
‘మన్ కి బాత్’ (76 వ ఎపిసోడ్) ప్రసార తేదీ: 25.04.2021
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ మన్ కీ బాత్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. చాలామంది మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న తరువాత దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందింది. కానీ ఈ తుఫాను దేశాన్ని కదిలించింది.
మిత్రులారా! గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమకు చెందినవారు, టీకా తయారీదారులు, ఆక్సిజన్ ఉత్పత్తిలో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్నవారు తమ ముఖ్యమైన సలహాలను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయంలో- ఈ యుద్ధంలో విజయం సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.
‘दवाई भी – कड़ाई भी’ #MannKiBaat pic.twitter.com/6HLi6AymiX
— PMO India (@PMOIndia) April 25, 2021
మిత్రులారా! దేశంలోని వైద్యులు ,ఆరోగ్య కార్యకర్తలు ఈ సమయంలో కరోనాపై భారీ పోరాటం చేస్తున్నారు. గత ఏడాదిలో ఈ వ్యాధికి సంబంధించి వారికి అన్ని రకాల అనుభవాలు కలిగాయి. ముంబాయికి చెందిన ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ శశాంక్ జోషి ఈ సమయంలో మనతో ఉన్నారు.
కరోనా చికిత్స, సంబంధిత పరిశోధనలలో డాక్టర్ శశాంక్ గారికి చాలా అనుభవం ఉంది. ఆయన ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ డీన్ గా కూడా ఉన్నారు. డాక్టర్ శశాంక్ గారితో మాట్లాడదాం: –
మోదీ: నమస్కారం డాక్టర్ శశాంక్ గారూ!
డాక్టర్ శశాంక్: నమస్కారం సార్!
మోదీ గారు: కొద్ది రోజుల క్రితం మీతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. మీ ఆలోచనలలోని స్పష్టతను నేను ఇష్టపడ్డాను. దేశంలోని ప్రజలందరూ మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నేను భావించాను. మనం వింటున్న విషయాలను నేను మీకు ప్రశ్నగా అందిస్తున్నాను. డాక్టర్ శశాంక్ గారూ.. మీరు ప్రస్తుతం రాత్రింబగళ్లు ప్రాణాలను రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొదట మీరు కరోనా రెండవ దశ గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. వైద్యపరంగా ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? ఏ జాగ్రత్తలు అవసరం?
డాక్టర్ శశాంక్ : ధన్యవాదాలు సార్. ఇది రెండవ వేవ్. ఇది వేగంగా వచ్చింది. కాబట్టి ఈ వైరస్ మొదటి వేవ్ కంటే వేగంగా నడుస్తోంది. కాని మంచి విషయం ఏమిటంటే ఈ దశలో వేగంగా కోలుకుంటున్నారు. మరణాల రేట్లు చాలా తక్కువ. ఇందులో రెండు- మూడు తేడాలు ఉన్నాయి. ఇది యువతలో, పిల్లలలో కూడా కొద్దిగా ప్రభావాన్ని కలిగిస్తోంది. గతంలో కరోనా లక్షణాలైన శ్వాస తీసుకోలేకపోవడం, పొడి దగ్గు, జ్వరం- ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కొంచెం వాసన, రుచి తెలియకపోవడం కూడా ఉంది. ప్రజలు కొద్దిగా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. 80-90 శాతం మందికి ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ ఉత్పరివర్తనాలు భయాందోళనకు గురిచేసేవి కాదు. మనం బట్టలు మార్చినట్టుగానే వైరస్ కూడా దాని రంగును మారుస్తుంది. అందువల్ల భయపడటానికి ఏమీ లేదు. మనం ఈ దశను దాటుతాం. వేవ్ వస్తూపోతూ ఉంటుంది. ఈ వైరస్ వస్తూపోతూ ఉంటుంది. ఇవి విభిన్నమైన లక్షణాలు. వైద్యపరంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కోవిడ్ 14 నుండి 21 రోజుల టైమ్ టేబుల్. ఇందులో వైద్యుల సలహా తీసుకోవాలి.
I would like to commend all those individuals and organisations who are helping others in defeating COVID-19. #MannKiBaat pic.twitter.com/Ct5nNvCdJw
— PMO India (@PMOIndia) April 25, 2021
మోదీ : డాక్టర్ శశాంక్ గారూ! మీరు చెప్పిన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు చాలా లేఖలు వచ్చాయి. వాటి ప్రకారం ప్రజలకు చికిత్స గురించి చాలా సందేహాలు ఉన్నాయి. కొన్ని ఔషధాల అవసరం చాలా ఉంది. కాబట్టి కోవిడ్ చికిత్స గురించి చెప్పండి.
