ముగిసిన ప్రచారం.. దుబ్బాక పోరులో దుమ్ములేపేది ఎవరు?

దుబ్బాక ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. దుబ్బాక దంగల్ లో గెలుపెవరి అన్నది అందరి ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న..ఈ ఉప ఎన్నిక స్థానాన్ని తాము సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని విజయం అవలీలగా తమకే లభిస్తుందని టిఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. వికసించేది తామే అంటూ కమలనాథులు కలలు కంటున్నారు. కాలం కలిసి వస్తే దుబ్బాక హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది.అయితే అన్ని పార్టీలు ప్రధానంగా ఏదో ఒక సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటే ,కేంద్ర నిధులు, రాష్ట్ర పథకాలు ప్రచారం లో హైలెట్ గా మారాయి. సిద్దిపేట డబ్బు అంశం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. అసలు దుబ్బాక పోరులో దుమ్ములేపేది ఎవరు

 

 

తెలంగాణలో ఉప ఎన్నిక జరిగే దుబ్బాక అసెంబ్లీ స్థానం ఇప్పుడో హాట్ టాపిక్. ఆ స్థానంలో విజయం సాధించ బోతున్నది ఎవరు అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన ఈ స్థానంలో తిరిగి తమదే గెలుపన్న ధీమాతో అధికార గులాబీ దళం ముందడుగు వేస్తోంది.నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న ఈ స్థానంలో పదవ తేదీ ఫలితాలు రానున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచార పర్వం లో చివరి ఘట్టం అత్యంత ఆసక్తిగా మారింది. ఉప ఎన్నిక పోరును ఆసక్తి గా మార్చింది.అధికార టీఆర్ఎస్ పార్టీ రామ లింగారెడ్డి సతీమణి సుజాతకే టిక్కెట్ కేటాయించి సానుభూతి పవనాలను జోడించగా, అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరి టికెట్ దక్కించుకున్నాడు.అయితే శ్రీనివాసరెడ్డి దివంగత నేత ముత్యం రెడ్డి కుమారుడు కావడంతో ఆయనా సానుభూతి వల విసురుతున్నారు. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే ఆ స్థానం నుంచే రెండుసార్లు పోటీ చేసిన రఘునందనరావు ఈ మారు కూడా టికెట్ సాధించి మూడో సారైనా దుబ్బాక ప్రజల ఆశీర్వాదం దక్కక పోతుందా అనే ఆశతో ఉన్నారు.దుబ్బాక బరిలో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నా అసలు దుబ్బాక బరిలో జరుగుతున్నది త్రిముఖపోటీనా లేక ద్విముఖ పోటీనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత అంతా తానే భుజాలపైకి ఎత్తుకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అంతా తానై వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ను అంటిపెట్టుకుని, పార్టీ అభ్యర్థిని వెంటబెట్టుకుని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.హరీష్ రావే టిఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారా అన్న అనుమానం కూడా కలిగే రీతిలో అక్కడినుంచి కదలటం లేదు. సిద్దిపేట కు పక్కనే ఉన్న దుబ్బాక స్థానంలో పార్టీ గెలుపు తన గెలుపు అన్న రీతిలో మొత్తం ప్రచార బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు విపక్షాలకు హరీష్ రావే ఈ స్థానంలో టార్గెట్ గా మారారు.

 

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి గెలుపు కోసం పీసీసీ చీఫ్ ఉత్తం,వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ తో సహా మిగిలిన లీడర్లు ప్రచారం కొనసాగిస్తున్నారు.అయితే అక్కడి పరిస్థితి మాత్రం అధికార గులాబీ దళం కమలదళం మధ్య ప్రధాన పోటీ జరుగుతోందన్న భావాన్నే కలిగిస్తోంది. వీరిద్దరి పోరులో కామ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ హస్తం నేతలు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలు దుబ్బాక దంగల్ అందరినీ ఎందుకు ఆకర్షిస్తోంది అంటే ఈ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు రిఫరెండం గా విపక్షాలు భావించడమే….. దుబ్బాక లో అధికార పార్టీని ఓడిస్తే ఇక తెలంగాణలో కాషాయ జెండా ఎగరటం సులభమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.అంతేకాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నిక కావడంతో దీనిని సంజయ్ కూడా గట్టిగానే తీసుకున్నారు. అధికార టీఆర్ఎస్ కు సవాలు విసురుతున్నారు.దుబ్బాక సమరం టిఆర్ఎస్ నేత రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు …రాష్ట్ర కమలదళం అధినేత బండి సంజయ్ కు మధ్య పోరుగా మారిపోయింది.

 

సిద్దిపేట ఎపిసోడ్ ఎవరికి ప్లస్… ఎవరికి మైనస్.

