
హైదరాబాద్: వివర్ణ వృత్తానికి మనసు గీసిన అనుభవాల జడి కవిత్వం. వెండి మేఘాలు, వెన్నెల కవచాలు, కల్పద్రుమాలు, కన్నీటి ఉత్తరాలను భిన్న పార్శ్వాలుగా ఒడబోసే అచంచల జ్ఞానప్రవాహమది. వెలుగునీడల ప్రాపంచిక అవస్థల్లో కవిత్వమే కవికి అనిర్వచనీయ సహచర్యం, కొత్త దనాలను గుండెలో నాటుతూ ఓదార్పులను అద్దేపొద్దు పొడుపు. కాలం చేసిన గాయాలకు కవి పునరావాసి కాకుంటే భావాల కొవ్వొత్తులు కరిగి జ్ఞాపకాల కన్నీరు త్రుళ్లిపడదేమో… నిమీలిత నేత్రాల స్వచ్చతను తొడుక్కుని కవిత్వం రక్తప్రసరణలో తలెత్తి పరుగెత్తలేదేమో…!. వ్యక్తావ్యక్త ఘోషల్ని అనేకంగా తట్టుకుని నిలిచి ఆత్మానందంతో వికసించిన ఆనవాలుగా తన వినూతనానుభవాన్ని తప్తస్పృహ చేశారు మౌనశ్రీ మల్లిక్. Mounasri Mallik విషాద రుద్రవీణానాదాల్లో, హేయఘోషల్లో, ఆరని గాయాల్లో ఆత్మదీపమయ్యే కవిత్వాన్ని అన్వేషించారు. గుండె ఒంపిన మాటలతో పేర్చిన 64 కవితల కూడిక ఈ సంకలనం.
నేను సహస్ర బాహువులు కదిలించిన కవితా రథాన్ని అని కృతజ్ఞతాపూర్వకంగా తనను సాహిత్యకారుడిగా మలచిన వారిని గుర్తు చేసుకున్న మల్లిక్ కవిత్వమొక ఆర్తి అని భావించారు. స్థిరంగా, ఎంతో ధృడంగా ఏర్పడిన ప్రాపంచిక దృక్పథం అనేక కవితల్లో కన్సిస్తుంది. శ్రమదోపిడి, పీడన, అణచివేతలపైన మల్లిక్ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఉత్పత్తి సంబంధాలు, సంఘర్షణలు, అసమానత, రాజకీయ దుస్థితి, అన్యాయాలు, శ్రమైక జీవన సౌందర్యం, నాగరికత, కళలు, సంస్కృతి, మానవ సంబంధాలు, జన చైతన్య ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రం వంటి అంశాలలో నిష్కర్షగా తన కవితాభిమతాన్ని వెల్లడించారు.
ఎన్నెన్నో విధ్వంసాల తర్వాత కూడా/ఆకాశం నిర్మలంగానే ఉంటుంది/ నవతరమా…/ చరిత్ర మనోగతాన్ని/ హృదయంపై లిఖించుకో…/ మార్పు ఎప్పటిదో కాదు…/ అది వర్తమానాన్ని చెందిన వ్యవహారమని గుర్తించుకో అంటూ కొత్త తరాన్ని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మాసిన వస్ర్తాలను విప్పి/ శుచిగా శుభ్రపరచుకున్నట్లు/ మలినమైన ప్రతిసారి/ అనురాగాలు పొంగారు ప్రేమ గంధం పూసుకో /మాయమై పోతున్న మనిషి తనపు ఆనవాళ్లను / విత్తనాలుగా చల్లమని మనిషిని మేల్కొల్పే యజ్ఞగీతం ఆలపించారు. అంతా అనుకున్నట్టుగానే జరిగింది/ వాడు నాలుగు నినాదాలను/ గాల్లోకి విసిరి/కుర్చీ మీద కూర్చున్నాడు. అందరికీ తెలుసు ఒరిగేదేమీ లేదని/ ఐనా వెర్రి భ్రమలో/ కొందరు గొంతులు చిట్లిపోయే వరకు/ జై కొడుతూ/ జెండాలు మోస్తూనే ఉంటారు అని సమకాలీన రాజకీయాలను తేటతెల్లంగా విశ్లేషించారు.
