
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసించారు. భారీ సంస్కరణలతో తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం ద్వారా సానుకూల మార్పులు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆశావాహ దృక్పథాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు విద్యార్ధులు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ హైదరాబాద్‌లో జరిపిన పర్యటనను పురస్కరించుకుని రామకృష్ణ మఠం నిర్వహించిన వెబినార్‌లో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్ నారాయణ్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేపీ ముఖ్య అతిథిగా, ఆకాశవాణి మాజీ అనౌన్సర్, వ్యాఖ్యాత దక్షిణామూర్తి ప్రధాన వక్తగా హాజరయ్యారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద వెబినార్‌కు హోస్ట్‌గా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటనపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. స్వామి వివేకానంద 1893 పర్యటనలో భాగంగా ఎవరెవరిని కలిశారు, ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఏఏ చారిత్రక స్థలాలను సందర్శించారనేది వీడియోలో పొందుపరిచారు. మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై సుమారు వెయ్యిమంది ముందు ఇచ్చిన ఆంగ్ల ప్రసంగంతో స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం పెరిగిందనే విషయాన్ని స్వామి బోధమయానంద చెప్పారు. మహబూబ్ కాలేజీలో ప్రసంగం స్వామి వివేకానందకు రిహార్సల్ మాదిరిగా, తన భాషా నైపుణ్యాన్ని పరీక్షించుకునేందుకు కలిసి వచ్చిన అవకాశంగా భావించారని బోధమయానంద తెలిపారు. స్వామి వివేకానంద చారిత్రక హైదరాబాద్ పర్యటనను ప్రభుత్వమే వారోత్సవాలుగా నిర్వహించాలని రామకృష్ణ మఠం సూచించింది.
వెబినార్ చివరలో జాగో మేరే భారత్ వాసి సమయ్ నహీహై సోనేకా అంటూ రామకృష్ణ మఠం విద్యార్ధులు ఆలపించిన దేశభక్తి గీతాన్ని ప్రదర్శించారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు నడుం కట్టాలంటూ భారత యువతను తట్టి లేపిన పాట అది.
Be the first to comment