 

అసలు సిద్దిపేట డబ్బు ఎపిసోడ్ ఏంటి.. సిద్దిపేట డబ్బు ఎపిసోడ్ మొత్తం దుబ్బాక ఎన్నికల ప్రచార సరళినే మార్చిందా…. పోలీసుల తనిఖీలు టిఆర్ఎస్ కు కలసి వచ్చిందా… కమలనాథులకు సింపథీ గెయిన్ చేయడానికి అవకాశం కల్పించిందా…. ప్రచార చివరి అంకంలో చోటుచేసుకున్న సిద్దిపేట పరిణామాలు పోలింగ్ పర్యవేక్షణకు పోలీస్ ప్రత్యేక అధికారి నియామకం జరిగేదాకా రావడం అందర్నీ ఆకర్షించింది. దానితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పథకాలు నిధుల కేటాయింపు సవాళ్లకు దారితీసింది.

 

దుబ్బాక ఉపఎన్నిక సమరం బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లకు తెరలేపింది.కేంద్ర, రాష్ట్ర పథకాలు నిధులపై ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్లు విసురుతున్నారు.కేంద్ర నిధులతోనే రాష్ట్ర పథకాలు సాగుతున్నాయని బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకెళ్ళుతుండటం టిఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు.కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం అంటూ మంత్రి హరీష్ రావు చాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు పదేపదే చెప్పాల్సి వస్తోంది. అయితే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దుబ్బాక నియోజకవర్గానికే కేంద్రం నుంచి 250 కోట్ల సాయం అందింది అంటూ పెద్ద జాబితాను విడుదల చేశారు.అవన్నీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులేనని , ప్రత్యేకంగా వచ్చింది కాదని అధికారపక్షం వాదిస్తోంది.మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే పథకాలు కూడా కేవలం దుబ్బాక ప్రజల కోసమే కాదని రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలేనని, దానిలో కేంద్ర భాగస్వామ్యం కూడా ఉందని కమలనాథులు కూడా తెగేసి చెబుతున్నారు. ఎందుకు ప్రత్యేకంగా టిఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారని బీజేపీ నిలదీస్తోంది.

 

ఇదంతా ఇలా ఉంటే సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి.ఒక ఇంట్లో 18 లక్షలు దొరికాయని పోలీసులు ప్రకటించడం ఆ సమయంలోనే రఘునందన్ రావు బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ ఇంటితో తనకు సంబంధం లేదని రఘునందన్రావు తెలపడం, పోలీసులే డబ్బు తెచ్చిపెట్టారంటూ, బీజేపీ కార్యకర్తలు ఆ సొమ్మును లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించటం చర్చకు దారితీసింది. అసలు దుబ్బాక కు సంబంధం లేని సిద్దిపేటలో పోలీసులు తనిఖీలు ఎందుకు జరిపారు… ఎవరైనా ఫిర్యాదు చేశారా అన్నదీ డైలమా గానే మిగిలింది. పోలీసులు రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారని ఉద్రిక్తత చోటుచేసుకుందని తెలుసుకొని సిద్దిపేట వచ్చేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ ను పట్టణంలోకి రాకుండా సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఆయనను అదుపులోకి తీసుకోవడం రచ్చకు దారి తీసింది. సంజయ్ ను జీపు లోకి ఎక్కించే క్రమంలో జరిగిన పరిణామాలు మరింత రభసకు కారణమయ్యాయి. జీపులో ఎక్కించేందుకు తనను బలవంతంగా నెట్టారని ,ఒక ఎంపీని, ఒక పార్టీ అధ్యక్షుడినన్న స్పృహ కూడా పోలీసు కమిషనర్ కు లేకుండాపోయిందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని , సిపి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఆరోగ్యం క్షీణించడంతో సంజయ్ ని బలవంతంగా ఆసుపత్రికి తరలించి దీక్షను విరమింపజేశారు. అయితే బండి సంజయ్ అరెస్టు దీక్ష నేపథ్యంలో బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగడం రాజకీయ వాతావరణంలో మరింత హీట్ పుట్టించాయి .ఈ పరిణామాలు దుబ్బాక రేసులో ఏమి జరుగుతోందన్న ఉత్కంఠను మరింత పెంచాయి.

 

మరోవేపు దుబ్బాక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అదే సమయంలో దుబ్బాక పోలింగ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు అధికారి సరోజ్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు నుంచి నియమించింది. దానిని బీజేపీ విజయంగా భావిస్తోంది.ఈ పరిణామాలు బీజేపీకి ప్లస్ పాయింట్ గా కొందరు అభివర్ణిస్తుంటే,ఎంత మైలేజ్ వస్తుంది అన్న అనుమానాలు మరికొందరు వ్యక్తపరుస్తున్నారు.ఏదైనా దుబ్బాక పోరులో అధికారపక్షం విజయం ఏకపక్షం అన్న వాదనకు ,ధీమాకు ఈ పరిణామాలు కొంత అడ్డంకిగా మారాయి. దుబ్బాక లో గెలుపు అన్ని పార్టీలకు ఫిష్టేజీ ఇష్యూగా మాత్రం మారింది.తమ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకోవటానికి టిఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే దుబ్బాకలో టిఆర్ఎస్ ను ఓడించి దూకుడుకు కళ్లెం వేయాలని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ యోచిస్తున్నాయి. ఏదైనా దుబ్బాక ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ఒక సవాలుగా మారింది అనడంలో సందేహం లేదు .

 

-వెలది. కృష్ణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, సెల్ … 9849725984

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*