తన ఊరు చిన్ననాటి జ్ఞాపకాలకు మల్లిక్ అద్దిన అక్షరాలు చదివే వారిని వారి గతంవైపు నడిపించే తీరుతాయి. అక్షరాలు నేర్పింది మా సర్కారుబడి /ఈత నేర్పినవి మా ఊరు బావులు/ జ్ఞానాన్ని పంచింది శాఖా గ్రంథాలయం/ భుజం తట్టినవి మాత్రం/ ఏవో నాలుగు చేతులు/ వాటికి మాత్రం నమస్కారం అనడంలో కవి హృదయాంతరంగంలో దాచుకున్న జ్ఞాపకాల గవ్వలమూట కన్పిస్తుంది. వైషమ్యాల మధ్య నిత్యం నలిగిన జీవితానికి చల్లని ఓదార్పుగా మారి ధైర్యమిచ్చిన వర్దన్నపేట ఆకేరు వాగుకూ కృతజ్ఞత అందింది. చేరుకొని సేదతీరుతున్నప్పుడే/ నదికి తెలుస్తుంది/ మన గమ్యమది కాదని /మరేదో ఉందని చెబుతూ భ్రమల నీడల నుండి బయట పడమంటారు. జీవితం కూడా కలే/ లేకుంటే ఎందుకీ మెలకువలు అని ప్రశ్నిస్తారు. కీర్తి శిఖరాల మీద నిలబడి / కిందికి తొంగి చూస్తున్నప్పుడు/ పాదాలకంటిన మట్టి రేణువులు/ అవహేళన చేస్తూనే వుంటాయి అనడంలో తన లోతైన పరిశీలనను వ్యక్తపరిచారు. యుగాల తరబడి చరిత్ర పుటల్లో మూలుగుతున్న జ్ఞానామృతాన్ని నేర్పుతో మెదడులోకి ఒంపుకోమంటూ భుక్తి కోసమే కాదు బుద్ధి కోసమూ చదవమని చెబుతారు. పతనమౌతున్న విలువలను మంచితనపు ఔషధంతో కాపాడేవాడే సిసలైన మనిషి అని నిర్ధారిస్తారు. అణగారినోళ్లకు ఆలంబనైన తంగేడు పువ్వును జీవన వికాసపు ఆరాధ్య బంధంగా అభివర్ణిస్తారు. చిన్ని మొక్కలను స్వార్థం అంటని మహోన్నత ప్రతీకలుగా భావించి వాటిలా జీవించడం మనిషి నేర్చుకోవాలంటారు. కడదాక మనిషి గొడవతీరు మారదని చెబుతారు. తాత్వికత, పరిణత కలిగిన మాటల్లెన్నో పలు కవితల్లో కనిపిస్తాయి. దాశరథిని గురించి చెబుతూ నమ్మిన సిద్ధాంతానికి అమృతం తాపిన త్యాగ శీలివి.. తెగిబడిన నరకంఠాల/ చివరి చూపుల్లో ఇంకిన ఆక్రందనల్లో/ ఎర్రమందారమై వికసించిన ఉషస్సు నీవు/ గాయపడిన నీ గుండెల్లో/ రాయబడని కావ్యాలెన్నో అని నివాళులు అర్పించారు. నిత్య శస్త్ర చికిత్సలతో అతుకుల బొంతైన దేహం వేదనను అక్షరీకరించారు. నోరు తెరిచి అన్యాయాన్ని ప్రశ్నించమంటారు. విమానయానంలో నల్లదుప్పటి కప్పుకున్న మహా సముద్రాలను, కొండచిలువలుగా మారి నిద్రపోతున్న నదులను గుర్తు చేసుకుంటారు. కసురుతూ కక్ష సాధిస్తున్న సూర్యుడి ప్రచండంలోని పరివేదనను తెలుసుకొమ్మంటారు. విరామం ఎరగక చివరి సిరాబొట్టు వరకు నమ్మిన బంటులా పనిచేసే పెన్ను జేబులో ఉంటే నిజం వెంట ఉన్నంత ధైర్యమని అంటారు. ప్రేమే మానవ మనుగడకు సంజీవకరణిగా నిలుస్తుందని వివరిస్తారు. మెదడును మైదానంతో, ఆలోచనలను అంకురాలతో పోలుస్తారు. మార్పును యుగళ గీతమంటారు. కళావతరణాన్ని కోరుకుంటారు. మళ్లీ ఈ మట్టిలోనే పుట్టాలని కళల విత్తనాలు చల్లి నవతకు నాందీ గీతమై పల్లవించిన అబ్దుల్కలాంను స్మృతివీచికగా స్మరిస్తారు. అప్రమత్తతను సాధిస్తేనే చైతన్య దీపాలమవుతామంటూ ధైర్యం నూరిపోస్తారు. పరుగులు తీసే జింకలు కొన్నేళ్లు బతికినా మేలే అంటూ మృగరాజులను కీర్తిస్తాం కాని జింకల కంటే అవి గొప్పవేమీ కావని చెబుతారు. ఆడి గెలవడం ఆనందం/ ఓడి గెలవడం ఆత్మానందం/ తనను తాను గెలవడం/ పరమానందం అంటూ విజయాన్ని నిర్వచించడం ఎంత కష్టమో తెలిపారు. ప్రేమే రెండుగా కనిపించడమే అద్వైత భావనగా చెప్పి విభిన్న కోణాలలో ప్రతీకాత్మకంగా చూపించారు. రచనా ప్రతిభ, ఇతివృత్త వైవిధ్యం కనిపిస్తుంది. దృక్కుల భాషను కవి కవన నీరాజనం చేశారు. జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం/ కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం అన్నట్టుగా ప్రబలంగా కదిలించే కవిత్వ సంయోగ సాధనకు తప్తస్పృహ నిదర్శనం.
-తిరునగరి శ్రీనివాస్, 9441464764
Be the first to comment