బీహార్ సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేది: నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీహార్ సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేది: నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రిగా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేదన్నారు. బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా ప్రమాణం చేయబోతున్నానని చెప్పారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాతో నితీశ్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలుసుకున్నారు. సోమవారం సాయంత్రం నాలుగున్నరకు మంత్రి వర్గ ప్రమాణం స్వీకారం ఉంటుంది.

 

అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాట్నా చేరుకున్నారు. బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్డీయే నేతలతో కూడా సమావేశమయ్యారు. ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో సీఎంగా నితీశే ఉండాలని నిర్ణయించారు. ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు.

 

బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 స్థానాలను సాధించాయి. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం ఎన్డీయే కూటమిగా ఏర్పడి బీహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికి 125 స్థానాలు లభించాయి.

 

ఎన్నికల ప్రచార సమయంలో నితీశే తమ సీఎం అభ్యర్ధి అని బీజేపీ అగ్రనేతలు ప్రకటించారు. జేడీయూకు అతి తక్కువగా 43 సీట్లే వచ్చినా బీజేపీ మాట తప్పలేదు. జేడీయూ కన్నా తమకు 31 సీట్లు అధికంగా వచ్చినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై నిలబడ్డారు. సీఎంగా ప్రమాణం చేయాలని నితీశ్‌ను కోరారు. ఓ వైపు సీట్లు తగ్గాయనే బాధ ఉన్నా కూటమి ద్వారా మరోసారి సీయం పదవి దక్కడంతో నితీశ్ ఆనందంగా ప్రమాణం చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*