సింగపూర్ వేరియెంట్ నిజం కాదు: మైక్రో బయాలజిస్ట్ బసిక ప్రశాంత్ రెడ్డి

సింగపూర్: కోవిడ్ 19 క్లస్టర్లలో సింగపూర్ వేరియెంట్ ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని మెదక్ జిల్లాకు చెందిన సింగపూర్ వాసి, తెలంగాణ కల్చరర్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి మరియు మైక్రో బయాలజిస్ట్ బసిక ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 18 సంవత్సరాలుగా సింగపూర్‌లో ఉంటున్న ఆయన ప్రస్తుతం మోనో క్లోనల్ యాంటీ బాడీస్‌తో కోవిడ్ -19 చికిత్సను అభివృద్ధి చేస్తున్న అక్కడి స్థానిక బయోటెక్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్‌గా సేవలు అందిస్తున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న వ్యక్తి గానే కాకుండా ఒక సూక్ష్మ జీవి శాస్త్ర నిపుణుడు (మైక్రోబయలాజిస్ట్) గా భారత ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను చూసి తెలుగు వారి అనుమానాలు నివృత్తి చేయడానికి వ్యక్తిగత స్థాయిలో అయన స్పందించి ఈ ప్రకటన చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో చూపిన విధంగా సింగపూర్‌లో కొత్త కరోనా రకం లేదు మరియు ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.

సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, “సింగపూర్ వేరియంట్” లేదని, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. ఇటీవలి వారాల్లో ఇక్కడ కొన్ని COVID-19 క్లస్టర్లలో గుర్తించిన కేసులకు ఫైలోజెనెటిక్ పరీక్ష చేసి భారత దేశంలో ఉత్పరివర్తనం చెందిన B.1.617.2 వేరియంట్‌గా గుర్తించినట్టు చెప్పింది. కాని ఎలాంటి వేరే కొత్త వేరియంట్ లేదు.

కావున పూర్తి వివరాలు తెలియకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయరాదని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయరాదని ఆయన వార్తా సంస్థలను కోరారు. సింగపూర్‌లో పూర్తి స్థాయి లాక్ డౌన్ లేదని అన్నారు. కావున భారత్‌లో ఉంటున్న వారు సింగపూర్‌లో ఉంటున్న వారి బంధువుల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*