మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు- డాక్టర్ గాదె మోహన్

ఎదుటి వారినుంచి సరియైన గౌరవం కోరుకునే ముందు మనల్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మనలో వున్న మంచి లక్షణాలను గుర్తు చేసుకుని ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. అందుకు కొన్ని పద్ధతులు ఆచరించినట్లైతే ఫలితం ఉండ వచ్చు.

 

పార్టీల్లో, ఫంక్షన్లలో, ఇతర ఏ సందర్భాలలో అయినా మీ చాయిస్ అడిగినపుడు స్పష్టంగా చెప్పగలగాలి. ఏదైనా పర్వాలేదని మూలకు ఒదిగిపోకూడదు. ఏ సందర్భాలలోనైనా, వెనుక సీట్లలో కూర్చోవడం, మనమే ఇతరులకు సీట్లు ఆఫర్ చేయడం చేయకూడదు. ఇష్టం లేకున్నా అంగీకారం తెల్పకూడదు. అయిష్టాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ముందుగా మనకు నచ్చని చిన్న విషయాల్లో ”నో ” అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. స్వీట్ వద్దని, పార్టీకి రానని ఇలాంటి విషయాలలో మొదలెడితే మంచిది.

”నో ” చెప్తున్నాం కదా! అని సంజాయిషి ఇచ్చుకోవాలని భావించకూడదు. అన్ని సమయాల్లోనూ మనకు ఆ హక్కు ఉందని గుర్తుంచుకుంటే చాలు. కొంత మంది సరదాగా నవ్వుతు మాట్లాడుతూ వుంటారు. ఎదుటి వారిమీద జోకులు వేసి ఆనందపడిపోతుంటారు. మొదట్లో వీరి ప్రవర్తన మనకు నచ్చలేదని చెప్పితే మరోసారి ఆ ప్రయత్నం చెయ్యరు. ఈ విధంగా చెబితే నలుగురు ఏమనుకుంటారో అనే బాధ అనవసరం. ఆ బాధలన్నీ మాటాలన్న వారికి అనుభవమవుతాయి. నలుగురిలో వెళ్ళేటపుడు మనం ధైర్యంగా ధీమాగా ఉండాలి.

 

మన తప్పులేని విషయాలలో సైతం నెత్తినవేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నిచే వద్దు. విమర్శలకు గురైనపుడు అందులో ఎంత నిజం ఉందో ప్రశ్నించాలి. ఊరికే తలాడించకూడదు. ఆ విమర్శ వెనుక ఉద్దేశం ఏమిటో గ్రహించాలి.

విమర్శలకు అతిగా స్పందించడము మంచిది కాదు. మనం ఈమధ్య లావయ్యామనే, ఎక్కువ మాట్లాడుతున్నామనో ఎదుటి వారంటే ఎందుకు బాధపడాలి? నిజాన్ని అంగీకరిస్తూనే సమర్ధంగా తిప్పి కొట్టే నేర్పు అలవర్చుకుంటే చాలు. ఏదో ఒక విషయంలో విమర్శకు గురైనంత మాత్రాన మనమంటే అవతలి వారికి ఏమాత్రం ఇష్టం లేదని భాదపడిపోకూడదు. వారన్న విషయం వరకు మాత్రమే తార్కికంగా అలోచించి వివేచనతో మెలగాలి. ఎదుటి వారిని ఎదుర్కోబోయే ముందు మీకు మీరు కొంత ఉత్సాహాన్ని ధైర్యాన్ని సమకూర్చు కోవాలి. ఎందుకు మన మనసుకు ఆనందం కలిగించే పని ఏదైనా తోడ్పడుతుంది.

 

-డాక్టర్ గాదె మోహన్, MA, MSc,LLB,PhD, వరంగల్. (98493 52701)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*