కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులైన భారత జవాన్లు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో నలుగురు సైనికులు అమరులయ్యారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులున్నారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో వీరు వీరమరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మరో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అమరులైన జవాన్లలో ఒకరు నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌గా, మరొకరు చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి. 24 సంవత్సరాల కెప్టెన్ అశుతోష్ కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల ఏడున అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్‌ సెక్టార్‌ మీదుగా భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన జవాన్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వీరు అమరులయ్యారు.

26 సంవత్సరాల మహేశ్‌కు రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని కోమన్‌పల్లి గ్రామస్థులు తెలిపారు. మహేశ్ మరణంతో కోమన్‌పల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

37 సంవత్సరాల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి 18 సంవత్సరాల క్రితం మద్రాసు రెజిమెంట్‌, 18 మద్రాస్‌ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రవీణ్ హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్‌ తీసుకున్నారు. ప్రవీణ్ అమరుడయ్యారన్న వార్తను రెడ్డివారిపల్లె జీర్ణించుకోలేకపోతోంది.

జవాన్ల వీరమరణంపై జాతి ఘనంగా నివాళులర్పించింది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*