రేడియో మెకానిక్ కుమార్తె .. ఆకాశవాణి వ్యాఖ్యాత.. ఉగాది వేళ స్ఫూర్తిదాయక కథనం

నిజామాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రేడియో మెకానిక్ చిలకమర్రి రంగాచార్యులు,శిలా రాణి దంపతుల కుమార్తె మాధురి నిజామాబాద్‌లో రేడియో వ్యాఖ్యాతగా ఎంపికై ఆకాశవాణి ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు. ఓ సాధారణ గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే నేడు తన పని తీరుతో… మల్టీ టాలెంటడ్ మాధురి అంటూ సీనియర్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

10 సంవత్సరాలుగా ఆకాశవాణితో అనుబంధం ఉన్న మాధురి సముద్రాల ప్రస్తుతం “మధుర టాక్స్” పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ కూడా విజయవంతంగా నడుపుతున్నారు.

ఎం ఏ, బిఈడీ చేసిన మాధురి 18 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. రామకృష్ణ మఠంతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్న మాధురి తన సక్సెస్‌కు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలే కారణమని మాధురి చెబుతున్నారు.

రేడియో అనుభవం కూడా తోడై ఆమె మథురా టాక్స్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. రేడియో వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, జర్నలిస్ట్‌గా, న్యూస్ రీడర్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా మాధురి పేరు తెచ్చుకున్నారు. ఓ సాధారణ రేడియో మెకానిక్ కుమార్తె రేడియో వ్యాఖ్యాతగా కావడానికి అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకు ఆమె నిరంతరం కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు.

అదే సమయంలో తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే నేడు తన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నట్లు మాధురి చెప్పారు.

మరిన్ని విశేషాలు మాధురి మాటల్లోనే…

మన సంస్కృతి, సంప్రదాయాలపై పాఠశాల స్థాయి నుంచే నాకు ఆసక్తి. అందుకే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. న్యూనతాభావం వల్ల…. ముందుకు వెళ్ళడానికి భయపడేదాన్ని. “బలమే జీవనం, బలహీనతే మరణం”అన్న స్వామి వివేకానంద సూక్తిని విన్న తరువాత ఏదైనా సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. ప్రైవేట్ టీచర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరిగారి మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఆ తర్వాత ఆకాశవాణివైపు అడుగులు పడ్డాయి. ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పాల్ రాజశేఖర్ గారి ప్రోత్సాహం మరవలేను. స్వేచ్ఛనివ్వడంతో పాటు ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించడంలో ఆయన సహకరించారు. కార్యక్రమాల రూపకల్పనలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దువ్వూరి రాజారెడ్డి గారు, నిహారా కానేటి గారు కూడా ఎంతగానో ప్రోత్సహించారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సద్గురువుల ఆశీస్సులతో పాటు కుటుంబసభ్యులు, ఆత్మీయ స్నేహితుల సహకారం వల్లే అనౌన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.

ఉమ్మడి కుటుంబంలో ఉన్న నాకు కుటుంబ సభ్యులందరినుంచీ సంపూర్ణ సహకారం లభించింది. వారందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

 

 

 

 

నాపై రామకృష్ణ మఠం ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద సాహిత్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నాకు నిరంతరం స్ఫూర్తినందిస్తోంది.

 

“మధుర టాక్స్” యూ ట్యూబ్ ఛానెల్

ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడే అంశాలను అందరికీ అందించాలనే సదుద్దేశoతో నా కుమార్తె మధురాశ్రిత పేరుపై “మధుర టాక్స్” అనే యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభం చేశాను.

 

ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంప్రదాయాలతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను యూ ట్యూబ్ ద్వారా అందించడమే.. “మధుర టాక్స్” ఛానల్ ప్రధాన ఉద్దేశం.

చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఒక విషయాన్ని నేరుగా చేరవేడంలో సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, మనో నిగ్రహానికి, ధృడ సంకల్పనికి సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారాయి.

ఇందులో భాగంగానే “మధుర టాక్స్” ద్వారా రేపటి భారత పౌరులైన, చిన్నారులకు వివేకానంద సాహిత్యంతో పాటు, భగవద్గీత పఠనం, నీతి కథలు, సేవ తదితర అంశాలతో “మధుర టాక్స్” మిమ్మల్ని అలరిస్తుంది. మీ ఆశీస్సులు సదా కోరుకుంటూ

 

-మాధురి సముద్రాల, నిజామాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*