డాక్టర్ శశాంక్: అవును సార్! క్లినికల్ ట్రీట్మెంట్ ను ప్రజలు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఈ వ్యాధి చికిత్స స్వయంగా చేసుకుంటారు. వారు నమ్మకంతో జీవిస్తారు. మొబైల్లో వస్తున్న విషయాలను విశ్వసిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని అనుసరిస్తే మనకు ఈ కష్టం ఎదురుకాదు. కోవిడ్ క్లినికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో మూడు రకాల తీవ్రతలు ఉన్నాయి. ఒకటి తేలికపాటి కోవిడ్. రెండవది మధ్యస్థంగా ఉండే కోవిడ్. మూడవది తీవ్రమైన కోవిడ్.
తేలికపాటి కోవిడ్ విషయంలో ఆక్సిజన్ ను, పల్స్ ను, జ్వరాన్ని పరిశీలిస్తూ ఉంటాం. జ్వరం పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పారాసెటమాల్ వంటి మందులను వాడతాం. కోవిడ్ మధ్యస్థంగా కానీ తీవ్రంగా కానీ ఉంటే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. సరైన, చవకైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాల్లో ఉండే స్టెరాయిడ్లు ఇన్హేలర్ల లాగా ప్రాణాలను కాపాడతాయి. మందులతో పాటు ఆక్సిజన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. దీనికి చిన్న చిన్న చికిత్సలున్నాయి. రెమ్‌డెసివిర్ అనే కొత్త ప్రయోగాత్మక ఔషధం ఉంది. ఈ ఔషధంతో ఉపయోగం ఏమిటంటే దీనివల్ల ఆసుపత్రిలో రెండు మూడు రోజులు తక్కువ కాలం ఉండవచ్చు. క్లినికల్ రికవరీలో ఈ ఔషధం కొద్దిగా ఉపయోగపడుతుంది. మొదటి 9-10 రోజులలో ఇచ్చినప్పుడు ఈ ఔషధం పనిచేస్తుంది. దీన్ని కేవలం ఐదు రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. రెమ్‌డెసివిర్ వెనుక పరుగెత్తడం ఉండకూడదు. ఈ ఔషధం ఆక్సిజన్ అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే – అది కూడా ఆసుపత్రిలో చేరిన తర్వాత డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ప్రజలందరినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ప్రాణాయామం చేస్తాం. మన ఊపిరితిత్తులను కొద్దిగా విస్తరిస్తాం. రక్తాన్ని పల్చగా చేసే హెపారిన్ అనే ఇంజెక్షన్ మొదలైన చిన్నచిన్న మందులు ఇస్తే 98% మంది ప్రజల్లో తగ్గిపోతుంది. ఆశావహ దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం. వైద్యుడి సలహాతో చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఈ ఖరీదైన ఔషధాల వెంట పడవలసిన అవసరం లేదు సార్. మన దగ్గర మంచి చికిత్స ఉంది. ప్రాణ వాయువు ఆక్సిజన్ ఉంది. వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉంది. ప్రతిదీ ఉంది. ఈ ఔ షధాలను నిజంగా అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలి. ప్రపంచంలోనే ఉత్తమమైన చికిత్స మనకు అందుబాటులో ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను సార్. భారతదేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది. ఐరోపా, అమెరికా దేశాలతో పోలిస్తే మన చికిత్స పద్ధతులు బాగున్నాయి సార్.
మోదీ : చాలా ధన్యవాదాలు డాక్టర్ శశాంక్ గారూ! డాక్టర్ శశాంక్ గారు మనకు ఇచ్చిన సమాచారం చాలా ముఖ్యమైంది. మనందరికీ ఉపయోగపడుతుంది.
