మహమ్మారికి అడ్డుకట్ట ఇలా.. వందేళ్ల క్రితం చెప్పిన స్వామి వివేకానంద

హైదరాబాద్: వందేళ్ల క్రితం ప్లేగు అనే మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లక్షలాది మంది జనం దాని బారినపడ్డారు. ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, స్నేహతులను దూరం చేసింది. 1896-1898 నాటి పరిస్థితులు ఇవి. చాలా భయంకరమైన రోజులవి. ఆ సమయంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సహాయ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్లేగు నుంచి తమను తాము రక్షించుకోవడాని పాటించాల్సిన పది నియమాలను ఆయన సూచించారు. ఈ కరోనా కాలంలోనూ ఆ పది నియమాలు ఆచరణీయమంటున్నారు విజయవాడ‌లోని రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి సేవ్యానంద. కరోనా మహమ్మారిని దరి చేరనీయకుండా చేస్తాయంటున్నారు.

1. మీరు సంతోషంగా ఉంటే.. మేమూ కూడా సంతోషంగా ఉంటాం. మీరు బాధపడితే మేమూ బాధపడతాం. అందుచేత ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో మీ సంక్షేమం కోసం మేమూ ప్రార్థన చేస్తున్నాం.

 

2. మీ ఇంటిని పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోండి. నిల్వ ఉన్న ఆహారాన్ని, చెడిపోయిన ఆహారాన్ని తినొద్దు. బలహీనమైన శరీరం సులభంగా రోగాల బారిన పడుతుంది.

 

3. ఈ మహమ్మారి కాలంలో కామ, క్రోధాల జోలికి పోరాదు. మీ గృహస్థులైనా సరే.

 

4. వదంతులను నమ్మకండి.

 

5. భయాల వల్ల ఆందోళనకు గురికావొద్దనేదే మేము ముందుగా మీకు చేసే వినయపూర్వక ప్రార్థన. అందుకు బదులు భగవంతునిపై విశ్వాసంతో ఈ సమస్యను దూరం చేసేందుకు ఉత్తమమైన మార్గమేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అదే పనిని చేయడానికి ప్రయత్నిస్తున్న వారితో చేతులు కలపండి.

 

6. దేనికి భయపడాలి. రండి. అర్థం లేని ఈ భయాన్ని విడిచిపెట్టి.. భగవంతుని యొక్క అనంతమైన కృపలో నమ్మకం ఉంచి, నడుములు బిగించి కార్యరంగంలోకి దూకుదాం. మనం పవిత్రంగా, శుభ్రంగా ఉండే జీవితాలు గడుపుదాం. భగవంతుడి కరుణతో ఈ మహమ్మారి, దాని గురించిన భయం గాలిలో ఎగిరిపోతాయి.

 

7. అవినీతితోనూ, ఇతరులకు హాని చేసే విధంగా పని చేస్తూ డబ్బు సంపాదించాలని ప్రయత్నించే వారిని భయం ఎప్పటికీ వదిలిపెట్టి పోదు. కాబట్టి మరణ భయం వెన్నాడుతున్న ఈ రోజుల్లో ఆవిధమైన అవినీతి ధోరణులను విడిచిపెట్టడం ఎంతైనా మంచిది.

 

8. మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకనాడు మరణించాల్సిందే. పిరికి వారు మరలా మరలా ఈ మరణ బాధలకు లోనవుతుంటారు. ఎందుకంటే అది వారి మనసుల్లోని భయం వల్లనే కలుగుతుంది కాబట్టి.

 

9. ప్రతి సాయంత్రం, ప్రతి ప్రాంతంలోనూ భగవన్నామ సంకీర్తనం ఏర్పాటు చేయడం వలన మహమ్మారి మీద భయం పోతుంది.

 

10. ఎవరైతే నిస్సహాయులో వారికి జగన్మాతే స్వయంగా రక్షణగా ఉంటుంది. భయపడకండి.. భయపడకండి.. అని అమ్మ మనకు అభయాన్ని ఇస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*