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*