మనం మన మాతృభాష తెలుగును నిజంగా ప్రేమిస్తున్నామా?

హైదరాబాద్: ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అని ఘనంగా చెప్పుకుంటాం.. కానీ తెలుగు ‘లెస్’ ఎందుకవుతోంది?.. ఆలోచించారా?..

1961 జనాభా గణనలో మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాషగా తెలుగు 2వ స్థానంలో ఉండేది.. 1971లో బెంగాలీ 2వ స్థానంలోకి రాగా తెలుగు మూడో స్థానానికి వచ్చింది.. 2011 నాటికి తెలుగు 4వ స్థానానికి వచ్చింది. 1వ స్థానంలో హిందీ, 2వ స్థానంలో బెంగాలీ, 3వ స్థానంలో మరాఠీ, 4వ స్థానంలో తెలుగు నిలిచించి.. కేవలం 3 దశాబ్దాల్లో తెలుగువాళ్లం సాధించిన గొప్ప ఘనత ఇది.. ఈసారి జనాభా లెక్కల్లో కచ్చితంగా 5 స్థానానికి పడిపోయి ఉంటాం. అలా జరగకూడదనే నేను కోరుకుంటున్నాను.. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్’ అని గురజాడ అప్పారావు ఉత్తినే అనలేదేమో..

మన దేశంలో భాష పేరుతో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పోరాడింది తెలుగువారే.. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ర్టంగా 1953 అక్టోబర్ 1న ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పాటైంది. ఆ తర్వాత తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే వాదనతో 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసిపోయి ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రంగా ఏర్పడ్డాయి.. తెలుగు వారి ‘భాషా ప్రయుక్త రాష్ట్ర’ స్పూర్తితో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల పునర్విభజన జరగింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ‘తెలుగు’ను మన నాయకులు ఒక భావోద్వేగంగా మాత్రమే వాడుకున్నారు.. ‘తెలుగు’ భాష పేరుతో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం.. కానీ భాష అనేది ఏనాడూ ఇరు ప్రాంతాలను కలపలేకపోయింది. కాబట్టే 56 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాం. తమిళుల పెత్తనం భరించలేక నాటి తెలుగు నాయకులు ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే.. సీమాంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడింది..

సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే ఏనాడూ తెలుగుభాషకు సరైన గుర్తింపు దక్కలేదు.. అధికార భాషా సంఘం అనేది ఆరోవేలులా మారిపోయింది. మైనారిటీ సెంటిమెంటుతో అందులో ఉర్దూను కూడా చేర్చి నిర్వీర్యం చేశారు. పేరుకే తెలుగు అధికార భాష.. పెత్తనం మాత్రం ఇంగ్లీషుదే.. అడపాదడపా కొన్ని తెలుగు ఉత్వర్వుల తప్ప పాలన అంతా ఇంగ్లీషుభాషలోనే జరిగింది.. అప్పుడైనా, ఇప్పుడైనా అంతే.. తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాత్రమే మన భాషకు కొంత మేర వైభవం దక్కింది.. ఆ తర్వాత జరిగిందేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశ నాయకుల దృష్టిలో ‘ఆంధ్రులు ఆరంభ శూరులు’ అనే భావన ఉండేది.. ఇది ముమ్మాటికీ నిజం.. భాషాభిమానం కేవలం భావోద్వేగంగా మాత్రమే మిగలింది.. కానీ నిత్య జీవితంలో అది ఆచరణలో కనిపించదు.. ఇతర భాషా పదాలు లేకుంగా తెలుగులో కనీసం రెండు నిమిషాలైనా మాట్లాడగలమా? ఎవరైనా మాట్లాడగలం అనుకుంటే ఒకసారి స్వయంగా పరిశీలించి చూసుకోండి. మన జీవనోపాధి కోసం ఇంగ్లీషు కావాలనుకుంటున్నాం.. అది వ్యక్తిగతం అనుకొని రాజీ పడుతున్నాం.. కానీ కనీసం మన ఇళ్లలో అయినా స్పష్టమైన తెలుగు మాట్లాడుకుంటున్నామా? తెలుగులో తప్పులు లేకుండా రాయగలుగుతున్నామా? కనీసం తెలుగు పత్రికలను చదవడం కూడా బద్దకంగా మారిపోయింది.

మన పొరుగు రాష్ట్రాల భాషలను మాట్లాడేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా వారిలో చైతన్యం చాలా అధికంగా ఉంది. కాబట్టే వారు రాజకీయంగా కూడా చాలా బలంగా ఉన్నారు.. తమిళులు ప్రాచీన భాషా హోదా దక్కించుకున్నారని మనవాళ్లూ పోరాడి సాధించుకున్నారు.. కానీ తెలుగు భాషా పీఠ ఏర్పాటు కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో స్థలం చూపించలేదు.. దీంతో అది మైసూరు వెళ్లిపోయింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు భూములను ఉదారంగా పంచేస్తున్నాయి.. కానీ తెలుగు తల్లిని మాత్రం మరిచిపోయారు..

క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*