మిత్రులారా! మీకు ఏదైనా సమాచారం కావాలంటే- మీకు ఏవైనా సందేహాలుంటే అధీకృత సమాచారాన్ని పొందండి. సమీపంలోని వైద్యులను కానీ మీ కుటుంబ వైద్యుడిని కానీ సంప్రదించండి. ఫోన్ ద్వారా వారిని సంప్రదించి సలహా తీసుకోండి. మన వైద్యులు చాలా మంది ఈ బాధ్యతను స్వయంగా తీసుకుంటున్న విషయం నేను చూస్తున్నాను. చాలా మంది వైద్యులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా కౌన్సెలింగ్ చేస్తున్నారు. చాలా వైద్యశాలల వెబ్సైట్లలో సమాచారం కూడా అందుబాటులో ఉంది. ఆ వెబ్ సైట్ల ద్వారా మీరు వైద్యులను సంప్రదించవచ్చు. ఇది చాలా ప్రశంసనీయం.
శ్రీనగర్ కు చెందిన వైద్యులు డాక్టర్ నావీద్ నజీర్ షా ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ నావీద్ శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్. ఆయన తన పర్యవేక్షణలో చాలా మంది కరోనా రోగులకు వ్యాధి నయం చేశారు. డాక్టర్ నావీద్ ఈ పవిత్ర రంజాన్ మాసంలో కూడా తన పనిని చేస్తున్నారు. ఆయన మనతో మాట్లాడటానికి కూడా వీలు చేసుకున్నారు. వారితో మాట్లాడదాం.
మోదీ : నావీద్ గారూ.. నమస్కారం!
డాక్టర్ నావీద్ – నమస్కారం సార్!
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారూ.. ‘మన్ కీ బాత్’ శ్రోతలు ఈ క్లిష్ట సమయంలో పానిక్ మేనేజ్మెంట్ ప్రశ్నను లేవనెత్తారు. ఆందోళనను, భయాన్ని దూరం చేసుకునే విషయంలో మీ అనుభవం నుండి మీరు వారికి ఏ సమాధానం ఇస్తారు?
డాక్టర్ నావీద్: కరోనా ప్రారంభమైనప్పుడు కోవిడ్ హాస్పిటల్ గా ప్రత్యేక హోదా పొందిన ఆసుపత్రి మా సిటీ హాస్పిటల్. ఈ వైద్యశాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది. ఆ సమయంలో భయానక వాతావరణం ఉంది. ఎవరికైనా కోవిడ్ సంక్రమిస్తే దాన్ని మరణశిక్షగా భావించేవారు. అటువంటి పరిస్థితిలో మా ఆసుపత్రిలో వైద్యులు, పారా-మెడికల్ సిబ్బందిలో కూడా ఒక భయంకరమైన వాతావరణం ఉంది. ఈ రోగులకు ఎలా చికిత్స చేయగలం? మాకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదా? మొదలైన ప్రశ్నలు వచ్చాయి. కానీ సరైన రక్షణ పద్ధతులను మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదు. కానీ సరైన రక్షణ పద్ధతులను పాటిస్తే మేము, మాతో పాటు మిగతా సిబ్బంది కూడా సురక్షితంగా ఉండవచ్చని కాలం గడుస్తున్న కొద్దీ మనం చూశాం. చాలా మంది రోగుల్లో వ్యాధి లక్షణాలు కూడా లేవు. 90-95% కంటే ఎక్కువ మంది రోగుల్లో చికిత్స లేకుండానే వ్యాధి నయమవుతోంది. కాలం గడిచేకొద్దీ కరోనా అంటే భయం తగ్గింది.
ఈ సమయంలో వచ్చిన ఈ రెండవ దశ కరోనా విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సమావేశాలకు దూరంగా ఉండడం మొదలైన రక్షణ చర్యలను పాటిస్తే మనం రోజువారీ పనులను చక్కగా చేసుకోవచ్చు. వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
మోదీ : డాక్టర్ నావీద్ గారూ.. టీకాలతో సహా చాలా విషయాల్లో ప్రజలకు చాలా సందేహాలున్నాయి. టీకా నుండి ఎంతమేరకు రక్షణ లభిస్తుంది? టీకా తర్వాత ఎంత భరోసా ఇవ్వవచ్చు? దీని గురించి మీరు చెప్తే శ్రోతలు ఎంతో ప్రయోజనం పొందుతారు.
