ఘనంగా ‘గానకోకిల పాటకు పట్టాభిషేకం’ 

సింగపూర్ : డాక్టర్ పి సుశీల పాడిన తెలుగు సినీ గీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో ‘గానకోకిల పాటకు పట్టాభిషేకం’ అనే కార్యక్రమాన్ని సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఘనంగా నిర్వహించింది. ఈ నెల 21న నిర్వహించిన ఈ కార్యక్రమం.. అంతర్జాలంలో 10 గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది.

 

ప్రముఖ నటి డాక్టర్ జమున రమణారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. భారత్, సింగపూర్, అమెరికా దేశాల నుండి 12 మంది గాయనీమణులు పి సుశీల పాటలను ఆలపించి అలరించారు. సినీ రచయిత భువనచంద్ర, సినీ సంగీత దర్శకులు సాలూరి కోటి, మాధవపెద్ది సురేష్, స్వర వీణాపాణి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పి సుశీలతో వారి అనుబంధాన్ని గురించి తెలియజేస్తూ ప్రసంగించారు.

 

 

 

రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో జరిగిన ఈ అద్వితీయ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) తదితరులు పీ సుశీల పాడిన 100 పాటలను ఆలపించారు.

 

 

 

వంశీ ఇంటర్నేషనల్, సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్రావు ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించి సుశీలకు వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కాగా.. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది సినీ సంగీత ప్రేమికులు, సుశీల అభిమానులు.. ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి, పాటలను ఆస్వాదించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*