హైద‌రాబాద్ వ‌రద బాధితుల స‌హాయార్ధం 1 కోటి 50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన రెబల్ స్టార్ ప్ర‌భాస్

హైదరాబాద్ ను ముంచెత్తిన అకాల వ‌ర్షాలు చాలామందిని నిరాశ్రయుల‌ను చేసింది. ఈ వరదల విపత్తుతోపాటు కరోనా కారణంగా అందరి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉండే ప్రతిసారి స్పందించే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఈసారి కూడా స్పందించింది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం అందిచారు. అలానే బాధితుల‌కి త‌మ‌కు చేత‌నైన రీతిలో స‌హాయం చేయాల్సిందిగా త‌న అభిమానుల‌కి పిలుపునిచ్చారు ప్ర‌భాస్.

గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్తుల్లో చిక్కుకున్న బాధితుల‌కి త‌న వంతు సహాయం అందించ‌డంలో ముంద‌డుగు వేశారు ప్ర‌భాస్. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకు ప్ర‌భాస్ 4 కోట్లు విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో భాగంగా ఇటలీలో ఉన్నారు.