డాక్టర్ నావీద్: కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మనకు కోవిడ్ 19 కి ఎటువంటి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. అప్పుడు మనం వ్యాధితో కేవలం రెండు విధాలుగా పోరాడవచ్చు. వాటిలో ఒకటి రక్షణ పొందడం. ఏదైనా సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే వ్యాధి నుండి బయటపడవచ్చని మనం మొదటి నుండి అనుకుంటున్నాం. ఈ సమయంలో రెండు వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ – రెండూ మన దేశంలో తయారైన టీకాలే. కంపెనీలు నిర్వహించిన ట్రయల్స్ లో వాటి సామర్థ్యం 60% కంటే ఎక్కువగా ఉందని తెలిసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటివరకు 15 నుండి 16 లక్షల మంది టీకా తీసుకున్నారు. అవును.. సోషల్ మీడియాలో చాలా అపోహలున్నాయి. దుష్ప్రభావాలు ఉన్నాయన్న భ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ టీకాలు వేసిన వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. జ్వరం, మొత్తం శరీరంలో నొప్పి లేదా ఇంజెక్షన్ ఉన్న చోట మాత్రమే నొప్పి మొదలైనవి ఇతర టీకాల మాదిరిగానే ఈ టీకా తీసుకున్నవారిలో కూడా కనబడుతున్నాయి. ఈ లక్షణాలన్నీ ప్రతి వ్యాక్సిన్‌తో సాధారణ సంబంధం కలిగి ఉంటాయి. అంతే తప్ప టీకా వేసుకున్న ఎవరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూడలేదు. అవును.. టీకాలు వేసిన తరువాత కొంతమంది పాజిటివ్ అయ్యారని ప్రజలలో ఒక భయం కూడా ఉంది. ఈ విషయంలో కంపెనీల నుండి మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ తరువాత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వారు పాజిటివ్ కావచ్చు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండదు. అంటే కోవిడ్ పాజిటివ్ ఉన్నా ప్రమాదకరం కాదు. కాబట్టి ఈ అపోహలు ఏవైనా ఉంటే వాటిని మన మెదడులో నుండి తొలగించాలి. మే 1వ తేదీ నుండి మన దేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అప్పుడు మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అందరూ టీకా తీసుకోవాలి. దానిద్వారా ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు మొత్తం సమాజాన్ని రక్షించుకోవచ్చు. అందరూ టీకా తీసుకుంటే కోవిడ్ 19 సంక్రమణ నుండి సమాజానికి రక్షణ లభిస్తుంది.
మోదీ : చాలా ధన్యవాదాలు డాక్టర్ నావీద్ గారూ.. మీకు పవిత్ర రంజాన్ నెల శుభాకాంక్షలు.
డాక్టర్ నావీద్ – చాలా చాలా ధన్యవాదాలు సార్.
మోదీ : మిత్రులారా! ఈ కరోనా సంక్షోభ సమయంలో టీకా ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అందువల్ల టీకా గురించి ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఉచిత వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. 45 ఏళ్లు పైబడిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. మే 1 నుండి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు దేశంలోని కార్పొరేట్ రంగం, కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే ఉద్యమంలో పాల్గొంటాయి. భారత ప్రభుత్వం నుండి ఉచిత వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. భారత ప్రభుత్వ ఈ ఉచిత వ్యాక్సిన్ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని నేను రాష్ట్రాలను కోరుతున్నాను.
మిత్రులారా! అనారోగ్యంలో ఉన్న మనల్ని, మన కుటుంబాలను చూసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మన ఆసుపత్రుల నర్సింగ్ సిబ్బంది ఒకేసారి చాలా మంది రోగులకు సేవ చేస్తారు. ఈ సేవ మన సమాజానికి గొప్ప బలం. నర్సింగ్ సిబ్బంది కృషి గురించి చెప్పగలిగే వారు నర్సులు. అందుకే రాయ్‌పూర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో తన సేవలను అందిస్తున్న సిస్టర్ భావనా ధ్రువ్ గారిని ‘మన్ కి బాత్’ కు ఆహ్వానించాం. ఆమె చాలా మంది కరోనా రోగులను చూసుకుంటోంది. రండి! ఆమెతో మాట్లాడదాం.
మోదీ : నమస్కారం భావన గారూ!
భావన: – గౌరవనీయ ప్రధానమంత్రి గారూ.. నమస్కారం!
మోదీ : భావన గారూ..
భావన: సార్..
మోదీ : ‘మన్ కీ బాత్’ వినే వారికి మీరు తప్పక చెప్పాలి. మీ కుటుంబంలో మీకు చాలా బాధ్యతలు ఉన్నాయని. ఎన్నో పనులున్నాయని. అయినా మీరు కరోనా రోగుల కోసం పని చేస్తున్నారు. కరోనా రోగులతో మీ అనుభవలను వినాలని దేశవాసులు ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే రోగికి దగ్గరగా, ఎక్కువ కాలం ఉండేవారు నర్సులే. అందువల్ల వారు ప్రతి విషయాన్నీ చాలా దగ్గరగా అర్థం చేసుకోగలరు.
