వ్యవసాయం చేస్తున్న బాతులు- కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ అధ్యయనం

దిబ్రూగఢ్: బాతులు వ్యవసాయం చేస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. ఈ దృశ్యం అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆవిష్కృతమైంది. నాటు వేసిన తర్వాత కలుపు తీసేందుకు రైతులు తాము పెంచుకుంటున్న బాతులను పొలాల్లోకి వదులుతారు. అవి పొలంలోకి వెళ్లి తమ కాళ్లతో భూమిలోని కలుపు తీస్తాయి. ఆ తర్వాత కలుపును తినేస్తాయి. ఈ రకంగా బాతులు రైతు నేస్తాలుగా ఉంటున్నాయి. అస్సాం రైతుల వ్యవసాయ పద్ధతులు కూడా అధర్వణ వేదంలో చెప్పిన తీరులోనే ఉండటం విశేషం.

దేశంలో ఎక్కువగా వరి పండించే రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో రైతులు ఏడాదికి ఒకసారి మాత్రమే పంటలు పండిస్తారు. ఏప్రిల్‌లో వరిపంట నార్లు వేస్తారు. అక్టోబర్, నవంబర్‌లో పంట కోస్తారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మేకలకు, కోళ్లకు, బాతులకు గుడిసెలు ప్రత్యేకంగా నిర్మించారు.

అస్సాం రైతులు ఆవులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆవులను పూజించే సంసృతి నేటికీ కొనసాగిస్తున్నారు. మహర్షులు చెప్పిన పద్ధతులు పాటిస్తున్నారు. భూమిపూజ చేస్తారు. విత్తనాన్ని పూజిస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న వరి విత్తనాలు మాత్రమే వాడుతున్నారు. ధాన్యభాండాగారాన్ని నిర్మించుకుని తమ విత్తనాలను కాపాడుకుంటున్నారు. కృష్ణ బియ్యం( బ్లాక్ రైస్ ), రెడ్ రైస్, బ్రౌన్ రైస్ పండిస్తున్నారు. పంటలకు పురుగులు పట్టకుండా పొలం వెంబడి తులసి మొక్కలు పెంచుతారు. తులసి 7 అడుగుల నుంచి 9 అడుగుల వరకూ పెరుగుతోంది. తులసి నుంచి వచ్చే గాలి పురుగులు రాకుండా చేస్తుంది. అస్సాం రైతులు ప్రభుత్వం ఇచ్చే యూరియా, పురుగుల మందు తీసుకోరు. వరి ఆరు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

అస్సాం రైతులు కూరగాయలు బాగా పండిస్తారు. అరటికి ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడి రైతులు బయట నుంచి ఉప్పు మాత్రమే కొనుక్కుంటారు. వస్త్రాలు కూడా స్థానికంగానే తయారు చేసుకుంటారు. పెరట్లలో, ఖాళీ స్థలాల్లో మసాలాకు పనికొచ్చే మొక్కలు పండిస్తారు.

తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా, కాశింపేట గ్రామంలో వేదాలను అధ్యయనం చేసి కృష్ణ బియ్యం విజయవంతంగా పండిస్తున్ కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ అస్సాంలోని దిబ్రూగఢ్ వెళ్లారు.

భాగ్యనగరానికి 2737 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం దిబ్రూగఢ్‌లో వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు వెళ్లి అక్కడి రైతులతో ముచ్చటించారు.


స్థానికంగా ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న గొగోయ్‌తో మాట్లాడారు.


వ్యవసాయ పద్ధతుల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.

మూడు పూటలా అన్నమే తినే అస్సాం రైతులు కృష్ణ బియ్యం, రెడ్ రైస్, అరోమెటిక్ రైస్ ఎక్కువగా పండిస్తున్నారు. అస్సాం రైతులనుంచి భారత దేశంలోని మిగతా రైతు సోదరులు ఎన్నో విషయాలు, రహస్యాలు తెలుసుకోవాల్సి ఉంది.

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో
ఉపయోగించేవారు.

ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి వివరించారు.
‘ఆయుర్వేద మమోదధి’లో అనేక వరి రకాలను వర్గీకరించి, వివరించారు.‘చరక సంహిత’లో కూడా వేర్వేరు పంట రకాల గురించి వర్గీకరించి, వివరించారు. వాటికిగల ఔషధ లక్షణాలను కూడా వివరించారు. వీటిలో ఒకటి కృష్ణ వ్రీహి లేదా కృష్ణ శాలి లేదా బ్లాక్ రైస్. ఈ బియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారని తెలుస్తోంది.

రచన:

-కౌటిల్య కృష్ణన్, కృషి భారతం వ్యవస్థాపకుడు (ఎం.ఏ. యజుర్వేదం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్) (8686743452)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*