పత్రికా రచనలో జాతీయవాద ధోరణి బలపడాలి: భాస్కర యోగి

హైదరాబాద్: ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ మధ్య కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, జాతి వ్యతిరేక శక్తుల చేతిలో మీడియా ఒక ఆయుధంగా మారిందని ప్రముఖ కవి, రచయిత డా. పి భాస్కరయోగి ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికల రూపురేఖలు మారిపోయాయని, స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకునే వారి చేతిలో ఆయుధంగా మారిపోవడంతో పత్రికల ప్రామాణికత కూడా దెబ్బతిందన్నారు. సమాజం కోసం పని చేయాల్సిన పత్రికలు వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం, పార్టీల కోసం పని చేసే స్థాయికి దిగజారడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భాస్కరయోగి ప్రధాన ఉపన్యాసం చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ కార్యక్రమం ఆన్ లైన్‌లో జరిగింది.
దేవర్షి నారదుల గురించి విపులంగా వివరించిన డా. భాస్కర యోగి, నేటి సమకాలీన ప్రపంచంలో పాత్రికేయుల కర్తవ్యాన్ని గుర్తుచేశారు. ధర్మ రక్షణ కోసం ప్రతి పాత్రికేయుడు జాతీయ భావాలు పెంపొందించుకుని కార్యోన్ముఖుడై ముందుకు సాగాలని ఉద్బోధించారు. జాతీయవాద భావనలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే విషయంపై చర్చ జరగాలన్నారు.

షోయబుల్లాఖాన్, వద్దిరాజు సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి, ముట్నూరి కృష్ణారావు, పిరాట్ల వెంకటేశ్వరరావులు పాత్రికేయులకు స్ఫూర్తిగా నిలిచారని అలాంటివారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని భాస్కరయోగి గుర్తు చేశారు. తెలుగునాట విలువలు కలిగిన మీడియా వ్యవస్థ ఏర్పడకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టబద్ధంగా పాత్రికేయులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే నిబద్ధతతో, నిజాయితీతో జాతీయవాద భావాలకు పెద్దపీట వేయాలని జర్నలిస్టులకు సూచించారు. `ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అన్న కాళోజీ, `పత్రికొక్కటున్న పది వేల సైన్యము’ అన్న నార్ల వారి మాటలను గుర్తు చేస్తూ పాత్రికేయుల ప్రాముఖ్యతను వివరించారు. నారద జయంతి సందర్భంగా జాతీయ భావాలను ప్రతి పాత్రికేయుడూ అలవర్చుకోవాలని కోరారు.

అంతకు ముందు సమాచారభారతి అధ్యక్షులు ప్రొ. గోపాలరెడ్డి మాట్లాడుతూ నారద జయంతి ప్రాధాన్యతను, సమాచారభారతి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచారభారతి ఉపాధ్యక్షులు వల్లీశ్వర్, కార్యదర్శి నడింపల్లి ఆయుష్‌తోపాటు సీనియర్ పాత్రికేయులు వేదుల నరసింహం, నరసింగరావు, దేవిక, మల్లేశం, వెంకట రత్నం, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*