కృషిభార‌తం వృష‌భోత్స‌వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు

హైద‌రాబాద్: కృషిభార‌తం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న నిర్వ‌హించ‌నున్న‌ వృష‌భోత్స‌వానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలికారు. హైదరాబాద్‌లో తనను కలిసేందుకు వచ్చిన కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్‌ను ఆయన అభినందించారు. వృషభాల సంరక్షణకు నడుం కట్టిన కృషి భారతం సంస్థను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్యా కృష్ణవ్రీహీ(కృష్ణ బియ్యం)కి సంబంధించి ఆసక్తికర చర్చ జరిగింది. కృషి భారతం తరపున కౌటిల్య కృష్ణన్ కిషన్ రెడ్డికి మెమొంటోను అందించారు.

మరోవైపు వేద వ్యవసాయ పండుగల్లో అతి ముఖ్యమైన వృషభోత్సవానికి ఇప్పటికే చినజీయర్ స్వామి మ‌ద్ద‌తు ప‌లికారు. వృషభాల‌ను కాపాడుకోవ‌డం ద్వారా గో సంత‌తిని వృద్ధి చేయాల‌ని సూచించారు. ప‌రాశ‌ర మ‌హ‌ర్షి ప్రారంభించిన‌ వృష‌భోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. శంషాబాద్‌లోని చిన జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో వృష‌భోత్స‌వంలో భాగంగా వృష‌భాన్ని అలంక‌రించి పూజించ‌డంతో పాటు వృష‌భ‌యాత్ర కూడా నిర్వ‌హించ‌నున్నారు. శంషాబాద్‌ ఆశ్ర‌మంలో త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన కృషి భార‌తం వ్య‌వ‌స్థాప‌కుడు కౌటిల్య కృష్ణ‌న్‌తో పాటు ఆ సంస్థ ప్ర‌తినిధుల‌కు చిన్న జీయ‌ర్ స్వామి ఆశీస్సులు ప‌లికారు. వృష‌భోత్స‌వంతో గో సంత‌తికి పున‌ర్‌వైభ‌వం తీసుకొచ్చేందుకు య‌త్నిస్తున్న కౌటిల్య మిత్ర బృందాన్ని స్వామీజీ అభినందించారు.

మరోవైపు వృష‌భోత్స‌వానికి రామకృష్ణ మఠం కూడా సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద వృషభోత్సవం-2020 పోస్టర్‌ను విడుదల చేశారు. వేద వ్యవసాయ పద్ధతులన్నీ ప్రకృతిని కాపాడేవని, సేంద్రీయ వ్యవసాయం రైతాంగానికి మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద కౌటిల్య కృష్ణన్‌కు తమ ఆశీస్సులు అందించారు. దేశవాళీ విత్తనమైన కృష్ణ వ్రీహీని కాపాడుతూ రైతన్నల్లో అవగాహన కల్పిస్తోన్న కౌటిల్యను ఆయన అభినందించారు.

మరోవైపు కృషి భారతం ఆధ్వర్యంలో ఈ ఏడాది వృషభోత్సవాన్ని నవంబర్ 16న నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు కౌటిల్య కృష్ణన్ (8686743452, 7095778791) తెలిపారు. బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని చెప్పారు. తాము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిఏటా వృషభోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కౌటిల్య కృష్ణన్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*