భావన: సార్.. COVID లో నా మొత్తం అనుభవం 2 నెలలు సార్. మేము 14 రోజుల డ్యూటీ చేస్తాం. 14 రోజుల తరువాత మాకు విశ్రాంతి లభిస్తుంది. 2 నెలల తరువాత మా COVID విధులు రిపీట్ అవుతాయి సార్. నేను మొదటి సారి COVID డ్యూటీ చేసినప్పుడు ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. ఇది మే లో జరిగిన విషయం. నేను ఈ విషయాన్ని పంచుకున్న వెంటనే వారందరూ భయపడ్డారు. నేనంటే భయపడ్డారు. సరిగ్గా పని చేయమని నాకు చెప్పారు. అది ఒక భావోద్వేగ పరిస్థితి సార్. కోవిడ్ డ్యూటి చేసే సందర్భంలో నా కుమార్తె నన్ను అడిగింది “అమ్మా! కోవిడ్ డ్యూటీకి వెళుతున్నారా” అని. అది నాకు చాలా భావోద్వేగ క్షణం. కానీ నేను కోవిడ్ రోగి వద్దకు వెళ్ళినప్పుడు నేను ఇంటి బాధ్యతలను విడిచిపెట్టాను. నేను కోవిడ్ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మరింత భయపడ్డాడు. రోగులందరూ కోవిడ్ అంటే చాలా భయపడ్డారు సార్. వారికి ఏం జరుగుతుందో, తర్వాత మనం ఏం చేస్తామో వారికి అర్థం కాలేదు. వారి భయాన్ని అధిగమించడానికి వారికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చాం సార్. ఈ కోవిడ్ డ్యూటీ చేయమని అడిగినప్పుడు ముందుగా పిపిఇ కిట్ వేసుకొమ్మని చెప్పారు. ఇది చాలా కష్టం సార్. పిపిఇ కిట్ వేసుకుని డ్యూటీ చేయడం చాలా కష్టం. ఇది మాకు చాలా కఠినమైన పని. నేను 2 నెలల పాటు 14-14 రోజులు వార్డులో, ఐసియులో, ఐసోలేషన్‌లో ఉన్నా సార్.
మోదీ : అంటే, మీరు ఒక సంవత్సరం నుండి ఈ పని చేస్తున్నారు.
భావన: అవును సార్. అక్కడికి వెళ్ళే ముందు నా సహోద్యోగులు ఎవరో నాకు తెలియదు. మేము ఒక జట్టు సభ్యులలా వ్యవహరించాం సార్. వారికి ఉన్న సమస్యల గురించి వివరించాం. వారి భయాన్ని తొలగించాం. సార్.. కోవిడ్ అంటేనే భయపడే చాలా మంది ఉన్నారు. మేం వారి నుండి క్లినికల్ హిస్టరీని తీసుకునేటప్పుడు ఆ లక్షణాలన్నీ వాటిలో వస్తాయి. కానీ భయం కారణంగా వారు ఆ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా లేరు. మేము వారికి వివరించే వాళ్ళం సార్. తీవ్రత పెరిగినప్పుడు అప్పటికే వారి ఊపిరితిత్తులలోకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అప్పుడు వారికి ఐ. సి. యు. అవసరం ఏర్పడేది. అప్పుడు అతను వచ్చేవాడు. అతని కుటుంబ సభ్యులందరితో కలిసి వస్తాడు. మేము అలాంటి 1-2 కేసులను చూశాం సార్. మేము ప్రతి వయస్సు వారితో కలిసి పనిచేశాం సార్. వారిలో చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఉన్నారు. అన్ని రకాల రోగులు ఉన్నారు. మేము వారందరితో మాట్లాడినప్పుడు భయం వల్ల రాలేదని చెప్పేవారు. అందరి నుండి ఇదే సమాధానం వచ్చింది సార్. భయపడటానికి ఏమీ లేదని వారికి వివరించాం సార్. మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పేవాళ్ళం సార్. పద్ధతులను పాటించండని చెప్పేవాళ్ళం.
మోదీ : భావన గారూ.. మీతో మాట్లాడటం నాకు బాగా నచ్చింది. మీరు చాలా మంచి సమాచారం ఇచ్చారు. ఇది మన స్వంత అనుభవం నుండి వచ్చిన సమాచారం. ఇది ఖచ్చితంగా దేశవాసులకు సానుకూల సందేశాన్ని పంపుతుంది. చాలా ధన్యవాదాలు భావన గారూ!
భావన: చాలా చాలా ధన్యవాదాలు సార్. థాంక్యూ సో మచ్… జై హింద్ సార్..
మోదీ : జై హింద్!
భావన గారిలాంటి నర్సింగ్ స్టాఫ్ లక్షలాది మంది సోదరులు, సోదరీమణులు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది మనందరికీ పెద్ద ప్రేరణ. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.
మిత్రులారా! బెంగుళూరు నుండి సిస్టర్ సురేఖ గారు కూడా ఈ సమయంలో మనతో ఉన్నారు. సురేఖ గారు కె.సి. జనరల్ హాస్పిటల్లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. రండి! ఆమె అనుభవాలు కూడా తెలుసుకుందాం
మోదీ : నమస్తే సురేఖ గారూ!
సురేఖ: – మన దేశ ప్రధానితో మాట్లాడటం నాకు నిజంగా గర్వంగా, గౌరవంగా ఉంది సార్.
మోదీ : సురేఖ గారూ.. మీతో పాటు తోటి నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అందరూ అద్భుతమైన పని చేస్తున్నారు. మీ అందరికీ భారతదేశం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. COVID-19 కు వ్యతిరేకంగా ఈ పోరాటంలో ప్రజలకు మీ సందేశం ఏమిటి?
సురేఖ: – అవును సార్. బాధ్యతాయుతమైన పౌరురాలిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీ పొరుగువారితో వినయంగా ఉండండి. ముందస్తు పరీక్షలు, సరైన ట్రాకింగ్ మరణాల రేటును తగ్గించడానికి మనకు సహాయపడతాయి. అంతేకాకుండా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లో ఉండండి. సమీపంలోని వైద్యులను సంప్రదించి, వీలైనంత త్వరగా చికిత్స పొందండి. సమాజం ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలి. సానుకూలంగా ఉండాలి. భయాందోళనలకు గురిచేస్తే రోగి పరిస్థితి దిగజారుతుందని తెలుసుకోవాలి. మన ప్రభుత్వానికి చాలా కృతజ్ఞులం. టీకా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పటికే టీకా తీసుకున్నాను. నా స్వీయ అనుభవంతో నేను భారత పౌరులకు చెప్పాలనుకుంటున్నాను- ఏ వ్యాక్సిన్ కూడా వెంటనే 100% రక్షణను అందించదు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సమయం పడుతుంది. టీకా తీసుకోవడానికి భయపడకండి. దయచేసి టీకా తీసుకోండి. దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. అనవసరంగా ముక్కు, కళ్ళు, నోటిని తాకకుండా ఉండండి. దయచేసి భౌతిక దూరం పాటించండి. మాస్క్ సరిగ్గా వేసుకోండి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి. మీరు ఇంట్లోనే చేసుకోగల నివారణలు పాటించండి. దయచేసి ఆయుర్వేద కషాయాలను తాగండి. ప్రతిరోజూ ఆవిరి పీల్చడం, పుక్కిలించడం చేయండి. శ్వాస వ్యాయామం కూడా మీరు చేయవచ్చు. ఇంకొక విషయం- ఫ్రంట్‌లైన్ కార్మికులు, నిపుణుల పట్ల సానుభూతితో ఉండండి. మాకు మీ సహకారం అవసరం. మనందరం కలిసి పోరాడుదాం. కరోనా మహమ్మారి నుండి తప్పక బయటపడతాం. ప్రజలకు నా సందేశం ఇదే సార్.
మోదీ : ధన్యవాదాలు సురేఖ గారూ.
సురేఖ: – ధన్యవాదాలు సార్.
మోదీ : సురేఖ గారూ.. నిజానికి, మీరు చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి! మీ కుటుంబానికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు. భావన గారు, సురేఖ గారు తమ అనుభవాల నుండి చెప్పినట్లు నేను దేశ ప్రజలను కూడా కోరుతున్నాను. కరోనాతో పోరాడటానికి పాజిటివ్ స్పిరిట్ చాలా ముఖ్యం. దేశవాసులు సానుకూల దృక్పథంతో ఉండాలి.